కడుపులో కల్లోలం

03-12-2018: ఎన్నిసార్లు ఆహ్వానించినా కొందరు ఏ ఒక్క ఫంక్షన్‌కీ రారు. అది చూసి చాలా మంది ఇతనికి ఎంత అహమో కదా అనుకుంటారు. కానీ, వాస్తవం వేరు. ఐ.బి.ఎస్‌ (ఇరిటెబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌) అనే ఒక వ్యాధి వల్ల వచ్చే బాధలే ఇందుకు కారణం. విషయం ఏమిటంటే, మానసికమైన అసహ నం, కంపరం లాంటివే కొంతమంది పేగుల్లో కూడా కనపడుతుంటాయి. ముఖ్యంగా, వివిధ కారణాల వల్ల సహజంగా వీళ్ల పేగుల్లో ఉండే మృదుత్వం పోయి ఒక దశలో బాగా పలచబారి, దేన్నీ భరించలేని స్థితికి చేరుకుంటాయి.
 
ఈ కారణంగా ఎప్పుడు ఏం తిన్నా సరే క్షణాల్లో కడుపులో గుడగుడలు మొదలవుతాయి. వెంటనే టాయిలెట్‌లోకి పరుగెత్తాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే ఇలాంటి వాళ్లు బయట హోటళ్లకు గానీ, ఫంక్షన్లకు గానీ అసలే వెళ్లరు. ఒకవేళ వెళ్లినా భోజనం చేయరు. ఒకవేళ తప్పనిసరై చేయాల్సి వస్తే ఆ వెంటనే పరుగులు తీయకతప్పదు. ఎందుకొచ్చిన బాధ? అనుకుంటూ ఏ ఆహ్వానానికీ స్పందిచరు. ఒక దశలో బయటే కాదు ఇంట్లో తినడం కూడా బాగా తగ్గిస్తారు. దీనివ ల్ల రోజురోజుకీ చిక్కి శల్యమవుతుంటారు.
 
ఎందుకిలా?
నిజానికి, ఐ.బి.ఎస్‌ రావడానికి గల కచ్చితమైన కారణమేమిటో ఇప్పటి వరకూ తెలియదు. కాకపోతే , ఆహారంలో నూనె, మసాలాలు ఎక్కువగా ఉండడం, ఆల్కహాల్‌, కెఫీన్‌, కొవ్వు పదార్థాలు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌, సోడాలు అతిగా తీసుకోవడం వంటివి కొంత కారణంగా కనపడతాయి. శారీరకమైన వాటితో పాటు, ఐ.బి.ఎస్‌ రావడానికి మానసిక ఒత్తిళ్లు, దిగులూ, ఆందోళనలు కూడా కారణం.
 
లక్షణాలు,.....
ఈ స్థితిలో కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, కొద్దిరోజులు విరేచనాలు ఆ తర్వాత కొద్ది రోజులు మలబద్ధకం ఇలా పలురకాల ఇబ్బందులు ఉంటాయి. ఐ.బి.ఎస్‌ (ఇరిటెబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌) వ్యాధిగ్రస్థుల్లో నీరసం, నిస్సత్తువ ఆవరించి, ఒక రోగగ్రస్థ భావనతో ఉంటారు.
 
వైద్య చికిత్సలు....
ప్రస్తుతానికి ఐ.బి.ఎస్‌ను పూర్తి స్థాయిలో నయం చేసే మందులేవీ లేవు. కాకపోతే కడుపునొప్పి, విరేచచనాలు, మలబద్దకం వంటి ఆయా వ్యాధి లక్షణాలను తగ్గించే మందులు అందుబాటులో ఉన్నాయి.
 
మధుమేహుల్లో...
దీర్ఘకాలంగా మధుమేహం అదుపులో లేని కొంతమందిలో ‘అటనామిక్‌ న్యూరోపతి’ అనే సమస్య తలెత్తుంది. ఈ వ్యాధిలోనూ ఐ.బి.ఎస్‌ లక్షణాలే కనిపిస్తాయి. కానీ, ఈ రెండూ వేరు వేరు. అప్పుడప్పుడు మలబద్ధకంగానూ, ఆ తర్వాత వరుస విరేచనాలూ ఉంటాయి. పెద్ద పేగు కదలికల్లో వచ్చే తేడా వల్ల ఈ సమస్య మొదలవుతుంది. కొందరిలో చిన్న పేగుల్లో బ్యాక్టీరియా పెరిగిపోవడం వల్ల కూడా ఇలా కావచ్చు. చాలావరకు ఈ సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి. కొద్ది మందిలో ఇవి కొనసాగుతాయి కూడా! అలా కొన సాగినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్య చికిత్సలు తీసుకోవాలి. అయితే షుగర్‌ పేషంట్లలో ఐ.బి.ఎస్‌ లాంటి లక్షణాలు కనిపించినా వాళ్లలో ఉన్నది అటనామిక్‌ న్యూరోపతి తప్ప ఐ.బి.ఎస్‌ కాదనే విషయాన్ని మరిచిపోకూడదు. ఒకవేళ ఆ ఉన్నది ఐబిఎస్‌ సమస్యే అయితే అవసరమైన అన్ని జాగ్రత్తలూ పాటించాలి, నిజానికి, ఐబిఎస్‌ను తగ్గించడంలో మందుల కన్నా, మానసిక ఒత్తిడిని అధిగమించే ఇతర ప్రయత్నాల వల్లే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే వైద్య చికిత్సలు తీసుకోవడంతో పాటు శారీరక వ్యాయామాలకు కూడా అత్యధిక ప్రాధాన్యమివ్వాలి.
 
ఇవీ జాగ్రత్తలు.....
భోజనవేళల్ని అటూ ఇటూ మార్చకుండా, నిర్దిష్ట వేళల్లోనే భోజనం చేయాలి.
ఏ పూట కూడా భోజనం చేయడం మానుకోకూడదు.
కొవ్వు పదార్థాలను, ప్రాసెస్డ్‌ ఆహార పదార్థాలను తినకూడదు.
కాఫీ, టీలను రోజుకు 3 కప్పులకు మించి తీసుకోకూడదు.
మద్యపానానికి దూరంగా ఉండాలి.
ఇంట్లో వండిన తాజా ఆహార పదార్థాలే తీసుకోవాలి.
ఏ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఐ.బి.ఎస్‌ లక్షణాలు ఎక్కువవుతున్నాయో గమనించి వాటికి దూరంగా ఉండాలి.
మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు వ్యాయామాలతో పాటు విధిగా యోగా, ప్రాణాపాయం చేయాలి.
తరుచూ ప్రొబయాటిక్స్‌ కూడా తీసుకోవాలి.
-డాక్టర్‌ ఎస్‌.ఏ.రవూఫ్‌
ఎన్‌.ఆర్‌.డయాబెటిక్‌ అండ్‌ పాలీక్లినిక్‌,
ఓల్డ్‌ క్లబ్‌ రోడ్డు, గుంటూరు