టీబీ మాత్రలు భోజనం ముందు వేసుకోవాలా?

ఆంధ్రజ్యోతి, 05-09-2017: ఇప్పటిదాకా టీబీ మందుల్ని భోజనం తర్వాతే వేసుకోవాలని డాక్టర్లు చెబుతూ వచ్చారు. అయితే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ వారు ఇందుకు భిన్నమైన ఒక కొత్త ప్రతిపాదన చేశారు. భోజనం చేసిన తర్వాత టీబీ మాత్రలు వేసుకున్న 25 మందిని పరిశీలించి ఆ మందుల ప్రభావం చాలా తక్కువగా ఉంటున్నట్లు వారు కనుగొన్నారు. ఆ మందుల ప్రభావం శరీరానికి అందడంలో ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లుగా వారు గమనించారు.
 
ముఖ్యంగా రిపాంపిసిన్‌, ఇసోనియాజిడ్‌, పిరాజినామైడ్‌ వంటి మందుల ప్రభావం బాగా తగ్గిపోతున్నట్లు తమ పరిశోధనల్లో తేలినట్లు వారు చెబుతున్నారు. అవే మందుల్ని భోజనానికి ముందు వేసుకుంటే టీబీ మీద వాటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటున్నట్లు వారు కనుగొన్నారు. అయితే పరగడుపున ఈ మాత్రలు వేసుకోవడాన్ని తట్టుకోలేరు. అలాంటి వారు భోజనం చేసిన కనీసం మూడు గంటల తర్వాత ఈ మాత్రలు వేసుకోవాల్సి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.