నోటి అల్సర్లకు ‘పాలీమర్‌ ప్యాచ్‌’!

25-06-2018: నోటిలో అల్సర్లతో బాధపడుతున్నారా? ఇంతకుముందులాగా జెల్‌ రాసుకోవడమో, మౌత్‌వాష్‌లు వాడటమో చేయాల్సిన పనిలేదు... పుండు ఉన్న చోట బ్యాండ్‌ ఎయిడ్‌లాగా ‘పాలీమర్‌ ప్యాచ్‌’ వేస్తేచాలు వెంటనే ఉపశమనం లభించడమేగాక, త్వరగానే తగ్గిపోతుందంటున్నారు శాస్త్రవేత్తలు.
 
నోటి అల్సర్ల చికిత్సలో ఇటీవల విప్లవాత్మకమైన ఆవిష్కరణ జరిగింది. షిఫీల్డ్‌ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు నోట్లో పుండు ఉన్నచోట ఒక మెడికల్‌ ప్లాస్టర్‌ వేయడం ద్వారా దాన్ని పోగొట్టవచ్చంటున్నారు. కొన్ని ప్రత్యేకమైన పాలీమర్స్‌ ఉన్న ఆ ప్యాచ్‌ నోట్లో తడి ఉన్నా సులువుగా అంటుకుంటుంది. సదరు ప్యాచ్‌లో ఉండే స్టెరాయిడ్స్‌ నేరుగా అల్సర్లపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా అల్సర్లు తొందరగా తగ్గిపోతాయి.
 
సాధారణంగా నోటి అల్సర్లకు టాబ్లెట్లు, జెల్‌, మౌత్‌వాష్‌లను వాడుతుంటారు. అయితే అవి పుండుపైనేగాక నోరంతా వ్యాపిస్తాయి. దానివల్ల మందు ఎఫెక్టివ్‌గా పనిచేయట్లదనే భావన ఉండేది. ఈ కొత్తరకం పాలీమర్‌ ప్యాచ్‌ను పుండు ఉన్న ప్రాంతంలో అతికించడం ద్వారా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అల్సర్‌ త్వరగా మానిపోతుందని అంటున్నారు. ‘శరీరంపై దెబ్బ తగిలినప్పుడు ప్లాస్టర్‌ వేసినట్టే నోట్లో అల్సర్‌కు కూడా ప్లాస్టర్‌ వేయడం ద్వారా అది పుండుపై అత్యంత వేగంగా పనిచేయడం ప్రారంభిస్తుందని, దానివల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంద’ని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త క్రేగ్‌ మర్డోచ్‌ అంటున్నారు. ఈ ప్యాచ్‌ను కొందరు పేషంట్లపై ఇప్పటికే ప్రయోగించగా ‘అది చాలా సౌకర్యవంతంగా, ఎఫెక్టివ్‌గా ఉంద’న్నారు. ఈ పరిశోధన ఫలితాలను ఇటీవల ‘బయోమెటీరియల్స్‌’ అనే మెడికల్‌ జర్నల్‌లో ప్రచురించారు.