కెఫైన్‌ మంచిదే‌!

10-08-2017: కాఫీలో ఉండే కెఫైన్‌ ఆరోగ్యానికి హానికరమని నిపుణులు పదే పదే హెచ్చరిస్తుంటారు. కెఫైన్ తీసుకోవడం వలన నిద్రలేమితో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవన్న సంగతి గతంలో చేసిన పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే కాఫీ తాగడం వలన శరీరానికి కలిగే నష్టాలు చాలా స్వల్పమని బ్రిటన్‌ డైటీషియన్లు చెబుతున్నారు. ప్రతిరోజు నాలుగు కప్పుల కాఫీ లేదా ఎనిమిది కప్పుల టీ తాగడం వలన నిద్రలేమి సమస్య తలెత్తదని వీరు స్పష్టం చేస్తున్నారు. దీని మీద వీరు దీర్ఘకాలం అధ్యయనం చేశారు. కొంత మందిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారికి కాఫీ ఇవ్వలేదు. మరొక గ్రూపు వారికి రోజుకు నాలుగు కప్పుల కాఫీ ఇచ్చారు. కొన్ని నెలల అనంతరం వీరి నిద్రాసమయాన్నీ, ఆరోగ్యాన్ని పరిశీలించారు. కాఫీ తాగిన వారిలో కన్నా తాగని వారిలోనే నిద్రలేమి సమస్యను వీరు గుర్తించారు. నిద్రలేమికి, కాఫీకి ఎలాంటి సంబంధం లేదన్న విషయం వీరి అధ్యయనంలో స్పష్టమైంది.