రాత్రి నిద్ర కరువైతే..

03-02-2018: కొందరేమో చిలుకల్లా పగలంతా పనిచేసి రాత్రంతా నిద్రిస్తారు. కొందరేమే గుడ్లగూబల్లా రాత్రంతా పనిచేసి పగలంతా నిద్రిస్తారు. అయితే ‘‘గుడ్లగూబ తరహా జీవన శైలిని అలవర్చుకున్న వారు ఎప్పుడో ఒకప్పుడు భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తుంది’’, అంటున్నారు పరిశోధకులు. మీరు చిలుకలు అవుతారో, గుడ్లగూబలుగానే ఉండిపోతారో మీకు మీరే తేల్చుకోండి.

 
‘‘త్వరగా నిద్రపోయి, త్వరగా మేల్కోవాలి’’ అనేది పాత కాలపు మాటలా అనిపించవచ్చు. రాత్రంతా పనిచేసి పగటిపూట నిద్రపోతే తప్పేంటి అనిపించవచ్చు. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఈ పంథానే అనుసరిస్తూ ఉండవచ్చు కూడా. కానీ, ఎక్కువ మంది అనుసరించే మార్గమే అయినంత మాత్రాన అది ఉత్తమమైనదేమీ అయిపోదు కదా! ఎప్పుడో అరుదుగా, అనివార్యంగా అయితే సరే కానీ, రాత్రుళ్లు మేల్కొనడమే జీవన శైలి కాకూడదు. అదే జరిగితే, ఆ ఎదురయ్యే పరిణామలు అన్నీ ఇన్నీ కావు....
కొంతమంది తాత్కాలిక అవసరాల కొద్దీ అనివార్యంగానే ఈ విఽధానాన్ని అనుసరించి ఉండవచ్చు. కానీ, ఆ తర్వాతర్వాత అదే ఒక అలవాటుగా మారిపోతుంది. రాత్రంతా మేల్కొనడంలో ఇబ్బంది కూడా ఏమీ అనిపించకపోవచ్చు. దానికి కారణం ప్రకృతి విరుద్ధంగా తమ జీవగడియారాన్ని (బయోలాజికల్‌ క్లాక్‌) సర్దుబాటు చేసుకోవడమే. కానీ, డాక్టర్ల అభిప్రాయం ప్రకారం, మునుముందు నిద్రా సమస్యలు, యుక్తవయసులోనే గుండె జబ్బులు, డిప్రెషన్‌ వంటి రుగ్మతల పాలయ్యే అవ కాశాలు ఎక్కువగా ఉంటాయి.
జి సహజంగా నిద్రించాల్సిన సమయంలో మేల్కొని ఉంటే శరీరం వేడెక్కుతుంది. ఇది జీవ క్రియల అలసత్వానికి కారణమవుతుంది. వ్యాధినిరోధక శక్తి కుంటుపడేలా చేస్తుంది. మనలోని హార్మోన్ల, ఎంజైముల ఉత్పత్తికి తమదైన ఒక కాలమాన ప్రణాళిక ఉంటుంది. సహజంగా గ్లూకోజ్‌ ఎక్కువగా అవసరమయ్యే ఉదయం వేళల్లో కార్టిజాల్‌ హార్మోన్‌ పెద్ద మొత్తంలో ఉత్పన్నమవుతుంది. శ్రమ తగ్గిపోయే సాయంత్రానికి ఆ ఉత్పత్తి త గ్గిపోతుంది. అయితే ఈ బయోలాజికల్‌ క్లాక్‌ను తారుమారు చేసినప్పుడు ఈ హార్మోన్‌ వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది.

బయోలాజికల్‌ క్లాక్‌ వ్యవస్థ అనేది మనిషి మనిషికీ వేరుగా ఉండదు. వ్యక్తుల శారీరక వ్యత్యాసాల వల్ల ఏదైనా తేడా ఉన్నా అది స్వల్పమే. అందుకే ఎవరికి వారు నిద్రా, మెలకువల సమయాన్ని తమ ఇష్టానుసారంగా మార్చుకోవడం కుదరదు. రాత్రంతా మేలుకునే వాళ్లు కొందరు ‘‘ ఈ టైమింగ్స్‌ వల్ల మాకు అసౌకర్యంగా గానీ, అస్వస్థతగా గానీ ఏమీ ఉండడం లేదు. పైగా ఉత్సాహంగా, హుషారుగానే ఉంటున్నాం. ఇక ఇబ్బంది ఏముంది?’’ అంటూ ఉంటారు. అయితే, పైకి అంతా సవ్యంగానే ఉన్నట్లు అనిపించినా, లోలోపల జరిగే నష్టం జరుగుతూనే ఉంటుంది.

మౌలికంగా సూర్యగమనానికీ, ఆకలికీ అవినాభావ సంబంధం ఉంది. ఉదయాస్తమయాల మధ్య సరిగ్గా పనిచేస్తూ ఉంటుంది. ఆలోచనలకూ, కార్యాచరణకూ మూలాధారంగా మనలో ఒక ప్రాణశక్తి ఉంటుంది. అది జీవితాంతం మన తోడై ఉంటుంది. అయితే రాత్రిళ్లు ఎక్కువగా మేల్కొనే వాళ్లల్లో ఈ ప్రాణశక్తి అత్యధికంగా ఖర్చు అవుతుంది. దీనివల్ల యుక్త వయసులోనే శరీరం రోగగ్రస్తం కావడం, అకాల వృద్ధాప్యం రావడం సంభవిస్తాయి. రాత్రివేళల్లో జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైములు కూడా స్వల్పంగానే ఉత్పన్నమవుతాయి. ఈ కారణంగా మధ్యరాత్రి చేసే భోజనం సరిగ్గా జీర్ణం కాదు. శరీరమంతా నిద్రావస్థలో ఉండడం కూడా ఇందుకు కారణమే. కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి జీర్ణాశయ సమస్యలే కాదు స్థూలకాయం రావడానికి కూడా ఈ కారణాలే ప్రధానంగా ఉంటాయి. అందుకే.....,నా శరీరం, నా ఇష్టం అనే ధోరణితో కాకుండా, ప్రకృతి సహజ నియమాలను ఎవరైనా విధిగా పాటించడమే శ్రేయస్కరం.