ఆస్తమాకు ఏ ఆహారం తీసుకోవాలి

27-01-2019: మా అమ్మ వయసు యాభై ఒక్క సంవత్సరాలు. ఎత్తు అయిదు అడుగులు, బరువు అరవై ఎనిమిది కిలోలు. ఆస్తమాతో ఇబ్బంది పడుతోంది. బరువు తగ్గి, ఆస్తమా అదుపులో ఉండటానికి ఏ ఆహారం మంచిది?
- సుభాషిణి, నంద్యాల
అధిక బరువు కారణంగా కూడా మీ అమ్మగారికి ఆస్తమా ఇబ్బంది ఎక్కువగా ఉండొచ్చు. వయసును బట్టి, ఎత్తును బట్టి ఆమె బరువు సుమారుగా యాభై నుంచి అరవై కిలోల మధ్య ఉంటే మంచిది. బరువు తగ్గించుకోవడానికి ఆహారంలో, జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆస్తమా ఉన్నవారు పళ్ళు, కూరగాయలు అధికంగా తీసుకోవాలి. రోజుకు కనీసం రెండు రకాల పళ్ళు, ముఖ్యంగా బొప్పాయి, కర్బుజా, పుచ్చకాయ, జామ, దానిమ్మ వంటివి తినాలి. ఆకుకూరలు పుష్కలంగా తీసుకోవాలి. తెల్ల అన్నానికి బదులు ముడి బియ్యం లేదా ఏవైనా చిరు ధాన్యాలు తీసుకోవాలి.
 
 అన్నం కంటే కూర, పప్పు రెండు రెట్లు ఎక్కువ మోతాదులో ఉండాలి. వెన్న తీసిన పాలు లేదా పెరుగు మాత్రమే వాడాలి. తీపి పదార్ధాలకు దూరంగా ఉంటేనే మంచిది. తెల్ల బియ్యం, మైదా వంటి వాటితో చేసిన పదార్ధాలు తగ్గించాలి. పీచు పదార్ధాలను ఎక్కువగా తీసుకోవాలి. పప్పులు, చిరు ధాన్యాలు, సోయా వంటి వాటిల్లో పీచు అధికం. రోజూ ఓ అరగంట తేలికపాటి వ్యాయామం చేయాలి. ఇలా అన్నివిధాలుగా ఉపయోగపడే జీవన విధానాన్ని తనకు అలవాటు చెయ్యడం మంచిది.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్‌,
వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌
nutrifulyou.com