అదే నాకున్న పెద్ద జబ్బు

జీర్ణక్రియ, విసర్జన క్రియ అత్యంత సహజంగా జరిగిపోవలసిన ప్రక్రియలు అంటూ ఉంటారు. కానీ, గత 10 ఏళ్లుగా నేను మలబద్ధకం సమస్యతో సతమతమవుతున్నాను. ట్రాక్టర్‌ డ్రైవర్‌నైన నాకు ఉండే  శరీర శ్రమ చాలా ఎక్కువ. అందుకు  అవసరమైన శక్తి కోసం మాంసాహారానికి ప్రాధాన్యమిస్తాను. రోజులో ఏదో ఒక పూట తప్పనిసరిగా మాంసాహారం ఉంటుంది. నా సమస్యకు అసలు కారణం ఇదేనని.. స్థానిక డాక్టర్‌ చెప్పారు అలా అని మానేస్తే నా వృత్తిలో నేను కొనసాగలేననిపిస్తుంది. అసలీ సమస్య ఎందుకు ఏర్పడుతుంది? దీన్ని అధిగమించే మార్గమే లేదా? ఈ స్థితిలో నేనేం చేయాలో ఏదైనా సలహా ఇవ్వండి?

                                                                                                                                                                                                - కె. నర్సింహ్మ, మిరియాల గూడ
సహజంగా చిన్న పేగులో జీర్ణం కాగా మిగిలిపోయిన వ్యర్థపదార్థాలు పెద్ద పేగుల్లోకి (కోలన్‌) చేరుకుంటాయి. అందులో ఎక్కువ భాగం పీచుపదార్థం,  రసాయన ప్రక్రియ తర్వాత విడిపోయి మిగిలిపోయిన వ్యర్థాలు, ద్రవం ఉంటాయి. పెద్ద పేగుల గోడలు ఆ వ్యర్థాల్లోంచి నీరు, ఖనిజ లవణాల వంటి వాటిని అవసరమైనంత మేర పీల్చేసుకుని, రక్తప్రవాహంలోకి ప్రవేశపెడతాయి. అప్పటికీ మిగిలిపోయిన వ్యర్థాలను, పెద్ద పేగుల గోడలు తమ సంకోచ వ్యాకోచాల ద్వారా మలాశయంలోకి నెడతాయి. ఈ సంకోచ వ్యాకోచాలు అటానమిక్‌ నాడీ వ్యవస్థ ద్వారా నియంత్రించ బడతాయి. అయితే ఏవైనా వ్యాధుల వల్లగానీ, దీర్ఘకాలికంగా వాడుతున్న కొన్ని మందుల వల్లగానీ, ఆహారపు  అలవాట్ల గానీ, కొందరిలో ఈ నాడీ వ్యవస్థ తన పనితనాన్ని కోల్పోతుంది. అంటే, పెద్దపేగుల గోడల సంకోచ, వ్యాకోచ ప్రక్రియ కుంటుపడుతుంది. పలితంగా మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. ఆహార పదార్థాల్లో సరిపడా పీచుపదార్థం లేకపోవడం, అవసరమైన మేరకు నీళ్లు తాగకపోవడం వంటివి మలబద్ధకం ఏర్పడటానికి దారి తీసే ఇతర ముఖ్య కారణాలు. మీ విషయానికొస్తే, ప్రతి రోజూ మాంసాహారం తీసుకునే అలవాటు ఉందన్నారు. అయితే మాంసంలో పీచుపదార్థం అసలే ఉండదు. అందుకే మాంసాహారుల్లో మలబద్ధకం సమస్య ఉండే అవకాశం చాలా ఎక్కువ. అయితే, మాంసాహారం తీసుకున్నా, రోజుకు ఒక పూటైనా పచ్చి కూరగాయల మిశ్రమంగా ఉండే సలాడ్‌ గానీ, విరివిగా పండ్లు తినడం గానీ, చేస్తే ఈ సమస్య ఉండదు.  దాదాపు మాంసానికి సమంగా ఆకుకూరలు, కాయగూరలు తినడం ఎవరికైనా తప్పనిసరి మాంసాహారులకు అది మరింత అవసరం. తరుచూ కీరా దోసకాయలు తినడం కూడా అవసరమే. వీటితో పాటు రోజుకు 4 నుంచి 5 లీటర్లు తాగడం అలవాటు చేసుకుంటే మీ సమస్యను సులభంగానే అధిగమిస్తారు ఒకవేళ అప్పటికీ మీ  సమస్య తొలగకపోతే గ్యాసో్ట్ర ఎంటరాలజి్‌స్టను సంప్రదించడం తప్పనిసరి. 
                                                                                                                                                                       - డాక్టర్‌ ఎల్‌. కిరణ్‌కుమార్‌ , గ్యాసో్ట్రఎంటరాలజిస్ట్‌