లక్షణాలను బట్టే... ‘లింఫోమా’!

04-02-2019: వ్యాధికారక క్రిముల్ని చంపి, ఆరోగ్యాన్ని కాపాడవలసిన ‘లింఫోసైట్స్‌’కు కేన్సర్‌ సోకితే ‘లింఫోమా’ అంటారు. వ్యాధినిరోధక వ్యవస్థ కుదేలయ్యే ఈ రుగ్మతను ముందుగానే గుర్తిస్తే చికిత్సతో నయం చేయడం సులువే!
 
రోగనిరోధక వ్యవస్థ సమర్థంగా పని చేయాలంటే, తెల్ల రక్తకణాలైన లింఫోసైట్స్‌ ఆరోగ్యంగా ఉండాలి. ఈ కణాలు లింఫ్‌నోడ్స్‌, ప్లీహం, మెడ క్రింది వినాళ గ్రంథి, ఎముక మజ్జ, ఇతరత్రా శరీరావయవాల్లో తయారవుతూ ఉంటాయి. ఆయా ప్రదేశాల్లో కేన్సర్‌ తలెత్తితే ‘లింఫోమా’గా భావించాలి. లింఫోమాలో హడ్‌కిన్స్‌, నాన్‌ హడ్‌కిన్స్‌ అనే రెండు రకాలుంటాయి. ఈ కేన్సర్‌ లక్షణాలను తేలికగానే కనిపెట్టవచ్చు. కాబట్టి ఈ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అవేంటంటే....
మెడ, చంక, గజ్జల్లో నొప్పి లేని వాపులు
ప్లీహం పెరగడంతో పొట్టలో నొప్పి
జ్వరం, రాత్రుళ్లు చమటలు
నీరసం, శక్తి తగ్గడం
అకారణంగా బరువు తగ్గడం
దురదలు