నాన్నకు నిద్ర కరువైంది!

ఆంధ్రజ్యోతి, 27-04-2017: మా నాన్నగారికి 82 ఏళ్లు. రాత్రివేళ ఎక్కువ గంటలు మేల్కొనే ఉంటాడు. ఏదైనా ఆలోచిస్తున్నారా అంటే.. ‘లేదు! అసలు నిద్రే రావడం లేదం’టారు. డాక్టర్‌ దగ్గరకు వెళ్లి నిద్ర మాత్రల గురించి అడిగితేనేమో అవి అలవాటు చేయడం అంత మంచిది కాదంటున్నారు? ఏం చేయమంటారో చెప్పండి ?

- ఎన్‌ సుధాచంద్ర, కరీంనగర్‌
 
కొంత వయసు పైబడిన తర్వాత మెదడుకు వె ళ్లే రక్తనాళాలు గట్టి పడతాయి. దీనివల్ల మెదడుకు జరిగే రక్తప్రసరణలో అంతరాయం ఏర్పడుతుంది. రక్తప్రసరణ తగ్గినప్పుడు మెదడుకు అందే ఆక్సిజన్‌ కూడా తగ్గుతుంది. ఇది నిద్రలేమికి గల ఒక ప్రధాన కారణం. ఈ పరిణామం వల్ల కొందరికి పక్షవాతం వచ్చే ప్రమాదం కూడా ఉంది. వృద్ధుల్లో కొందరికి గంటకు ఐదారుసార్లు హఠాత్తుగా మెలకువ వస్తుంటుంది. నిద్రలేమి సమస్యతో ఉన్న వృద్ధుల్లో దాదాపు 29 శాతం మంది పక్షవాతం బారిన పడితే మిగతా 61 శాతం మందిలో మెదడు రక్తనాళాలు ఒక మోస్తరుగానో తీవ్రంగానో దెబ్బతిన్నాయని ఓ సర్వేల్లో వెల్లడైంది. ఈ నిద్రలేమితో పక్షవాతం ఒక్కటే కాదు, శరీర కదలికలు కుంటుపడతాయి. అంతేకాదు వీరిలో గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతాయి. అందువల్ల వయో వృద్ధుల నిద్రలేమి సమస్యల విషయంలో ఎంత మాత్రం నిర్లక్ష్యం వహించకూడదు. ఈ స్థితిలో అత్యవసరమైతే అరుదుగా ఎప్పుడైనా నిద్ర మాత్రలు వేసుకోవచ్చు. అంతేతప్ప అదో అలవాటుగా మాత్రం మారకూడదు. నిద్రపట్టకపోవడానికి మెదడుకు సరిపడా ఆక్సిజన్‌ అందకపోవడమే అసలు కారణం కాబట్టి ప్రతిరోజూ ప్రాణాయామం చేయడం ద్వారా ఆ లోటును పూడ్చుకోవచ్చు. అలాగే నరాలలకు, మొత్తంగా నాడీ వ్యవస్థకు బలాన్నిచ్చే ఆహార పానీయాలు తీసుకోవాలి. ఈ పద్ధతులు పాటించడం ద్వారా నిద్రలేమి సమస్యలను చాలా వరకు అధిగమించవచ్చు. ఒకవేళ ఆయన కు ఏమైనా మానసిక సమస్యలు ఉంటే సైకాలజిస్ట్‌ ద్వారా కౌన్సెలింగ్‌ కూడా ఇప్పించాల్సి ఉంటుంది.
- డాక్టర్‌ కె. సుధాకర్‌, న్యూరాలజిస్ట్‌