నిస్ర్తాణ వస్తే ఏం చేయాలంటే..

26-11-2018: రక్తసరఫరా వ్యవస్థ సవ్యంగా పనిచేసినప్పుడే కదా శరీర భాగాలన్నింటికీ ఆక్సిజన్‌ అందుతుంది. ఏ కారణంగానైనా ఈ వ్యవస్థ దెబ్బతింటే, కణజాలానికంతటికీ ఆక్సిజన్‌ అందక శరీరం అతలాకుతలం అవుతుంది. నీరసం, తీవ్రమైన నిస్సత్తువ కలగలిసి ఉండే ఈ స్థితి ఒక దశలో స్పృహ కోల్పోయేలా చేస్తుంది. దీన్నే నిస్ర్తాణ అంటారు. ఇలాంటి వారికి తక్షణమే వైద్య చికత్సలు అందకపోతే, శరీరంలోని కీలక అవయవాలన్నీ తమ పనితనాన్ని కోల్పోతాయి. అంతిమంగా ఇది ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు.
 
ఎందుకిలా?
నిస్త్రాణకు గురికావడానికి గల ప్రధాన కారణాల్లో గుండె రక్తాన్ని సరిగా పంపిణీ చేయకపోవడం కావచ్చు. తీవ్రమైన రక్తహీనత కావచ్చు. గుండెపోటు కావచ్చు. ఇవే కాకుండా ప్రమాదాల్లో ఎముకలు విరిగినప్పుడు రకస్రావం కావడం కావచ్చు. కొన్ని సార్లు ఎముకలు పూర్తిగా విరగకుండా పగుళ్లు బారతాయి ఈ స్థితిలో రక్తం బయటికి రాకుండా లోలోపల ఉన్న ఖాళీ ప్రదేశాల్లో చేరిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే చిన్న దెబ్బేలే అని నిర్లక్ష్యంగా ఉండిపోయే ప్రమాదం ఉంది. ఇదే కాకుండా తీవ్రంగా వాంతులు, విరేచనాలు అయినప్పుడు కూడా ఈ పరిస్థితి ఏర్పడవచ్చు., అయితే, స్పృహ కోల్పోయే నిస్త్రాణ స్థితి కన్నా ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
 
వాటిల్లో ముఖ్యంగా.....
నాడీ వేగం పడిపోవడం, ముఖం పాలిపోవడం, చర్మం పొడిబారడం, కాలివేళ్లు, చేతి వేళ్ల దగ్గర గట్టిగా నొక్కి వదిలేస్తే, వెంటనే పూర్వపు రంగుకు రాకపోవడం. ఇవే కాకుండా, నిలువెల్లా చమటలు వచ్చి, శరీరం చల్లబడ వచ్చు.
స్పృహ కోల్పోవడానికి ముందు బాగా బలహీనంగానూ, మగతగానూ ఉంటుంది. వాంతులు, వికారంతో పాటు, తీవ్రమైన దాహం ఉంటాయి.
శ్వాస తీసుకోవడం క ష్టమవుతుంది.
నాడీ వేగంగానూ, అస్తవ్యస్తంగానూ కొట్టుకుంటుంది. నాడీ దొరకడం కష్టమవుతోందీ అంటే, అప్పటికే ద్రవాలు లేదా రక్తాన్ని శరీరం సగం దాకా కోల్పోయిందని అర్థం.
ఈ స్థితిలో రోగి ఆక్సిజన్‌ కోసం ఆరాటపడుతుంటాడు. ఆక్సిజన్‌ అందకపోవడంతో మెదడు కణాలు దెబ్బ తినడం మొదలవుతుంది. ఆ తర్వాత కొద్ది సేపటికే రోగి స్పృహ కోల్పోవచ్చు. అప్పటికీ తగిన వైద్య చికిత్సలు అందకపోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది.
 
ప్రథమ చికిత్సగా....
ప్రథమంగా అంబులెన్స్‌ కు ఫోన్‌చేయాలి. .
రోగిని భయపడవద్దంటూ ధైర్యం చెప్పాలి. ఆ తర్వాత వెల్లకిలా పడుకోబెట్టి అతని తల కొంచెం కిందికి వాలిపోయేలా పెట్టాలి. గాయం లేని వైపునకు తల తిప్పాలి.
కాళ్లను కాస్త పైకి లేపి కొంచెం ఎత్తులో ఉంచాలి. కాకపోతే కాలి ఎముకలు ఏమైనా విరిగి ఉంటే ఆ భాగం పైన ఒత్తిడి పడకుండా జాగ్రత్త పడాలి. దుస్తులు బిగుతుగా ఉంటే వదులు చేయాలి. ముఖ్యంగా మెడ, ఛాతీ, నడుము భాగాల్లో ఏమైనా బంధించి ఉంటే విప్పేయాలి.
శ్వాస సరిగ్గా తీసుకుంటున్నాడో లేదో చూడాలి. ఏ కాస్త ఇబ్బందిగా ఉన్నా నోటిలో నోరు పెట్టి గాలి ఊదాలి. అంబులెన్స్‌ రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తరలించాలి.