లేటు వయసులో విడాకులతో ఆరోగ్యం

ఆంధ్రజ్యోతి,23-2-2017:లేటు వయస్సులో విడాకులు తీసుకోవడం మనదేశంలో చాలా తక్కువ. అదే విదేశాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. మలి వయస్సులో విడాకులు తీసుకున్న స్త్రీల ఆరోగ్యం భేషుగ్గా ఉన్న విషయం ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆ వయస్సులో విడాకులు తీసుకున్న స్త్రీలు మానసికంగా కుంగిపోతారు కానీ, ఆరోగ్యంగా ఎలా ఉంటారన్న అనుమానానికి కూడా సమాధానం ఇస్తున్నారు. విడాకుల అనంతరం కొంత మానసిక సంఘర్షణకు గురైనా, తమ ఆరోగ్యంమీద స్త్రీలకు మరింత శ్రద్ధ పెరుగుతుందన్న విషయం వీరి అధ్యయనంలో తేలింది. ఈ కారణంగానే మిగతా స్త్రీలతో పోల్చుకుంటే వీరి ఆరోగ్యం భేషుగ్గా ఉండి ఉండొచ్చని అధ్యయనవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒంటరిగా ఉండడం, ఎంత ఆహారం తీసుకుంటున్నామన్న విషయం మీద ఓ కన్నేసి ఉంచడం తదితర కారణాల వలన వీరిలో అధికబరువు సమస్య కనిపించకపోగా, మునుపటి కన్నా చురుకుగా పనులు చేయడాన్ని వారు గమనించారు. ఇదంతా విడాకుల వలనే సాధ్యపడిందా? దీనికి మరేదైనా కారణం ఉందా? అనే విషయం మీద వీరు ఇంకా విస్తృతంగా అధ్యయనం నిర్వహించనున్నారు.