చికిత్సలకు.. ప్రాణ కణం

27-11-2017: నాలుగు లక్షల్లో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి అది. రక్త కణాలను ఒక్కొక్కటిగా చంపుకుంటూ దేహాన్ని నిర్వీర్యం చేసే ఆ వ్యాధి పేరు ‘ఫాన్కోని అనీమియా’. అలాంటి చిత్రమైన వ్యాధి వెతుక్కుంటూ వచ్చి నాలుగేళ్ల పసి మొగ్గను కమ్మేసింది. అయితేనేం...‘స్టెమ్‌ సెల్‌’ చికిత్స ద్వారా బాబు కన్న తండ్రే బిడ్డ ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. ఇంతకీ స్టెమ్‌ సెల్స్‌ అంటే ఏంటి? వైద్య చరిత్రను ములుపు తిప్పుతున్న మూల కణాలు, అవి నయం చేసే వ్యాధుల గురించి తెలుసుకుందాం!

ముల్లును ముల్లుతోనే తీయాలంటారు. అలాగే కణాలకు సంబంధించిన వ్యాధులకు కణాలతోనే వైద్యం చేయాలి. అలాంటి చికిత్సే మూలకణ మార్పిడి! ఒంట్లో విస్తరించి ఉండే మూల కణాలే మన ప్రాణాధారం.
 
కొన్ని జన్యుపరమైన సమస్యల వల్ల వీటి సంఖ్య తగ్గినా, మూల కణాలు రోగగ్రస్థమైనా... రక్తంతోపాటు, రోగనిరోధక శక్తి అడుగంటి, ఆయుష్షు తగ్గిపోతుంది. లుకేమియా (రక్త క్యాన్సర్‌) అనే ఈ వ్యాధికి సత్వర చికిత్స అందించకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటప్పుడు నశించిన స్టెమ్‌ సెల్స్‌ స్థానాన్ని కొత్త కణాలతో నింపటం, లేదా రోగగ్రస్థమైన మూల కణాలను చంపి కొత్త వాటితో భర్తీ చేయటం ఒక్కటే పరిష్కారం. ఇందుకోసం దాత ఎముక మజ్జ (బోన్‌ మ్యారో) నుంచి మూల కణాలను సేకరించి స్వీకర్తకు మార్పిడి చేస్తారు. ఇంతకు ముందు ఈ చికిత్సా విధానం కొంత సంక్లిష్టంగా ఉండేది. మూల కణాలను అవి పుష్కలంగా తయారయ్యే ఎముక మజ్జ నుంచి మాత్రమే స్వీకరించేవారు. కానీ ఇప్పుడు రక్తంలో తక్కువ సంఖ్యలో ఉండే మూల కణాలనే వడపోసి సేకరించి స్వీకర్తకు ఎక్కిస్తున్నారు.
 
బ్లడ్‌ గ్రూప్‌ సరిపోకపోయినా...
అయితే మూల కణ మార్పిడికి దాత, స్వీకర్త...ఇద్దరి బ్లడ్‌ గ్రూపులూ నూరు శాతం మ్యాచ్‌ అయితే ఫలితం సత్వరంగా వస్తుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల బ్లడ్‌ గ్రూప్‌లు మ్యాచ్‌ కాకపోవచ్చు. స్టెమ్‌ సెల్‌ బ్యాంకుల్లో కూడా సమయానికి అదే బ్లడ్‌ గ్రూప్‌ మూల కణాలు దొరకకపోవచ్చు. ఇలాంటప్పుడు బ్లడ్‌ గ్రూప్‌ 50ు మ్యాచ్‌ అయినా, మూల కణ మార్పిడి చేసి రోగిని బ్రతికించుకునేంతగా వైద్య విధానం అభివృద్ధి చెందింది. పైన చెప్పుకున్న బాలుడి కేసులో జరిగింది అదే!
 
ఎముక మజ్జలోనే... అంతా!
శరీరమంతా విస్తరించి ఉండే ఎముక మజ్జ శరీరంలో కీలకమైన, అద్భుతమైన బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఎముకల్లో దాగి ఉండే ఈ మజ్జలోనే ప్రతి క్షణం మిలియన్లకొద్దీ కణాలు పుడుతూ, మనల్ని ఆరోగ్యంగా ఉంచుతూ ఉంటాయి. మజ్జలో తయారయ్యే ఈ మూల కణాలే ఎర్రరక్త కణాలు (ఆక్సిజన్‌ను శరీరం మొత్తానికి చేరవేస్తాయి), తెల్లరక్త కణాలు (ఇన్‌ఫెక్షన్లతో పోరాడతాయి), ప్లేట్‌లెట్స్‌ (రక్తస్రావాన్ని ఆపుతాయి) గా రూపాంతరం చెందుతాయి. ఏ వ్యాధి ఎముక మజ్జ మీద దాడి చేసినా ఈ కణాలన్నీ ప్రభావితమవుతాయి. కొత్త కణాల ఉత్పత్తి జరగక, ఉన్న కణాలు నశించి, క్రమేపీ ఆరోగ్యం కుంటుపడుతుంది. ఈ పరిస్థితినే ‘లుకేమియా’ అంటారు. ఈ వ్యాధిలోనూ రకాలున్నాయి. అవేంటంటే...
 
సివియర్‌ అప్లాస్టిక్‌ ఎనీమియా: ఎముక మజ్జ పని చేయకపోవటం
లింఫోమా: లింఫ్‌ గ్రంథులు క్యాన్సర్‌కు గురవటం
మైలోమా: రక్తంలోని ప్లాస్మా కణాలు క్యాన్సర్‌కు గురవటం
సికిల్‌ సెల్‌ ఎనీమియా: ఎర్ర రక్త కణాలు నిరాకారంగా తయారె,ౖ రక్త నాళాల్లో ఇరుక్కుపోతూ ఉండటం
థలసీమియా: హిమోగ్లోబిన్‌ ఉత్పత్తి తగ్గటం లేదా ఆగిపోవటం

 

స్టెమ్‌ సెల్స్‌ మార్పిడి పద్ధతులు..

ఎముక మజ్జ, రక్తంలోనే కాక శిశువు పుట్టినప్పటి బొడ్డు తాడులో కూడా మూల కణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే సాధారణంగా మూల కణ మార్పిడి కోసం ఎముక మజ్జనే ఎంచుకుంటూ ఉంటారు. ఇందుకోసం దగ్గరి రక్త సంబంఽధీకుల ఎముక మజ్జ, లేదా రక్తం నుంచి మూల కణాలను సేకరించి స్వీకర్తకు అందిస్తారు. ఈ విధానాన్ని ‘అల్లోజెనిక్‌ ట్రాన్స్‌ప్లాంట్‌’ అంటారు. కుటుంబ సభ్యుల బ్లడ్‌ గ్రూప్‌ మ్యాచ్‌ కాకపోయిన సందర్భంలో డోనార్‌ రిజిస్ట్రీ ద్వారా ‘కార్డ్‌ బ్లడ్‌ బ్యాంక్‌’ (బొడ్డుతాడు రక్త బ్యాంక్‌) నుంచి సరిపోలిన మూల కణాలను సేకరించి అందిస్తారు. ఈ విధానాన్ని కూడా అల్లోజెనిక్‌ ట్రాన్స్‌ప్లాంట్‌గానే పరిగణించాలి. పాడైన, రోగగ్రస్థమైన కణాలను తొలగించిన తర్వాత ఎక్కించటం కోసం మన శరీరం నుంచే మూల కణాలను సేకరించి దాచే వీలు కూడా ఉంది. ఈ మార్పిడి పద్ధతిని ‘ఆటోలోగస్‌ ట్రాన్స్‌ప్లాంట్‌’ అంటారు.
 
ఐదు దశల్లో ఆల్‌రైట్‌!
మూల కణ మార్పిడిలో ఐదు దశలుంటాయి. అవేంటంటే...
1. పరీక్షలు: బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ కోసం తగినంత ఆరోగ్యంగా ఉన్నామా లేదా? అని పరీక్షిస్తారు
2. హార్వెస్టింగ్‌: మన నుంచి లేదా దాత నుంచి మూల కణాలు సేకరించటం. ఇందుకోసం మూడు పద్ధతులను పాటిస్తారు.
 రక్తం నుంచి :ఒక ప్రత్యేక పరికరం ద్వారా మన రక్తం నుంచి మూల కణాలను సేకరిస్తారు.
 ఎముక మజ్జ నుంచి: తుంటి ఎముక నుంచి ఎముక మజ్జ సేకరిస్తారు.
 బొడ్డు తాడు నుంచి: స్టెమ్‌ సెల్‌ బ్యాంక్‌లో దొరికే...అప్పుడే పుట్టిన బిడ్డతోపాటు లభించే బొడ్డుతాడు, మాయతో కూడిన రక్తం నుంచి మూల కణాలు సేకరించటం.
3. కండిషనింగ్‌: కీమోథెరపీతో పాడైన, రోగగ్రస్థమైన మూల కణాలను/క్యాన్సర్‌ కణాలను చంపి, ఆరోగ్యవంతమైన మూల కణాల ఎదుగుదలకు స్థలాన్ని ఏర్పరచటం
4. మూలకణ మార్పిడి: రక్తనాళాల ద్వారా రక్త మార్పిడి తరహాలోనే మూల కణాలను ఎక్కించటం. రెండు గంటల సమయం పట్టే ఈ ప్రక్రియలో మూల కణాలు నెమ్మదిగా శరీరంలోకి చేరుకుని రక్త ప్రవాహంతో అవసరమైన ప్రదేశానికి చేరిపోతాయి. ఆ రెండు గంటలూ రోగి ఎటువంటి నొప్పీ లేకుండా, పూర్తి స్పృహలోనే ఉంటాడు.
5. రికవరీ: మూల కణాలు ఎముక మజ్జలోకి లేదా వ్యాధిగ్రస్థమైన అవయవాల్లోకి చేరుకుని తమ తమ విధులు నిర్వర్తించటం మొదలుపెడతాయి. ఇందుకోసం కొన్ని వారాలపాటు ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాల్సి ఉంటుంది.
 
మూల కణ మార్పిడి జరిగిన 100 రోజుల తర్వాత రక్త క్యాన్సర్‌ రోగులు ఆ వ్యాధి నుంచి కోలుకునే అవకాశాలు 85 నుంచి 94 శాతం ఉంటే, మిగతా వ్యాధుల విషయంలో సక్సెస్‌ రేటు 63 నుంచి 86 శాతంగా ఉంది.
 
విదేశాలతో పోలిస్తే మూలకణ మార్పిడి మన దేశంలో ఎక్కువే! పూర్తిగా నయమయ్యే వీలున్న వ్యాధుల కోసమే విదేశాలు ఈ చికిత్స మీద ఆధారపడుతూ ఉంటే, ఇక్కడ ఫలితం ఉన్నా, లేకున్నా ఈ చికిత్సను ఆశ్రయిస్తున్నారు. 2006లో ఎన్నో వాదనలు జరిగిన తర్వాత భారతదేశంలో మూలకణ చికిత్స గురించి ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది.
 
అరుదైన వ్యాధికీ...
ఆటోలోగస్‌ ట్రాన్స్‌ప్లాంట్‌లో భాగంగా మన మూల కణాలను మనమే స్వీకరించే పరిస్థితి లేనప్పుడు వాటి నుంచి దాత నుంచి స్వీకరించక తప్పదు. మూల కణ మార్పిడి సత్ఫలితాన్నివ్వాలంటే ఆ మూల కణాలు ‘హ్యూమన్‌ ల్యూకోసైజ్‌ యాంటీజెన్‌’ అనే ఒక ప్రత్యేక జెనిటిక్‌ మార్కర్‌ని కలిగి ఉండాలి. దీనికి తగిన మ్యాచ్‌ రక్త సంబంధీకుల్లోనే దక్కుతుంది. కానీ కొన్నిసార్లు రక్త సంబంధీకులతో కూడా ఈ జెనిటిక్‌ మార్కర్‌ మ్యాచ్‌ కాకపోవచ్చు. అలాంటప్పుడు హెచ్‌.ఎల్‌.ఎ మ్యాచ్‌ అయ్యే దాతల కోసం అంతర్జాతీయ బోన్‌ మ్యారో డోనార్‌ రిజిస్ట్రీని వెతుకుతాం.
 
ఎక్కువశాతం మందికి ఈ రిజిస్ట్రీలోనే దాతలు దొరికిపోతారు. కానీ అరుదుగా కొందరికి తగిన మ్యాచ్‌ దొరకకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో సగం మ్యాచ్‌ అయ్యే వీలున్న కుటుంబ సభ్యుల నుంచి మూల కణాలను సేకరించి స్వీకర్తకు అందిస్తాం. ఈ విధానాన్ని ‘హాప్లో ఐడెంటికల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌’ అంటారు. రక్తానికి సంబంధిన క్యాన్సర్‌ల చికిత్సలో ఈ విధానాన్ని అనుసరిస్తాం. ఇప్పుడు చికిత్స పొందిన నాలుగేళ్ల కుర్రాడి విషయంలో ఈ పద్ధతినే అవలంబించాం. ఆ బాబుకి ఉన్న వ్యాధి ‘ఫ్యాంకోని ఎనీమియా’. రక్త కణాలు నశించే వ్యాధి ఇది.
 
డాక్టర్‌ ఎ.వి.ఎస్.సురేష్‌
కన్సల్టెంట్‌ ఆంకాలజిస్ట్‌,
హెమటాలజిస్ట్‌,
కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌.
గచ్చిబౌలి, హైదరాబాద్‌.