అతి దాహాన్ని అనుమానించాల్సిందే!

25-06-2018: దాహం వేస్తే ఎవరైనా ఏంచేస్తారు? నీళ్లు తాగుతారు, లేదా పళ్లరసాలు, మరేవో ద్రవపదార్థాలు తాగుతారు. అది సరేగానీ, తాగిన ప్రతి ఐదు-పది నిమిషాలకు ఓసారి మళ్లీ మళ్లీ దాహం వేస్తూ ఉంటే ఏమనుకోవాలి? ఎండలో వెళుతున్నప్పుడో, బాగా వ్యాయామం చేసినప్పుడో, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం తిన్నప్పుడో అయితే అది వేరే మాట. వాంతులు, విరేచనాలు అవుతున్నప్పుడు కూడా అలా అతిగా దాహం వేయవచ్చు. కానీ, అలాంటి ఏ ఒక్కటీ లేనప్పుడు కూడా అదేపనిగా దాహం వేస్తుంటే ఏమిటి అర్థం? ఎవరైనా అప్పుడు కూడా మామూలు విషయంగానే తీసుకుంటే ప్రమాదానికి చేరువైనట్లే అంటున్నారు పరిశోధకులు. ప్రత్యేకమైన కారణమేదీ లేకుండానే అతిగా దాహం వేస్తోందీ అంటే దాని వెనుక ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉండవచ్చుననేది వాస్తవం. ముఖ్యంగా, మదుమేహం, గుండె, కిడ్నీలు, కాలేయాలు దెబ్బతినడం వంటి కారణాలేవో ఉండే అవకాశం ఉంది. అంటున్నారు ఆ శాస్త్రవేత్తలు. కొన్నిసార్లు, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, అలర్జీలు, పిత్తాశయ పనితీరులో లోపాల వంటి సమస్యలు కూడా ఈ అతిదాహానికి కారణం కావచ్చు.
 
ఇలా ఇతర కారణాల వల్ల దాహం వేసే వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువ సార్లు మూత్రం రావడం, నీరసం, కడుపునొప్పి, చూపు మసకగా అనిపించడం. తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించడంలో ఇంకెంత మాత్రం జాప్యం చేయకూడదు అంటున్నారు వైద్యనిపుణులు. కాస్త ఎక్కువగా దాహం వేయడం కూడా సమస్యేనా? అంటే మామూలు సమస్య కాదు.. ఒక్కోసారి అది ప్రాణాపాయానికి దారితీసే సమస్యగా పరిణమించవచ్చునని కూడా వారంటున్నారు