రక్తనాళం చిట్లితే?

29-01-2019: రక్తం శరీర ఉపరిభాగం నుంచి దిగువ భాగానికి అంటే కాళ్లలోకి వచ్చేయడానికి ఎవ రి ప్రయత్నమూ అవసరం లేదు. అత్యంత సహజంగానే ఆ ప్రక్రియ జరిగిపోతుంది, కానీ, కాళ్లలోకి వచ్చి చేరిన రక్తం తిరిగి గుండెకు చేరడానికి మాత్రం కాళ్లల్లో ఒక వ్యవస్థ ఉండాలి. అయితే, ఆ రక్తనాళాలు ముడుచుకుపోవడం వల్ల గానీ, రక్తం గడ్డకట్టడం వల్లగానీ, రక్తప్రసరణలో అంతరాయం ఏర్పడుతుంది. అయినా చాలా కాలం వాటివల్ల పెద్ద ఇబ్బంది అనిపించదు. అయితే బలమైన దెబ్బ తగలడం వ ల్లగానీ, తీవ్రమైన ఒత్తిడి పడటం వల్లగానీ, ఒక్కోసారి ఈ వీన్స్‌ చిట్లిపోయి రక్తస్రావం జరగవవచ్చు, స్వల్ప వ్యవధిలో రక్తస్రావం ఆగిపోతే ఫరవాలేదు ఒకవేళ రక్తస్రావం అలాగే కొనసాగితే ఒక దశలో ఆ వ్యక్తి స్పృహ కోల్పోయే అవకాశం ఉంది.ఆ పరిస్థితిని నివారించాలంటే....
 
రక్తస్రావాన్ని గమనించిన వెంటనే ఆ వ్యక్తిని వెల్లకిలా పడుకోబెట్టి, రక్తస్రావం అవుతున్న కాలును సాధ్యమైనంత ఎత్తుకు లేపి ఉంచాలి. ఇలా చేయడం వల్ల రక్తస్రావం ఆగిపోవడంగానీ, ఆ వేగం తగ్గిపోవడం గానీ జరగవచ్చు. 
స్టెరాయిల్‌ ప్యాడ్‌తో గానీ, మడచిన శుభ్రమైన సాధారణ వస్త్రంతో గానీ, రక్తస్రావం అవుతున్న చోట అదిమి పట్టాలి. రక్తస్రావం పూర్తిగా ఆగేదాకా అలాగే ఉంచాలి.
బిగుతుగా ఉన్న దుస్తులు, బెల్టు లేదా పట్టీలవంటివి ఉంటే వెంటనే వదులు చేయాలి.
ఒకటి రెండు సార్లు కట్టు మారుస్తూ పోవాలి. రక్తస్రావం పూర్తిగా ఆగాక కొత్త వస్త్రంతో ఒక మోస్తరు బిగుతుగా కట్టేయాలి.
అవసరమైన ప్రాథమిక చికిత్సలు చేస్తూనే, హాస్పిటల్‌కు తరలించాలి.