ఎనీమియా ఎన్ని రకాలో!

09-10-2018: రక్తహీనతేగా! నాలుగు ఐరన్‌ ట్యాబ్లెట్లు వేసుకుంటే చాలు అదే చక్కబడుతుంది అనేవాళ్లే ఎక్కువ. కానీ, పోషకలోపాలకు మించి రక్తలేమికి దారి తీసే పలు ఇతర కారణాలెన్నో ఉన్నాయి. వాటికి అవసరమైన చికిత్సలేమీ తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండిపోతే, అది పలు రుగ్మతలకు దారి తీసే ప్రమాదం ఉంది. నీరసం నిస్సత్తువతో మొదలై, శ్వాసపరమైన సమస్యలు, మెదడు పనితనం తగ్గిపోవడం, గుండె జబ్బుల వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఒక్కోసారి కేన్సర్‌కు సూచన కూడా కావచ్చు. వృద్దులందరిలోనూ కనిపించే రక్తహీనతకు వార్థక్యం ఒక్కటే కారణం కాదు. నిజానికి రక్తహీనత కు కారణాలు అనేకం.
 
ఏమిటీ అనీమియా?
శరీరంలో ఎర్ర రక్తకణాలు తగ్గిపోవడాన్నే అనీమియా అంటాం. ఎర్ర రక్తకణాల్లో హీమోగ్లోబిన్‌ ఉంటుంది. ఈ హీమోగ్లోబినే శరీరానికంతంటికీ ఆక్సీజన్‌ను చేరవేస్తుంది. శరీరంలో ఎర్ర రక్తకణాలు తగ్గిపోయినప్పుడు అవసరమైనంత ఆక్సీజన్‌ అందదు. అనీమియాకు జన్యు కారణాలు ఉన్నప్పటికీ, అత్యధికం ఇతర కారణాలతో సంక్రమించేవే.
 
ఐరన్‌ లోపాల ఎనీమియా
ఎక్కువ మందిలో కనిపించే అనీమియా ఈ రకమే. అసవరమైన ఐరన్‌ అందనప్పుడు శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది.
 
తీవ్రమైన కొన్ని వ్యాధుల వల్ల....
జీర్ణాశయంలో రక్తస్రావం కావడం, పేగుల్లో వాపు ఏర్పడటం, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, కిడ్నీలు దెబ్బ తినడం వంటివి కూడా అనీమియాకు దారితీయవచ్చు.
 
పర్నీసియన్‌ ఎనీమియా
ఇది ఆటోఇమ్మూన్‌ వ్యాధి కారణంగా వచ్చే సమస్య. ఈ వ్యాధి వల్ల శరీరంలో బి-12 విటమిన్‌ తగ్గిపోతుంది. బి-12 విటమిన్‌ ట్యాబ్లెట్లు వేసుకోవడం ద్వారా ఈ సమస్య తగ్గిపోతుంది.. శరీరంలో బి-12 తగ్గడం వల్ల మధుమేహం, గ్రేవ్స్‌ డిసీజ్‌, విటిలిగో వంటి చర్మ వ్యాధులు, సిలియక్‌ వ్మాఽధి, క్రోన్స్‌ వ్యాధి వంటి సమస్యలు తలెత్తుతాయి.
 
అప్లాస్టిక్‌ ఎనీమియా
ఎముక మజ్జ దెబ్బ తినడం వల్లఅనీమియా సమస్య తలెత్తుతుంది. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, లూపస్‌ వంటి ఆటో ఇమ్యూన్‌ వ్యాధుల వల్ల గానీ, కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్ల వల్ల గానీ, కొందరిలో ఎముక మజ్జ దెబ్బ తింటుంది.
 
హిమోలైటిక్‌ ఎనీమిమా
ఎముక మజ్జ ఉత్పత్తి చేసే రక్తకణాల కన్నా ఎక్కువగా రక్తకణాలు నశించిపోవడం వల్ల తలెత్తే సమస్య ఇది. కొన్ని రకాల కేన్సర్ల వల్ల, తరుచూ వాడే కొన్ని రకాల మందుల వల్ల కూడా ఈ సమ్య రావచ్చు.
 
వైద్యంగా...
సమస్య కారణం ఆధారంగా ఎనీమియా వైద్యం ఉంటుంది. ఐరన్‌ లోపమైతే దాన్ని పూరించడం,ఇతర జబ్బులే కారణమైతే వాటిని న యం చేయడం ఇందులో భాగమవుతాయి.