పిల్లలు కావాలనుకుంటే ‘టెస్టోస్టిరాన్‌’ వద్దు!

25-06-2018: డాక్టర్‌! నా వయసు 20. ఇంకా పెళ్లి కాలేదు. నాకు టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ తగ్గిందని వైద్యులు చెప్పారు. నేను టెస్టోస్టిరాన్‌ ఇంజెక్షన్లు తీసుకుందామని అనుకుంటున్నాను. ఇలా తీసుకోవడం క్షేమమేనా? భవిష్యత్తులో ఏమైనా సమస్యలొస్తాయా? - ఓ సోదరుడు, ఖమ్మం.
 
టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఇంజెక్షన్లను ఇష్టానుసారం వాడడం ప్రమాదకరం. ఈ హార్మోన్‌ తగ్గడానికి అసలు కారణాన్ని కనిపెట్టి, అనుభవజ్ఞులైన వైద్యులు, అత్యవసరమని సూచిస్తే తప్ప ఇంజెక్షన్‌గా తీసుకోకూడదు. టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గడానికి రెండు కారణాలుంటాయి. ఈ హార్మోన్‌ వృషణాల్లో ఉత్పత్తి అవుతున్నా, అలా ఉత్పత్తి అవడానికి కావలసిన ప్రేరణ, మెదడు నుంచి స్రవించే ఎల్‌.హెచ్‌ హార్మోన్ల నుంచి అందుతుంది. కాబట్టి టెస్టోస్టిరాన్‌ తగ్గిందంటే కారణం మెదడు నుంచి విడుదలయ్యే హార్మోన్లలో ఉందా? లేక తగినంత స్థాయిల్లో టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి చేయలేని వృషణాల్లో ఉందా? అనేది పరీక్షల ద్వారా తెలుసుకోవాలి.
 
హార్మోన్‌ లోపం ఎందుకంటే?: ఎక్కువ సేపు కూర్చుని పని చేసేవాళ్లు (సెడెంటరీ లైఫ్‌స్టయిల్‌), శారీరక వ్యాయామం లేకపోవడం, విపరీతమైన ఒత్తిడి కలిగి ఉండడం, నిద్ర లేకపోవడం... ఈ కారణాలన్నీ మెదడు నుంచి విడుదలయ్యే ఎల్‌.హెచ్‌ హార్మోన్‌ మీద ప్రభావం చూపిస్తాయి. ఇవే కాకుండా... వృషణాలు ఒత్తుకునేలా, వేడెక్కిపోయేలా బిగుతైన, లేదా నైలాన్‌ లోదుస్తులు ధరించే అలవాటున్నవాళ్లలో, వెరికోసిల్‌ సమస్య ఉన్నవాళ్లలో వృషణాల్లో టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి తగ్గుతుంది. ఇవే కాకుండా అధిక బరువు ఉండేవాళ్లలో, మద్యం ఎక్కువగా సేవించే వాళ్లలో, శరీర కొవ్వు టెస్టోస్టిరాన్‌ను ఈస్ట్రోడైల్‌గా మారుస్తుంది. ఆ కారణంగా కూడా టెస్టోస్టిరాన్‌ లోపం తలెత్తుతుంది. ఇలాంటి వాళ్లకు అదనంగా హార్మోన్‌ ఇవ్వకుండా టెస్టోస్టిరాన్‌ను ఈస్ట్రోడైల్‌గా మారకుండా ఆపే చికిత్స చేస్తే సరిపోతుంది. ఒకవేళ సమస్య వృషణాల్లో ఉంటే వ్యాయామం, లోదుస్తుల మార్పుతో సరిదిద్దవచ్చు.
 
లక్షణాలు ఇలా ఉంటాయి: నీరసం, నిస్సత్తువ, లైంగిక వాంఛలు తగ్గడం, మతిమరుపు, కండరాల నొప్పులు, ఎముకల నొప్పులు, బరువు తగ్గకపోవడం, ఆకలి మందగించడం ఉంటాయి. అయితే, టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ లోపం వల్ల వీర్యకణాల సంఖ్య కూడా తగ్గుతుంది. ఎరెక్టయిల్‌ డిస్‌ఫంక్షన్‌ (అంగస్తంభన సమస్య) కూడా తలెత్తవచ్చు.
 
పిల్లలు కావాలనుకుంటే టెస్టోస్టిరాన్‌ వద్దు: పిల్లలు కావాలనుకునే వయసులో తెలిసీ, తెలియక టెస్టోస్టిరాన్‌ ఇంజెక్షన్లు తీసుకుంటే పిల్లలు పుట్టే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లుతాయి. అవసరం లేకున్నా ఈ ఇంజెక్షన్లు తీసుకుంటే మెదడు నుంచి విడుదలయ్యే హార్మోన్లు ప్రభావితమై, దాని ఫలితంగా వృషణాల్లో వీర్య కణాల సంఖ్య సున్నాకు చేరుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పిల్లల కోసం ప్రయత్నిస్తున్నవాళ్లు టెస్టోస్టిరాన్‌ ఇంజెక్షన్లకు దూరంగా ఉండాలి.