విశ్రాంతి అంటే ఖాళీగా ఉండడం కాదు

ఆంధ్రజ్యోతి, 25-04-2017: ఉద్యోగంలో చేరిన గత పదేళ్ల కాలంలో నాకు ఏనాడూ విశ్రాతి తీసుకున్న భావన కలగలేదు. వీక్‌-ఆఫ్‌ రోజున ఏ ఒక్క పనీ చేయకుండా ఖాళీగా గడిపేయాలని ఏ వెయ్యిసార్లో అనుకున్నా కానీ, ఏదో ఒక కారణంగా అలా విశ్రాంతి తీసుకోవడం సాధ్యం కావడం లేదు. ఇవన్నీ మనసు మీద తీవ్రమైన ఒత్తిడి కలిగిస్తున్నాయి. ఈ స్థితి పోయి మనసు పూర్తిస్థాయిలో సేద తీరే మార్గం చెప్పండి.
- ఎన్‌. చంద్రకిరణ్‌, నిజామాబాద్‌
 
అసలు విశ్రాంతి అంటే ఏమిటో తెలిస్తే గానీ, విశ్రాంతిని ఎలా పొందాలో తెలియదు. ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చోవడం ఎప్పుడూ విశ్రాంతి కాదు. అలా కూర్చోవడం వల్ల రోజూ చేసే రొటీన్‌ పనులే ఆ సెలవు రోజున కూడా గుర్తుకొస్తాయి. అందులో భాగంగా ఆయా రోటీన్‌ విషయాల తాలూకు సమస్యలు సంఘర్షణలు గుర్తుకొస్తాయి. దాంతో అసహనం, చికాకు పెరిగిపోతాయి. శారీరకంగా ఆఫీసు పనులేవీ చేయకపోయినా, మానసికంగా సెలవు రోజున కూడా ఆ విషయాలతో అలసిపోతాం. వాస్తవానికి విశ్రాంతి అంటే ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉండడం కాదు. రోజువారీ రొటీన్‌ పనులకు ఏమాత్రం సంబంధం లేని, పూర్తిగా భిన్నమైన విషయాల్లో మనసు లగ్నం చేయడం.
 
అలా వేరే విషయాల తాలూకు పనులు రోజంతా చేసినా, శరీరం బాగా అలసిపోయినా, విశ్రాంతి భావనే కలుగుతుంది. నిజానికి, విశ్రాంతి భావనైనా, ఆనందమైనా, కొత్త విషయాల్లోంచి వస్తుంది. అందుకే నూతనత్వానికీ, సృజనాత్మకతకూ సమాజంలో అంతటి సమున్నత స్థానం ఉంది. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక హాబీ ఉండాలని చెప్పడంలోని ఉద్దేశం కూడా ఇదే. అందువల్ల సెలవు రోజున పూర్తిగా ఖాళీగా కూర్చోవాలనే తలంపును మనసులోంచి తీసివేసి ఏదైనా కొత్త విషయాల్లోకి ప్రవేశించే ప్రయత్నం చేయండి. మీకు బోలెడు విశ్రాంతి లభిస్తుంది.
-డాక్టర్‌ పి. విజయచంద్ర, సైకాలజిస్ట్‌, హైదరాబాద్‌