ఆంధ్రజ్యోతి, 06-10-2015: మానవ శరీరంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన అవయవం మెదడు. శరీరంలో ప్రతి కదలికకూ మస్తిష్కం నుంచి వచ్చేసంకేతాలే కారణం. మరి ఇంతటి ముఖ్యమైన మెదడులో అనుకోకుండా జరిగే మార్పులు.. శరీరంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. మెదడులోని ‘బేనల్ గాంగ్లియా’ అనే ప్రదేశంలో జరిగే మార్పులతో పార్కిన్సన్ వ్యాధి బారినపడే ప్రమాదం ఉంది.
మెదడులోని డోపమిన్ అనే రసాయనాన్ని తయారు చేసే కణాలు ఉంటాయి. ఈ కణాలు వేగంగా చనిపోవడం వల్ల డోపమిన్రసాయనం తగ్గుతుంది. దీంతో పార్కిన్సన్ వ్యాధి తలెత్తుతుంది. ఈ వ్యాధి వల్ల శరీరం బిగుతుగా మారిపోయి.. కాళ్లు, చేతులు,వేళ్లు వణుకుతుంటాయి.
లక్షణాలు..
- వయసు పైబడిన వారిలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది.
- డోపమిన్ అనే రసాయనం తగ్గే కొద్దీ పార్కిన్సన్ లక్షణాలు పెరుగుతుంటాయి.
- గతంలో జన్యుపరమైన కారణాల వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వచ్చేది. ఇప్పుడు సాధారణంగా కూడా వస్తోంది.
- వంశపారంపర్యంగా కూడా ఇది సంక్రమిస్తుంది. దాదాపు 10 నుంచి 15 శాతం పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల కుటుంబాల్లో గతంలో ఈ వ్యాధి బాధితులు ఉన్నట్టు తేలింది.
- పార్కిన్సన్ బారినపడితే కాళ్లు, చేతులు అప్రయత్నంగా వణుకుతుంటాయి.
- జబ్బు ముదిరేకొద్దీ నాలుక, పెదాలు కూడా వణకడం మొదలవుతుంది.
- శరీరం బిగుతుగా మారుతుంది. దీనినే రిజిడిటీ అంటారు.
- ఆలోచనలు మందగిస్తాయి. రాను రాను జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. తీవ్రమైన ఆందోళనకు గురువుతూ ఉంటారు.
- నిద్రలో మాట్లాడటం, నిద్రలో నడవడం, పక్కవారిని కొట్టడం వంటివి కూడా జరగవచ్చు.
ఇలా చేయండి..
- పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులు మానసికంగా కుంగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబసభ్యులదే. వారి పనులు వారే చేసుకునేలా ప్రోత్సహిస్తుండాలి.
- చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయించాలి. వాకింగ్, తేలికపాటి బరువులు ఎత్తడం (5 కిలోల లోపు), బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయిస్తే మంచి గుణం కనిపిస్తుంది. సాయంత్రం వేళ..
- విశ్రాంతిగా ఓ పది అడుగులు వేస్తే మానసికంగా కూడా చురుకుగా తయారవుతారు.
- ఈ వర్కవుట్లు చేసేటప్పుడు అలసిపోయినట్టు అనిపిస్తే..
- ఓ పది నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది.
- పది నిమిషాలకు మించి ఎక్సర్సైజు చేయకూడదు. రోజులో నాలుగైదు సార్లు ఐదు నుంచి పది నిమిషాల పాటు చేస్తే మంచి మార్పు కనిపిస్తుంది.
- ఇంటిపట్టునే ఉంటున్నాం కదా అని చాలా మంది మంచానికే పరిమితం అవుతుంటారు. మధ్యాహ్నం పూట గాఢనిద్రలోకి జారుకుంటారు. దీంతో రాత్రి వేళలో నిద్ర పట్టదు. ఫలితం ఆ మర్నాడు పూర్తిగా మగతగా ఉంటారు. సో.. మధ్యాహ్నం నిద్రకు చెక్ పెట్టేసి.. రాత్రి పూట ప్రశాంతంగా పడుకోవాలి.
- పార్కిన్సన్ వ్యాధి కాస్తా ముదిరితే మతిమరుపు వస్తుంటుంది. వారిని మతిమరుపు బారినుంచి తప్పించాలంటే కుటుంబసభ్యుల ఆదరణ ఎక్కువగా ఉండాలి. తరచూ వారితో మాట్లాడుతూ ఉండాలి. జీవితంలోని గత జ్ఞాపకాలను గుర్తు చేయాలి. నెలకు ఒకట్రెండు సార్లు ఆ వ్యక్తి పాత స్నేహితులు, బంధువులు కలిసేలా చూడండి. మానసికంగా దృఢంగా ఉన్నంత కాలం వారి మెదడు పదిలంగానే ఉంటుంది.