గురకతో మతిమరుపు?

31-08-2017: గురక ఇతరులను ఇబ్బంది పెట్టడమే కాకుండా గురకపెట్టేవారిని కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందంటున్నారు అమెరికా పరిశోధకులు. పెద్ద శబ్దంతో గురక పెట్టేవారిలో మతిమరుపు వస్తుందన్న విషయం వీరి అధ్యయనాల్లో వెల్లడైంది. మతిమరుపుతో పాటు వీరిలో ఆలోచనా శక్తి కూడా సన్నగిల్లుతుందని  వీరు అంటున్నారు. అమెరికాలోని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం 68 సంవత్సరాల వయస్సు కలిగిన సుమారు 1800 మంది మీద అధ్యయనం నిర్వహించారు. వీరిలో చాలా మందికి పెద్ద శబ్దంతో గురక పెట్టే అలవాటు ఉంది. వీరిలో క్రమేపీ మతిమరుపు, ఆలోచనా శక్తి సన్నగిల్లడాన్ని వీరు గుర్తించారు. సాధారణంగా 80 సంవత్సరాల తరువాత కనిపించే ఈ లక్షణాలు వీరిలో త్వరగా కనిపించడానికి గురకే కారణమని వీరు చెబుతున్నారు. వీరిలో కనిపించిన పై లక్షణాలకూ గురకకు కచ్చితంగా సంబంధం ఉందా? లేదా? అన్న విషయం మీద ఇంకా అధ్యయనాలు నిర్వహించాలని వారు స్పష్టం చేస్తున్నారు.