ఈ తప్పు మీరు చేస్తూ ఉంటే రాబోయే రోజుల్లో నడవలేరట..!

09-09-2017: అదేపనిగా టీవీ చూసే వారిలో ఊబకాయం సహా రకరకాల ఆరోగ్యసమస్యలను గుర్తించిన పరిశోధకులు ఇప్పుడు మరో ఆరోగ్య సమస్యను కనుగొన్నారు. ముఖ్యంగా సాయం సమయంలో ఐదు గంటలకు మించి టీవీ చూసే వృద్ధులు రాబోయే కాలంలో నడిచే శక్తిని కోల్పోతారని అమెరికాకు చెందిన పరిశోధకులు అంటున్నారు. వీరు 50 నుంచి 70 సంవత్సరాల వయస్సుగల 300 మంది వృద్ధుల మీద పది సంవత్సరాల పాటు అధ్యయనం నిర్వహించారు. వీరి రోజువారీ కార్యక్రమాలను, వ్యాయామం చేసే సమయాన్నీ, టీవీ వీక్షణం తదితర అంశాలను పరిశీలించారు. పది సంవత్సరాలు గడిచేసరికి వీరిలో పది శాతం మంది నడిచే శక్తిని కోల్పోయారు. వీరందరూ ప్రతిరోజూ సాయం సమయంలో ఐదు నుంచి ఆరు గంటల పాటు కుర్చీలో కూచుని టీవీ చూసే అలవాటు ఉన్నవారే. ఈ అలవాటే వీరిలో నడిచే శక్తిని హరిచిందని అధ్యయనకారులు అంటున్నారు. ఎక్కువ సేపు ఒకే ప్రదేశంలో కూర్చుని ఉండడం వలన కండరాల్లో కదలిక తగ్గిపోతుందనీ, దాంతో శరీర భాగాలు సక్రమంగా పనిచేయవని వీరు అంటున్నారు. వృద్ధులు కేవలం ఒకే చోట కదలకుండా కూర్చోవడం వలన నడవలేకపోతున్నారా? లేదా మరేదైనా కారణం ఉందా? అన్న విషయం మీద ఇంకా అధ్యయనాలు నిర్వహించాలని వారు చెబుతున్నారు.