పక్షవాతానికి చెక్‌!

06-11-2017: పక్షవాతం వస్తే ఎంత నరకమో తెలిసిందే! మంచానికే పరిమితమై ఇతరులపై ఆధారపడి జీవనం సాగించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ముందు జాగ్రత్తలతో పక్షవాతం రాకుండా చూసుకోవాలని అంటున్నారు వైద్యులు. ఇందుకోసం వారు కొన్ని సూచనలు చేస్తున్నారు. ప్రతిరోజూ శరీరానికి సరిపడా మెగ్నీషియం తీసుకుంటే పక్షవాతం దరిచేరదట. ఇది ఆషామాషీగా చెప్పింది కాదు. పరిశోధనల్లో వెల్లడయిన విషయం ఇది. మెగ్నీషియం సమృద్ధిగా లభించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే వారిలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూడటం ద్వారా పక్షవాతం ముప్పు తగ్గిపోతుందని పరిశోధకులు గుర్తించారు. ఆహారం ద్వారా తీసుకునే మెగ్నీషియం 100 మి.గ్రా మోతాదు పెరుగుతున్న కొద్దీ పక్షవాతం ముప్పు తొమ్మిది శాతం తగ్గుతున్నట్లు కనుగొన్నారు. పొట్టు తీయని ధాన్యాలు, పాలకూర, తోటకూర, బీన్స్‌, బాదం, జీడిపప్పులో మెగ్నీషియం అధికంగా లభిస్తుంది.