పెద్దవాళ్లని పొదివి పట్టుకుని

ఇంట్లో వయసు మీరిన పెద్ద వాళ్లు ఉంటే వాళ్లని సౌకర్యంగా, సురక్షితంగా ఉంచేలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీతోపాటు, వాళ్లమీద ఒత్తిడి లేకుండా ఉంటుంది. వాళ్లు సురక్షితంగా ఉన్నట్టు భావిస్తారు. ఆ జాగ్రత్తలు ఏంటంటే....
 
బరువు తక్కువ ఉన్న చిన్న జగ్‌ నిండా నీళ్లు నింపి వాళ్లకి అందుబాటులో పెట్టాలి. ఆ నీటిని ఎక్కువగా తరచుగా తాగుతుండమని చెప్పండి. శరీరానికి సరిపడా నీటిని అందించడం వల్ల తలనొప్పులు, నిద్రలేమి, ఆకలి మందగించడం వంటి ఇబ్బందులు ఎదురుకావు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మంచి నీళ్లు సరిపడా తాగితే బోలెడు అనారోగ్యాలు దరిచేరవు. 

ఇంట్లో ఎక్కడపడితే అక్కడ అద్దాలు ఉంచొద్దు. ఆ అద్దాలు పెద్దవాళ్లని గందరగోళానికి గురిచేస్తాయి. కొన్నిసార్లు వాళ్ల ప్రతిబింబాన్ని వాళ్లే గుర్తించలేరు. అద్దం ముందు నడిచినప్పుడు కూడా గందరగోళ పడతారు. అద్దాలు పెట్టడం తప్పదంటే చిన్న అద్దాల్ని గోడల మీద కాస్త ఎత్తులో ఉంచండి. 

ఫోన్‌, రిమోట్‌ డయల్‌, నెంబర్‌ ప్యాడ్‌ల మీద అంకెలు, అక్షరాలు పెద్ద సైజులో ఉండాలి. ఇంట్లో డిజిటల్‌ క్లాక్స్‌ పెట్టండి. ఇవయితే పెద్దవాళ్లు చదవడం సులభం. సంప్రదాయ గడియారాల్లో చదవడం ఇబ్బంది. 

ఇక వాళ్లు వేసుకునే దుస్తుల రంగుల విషయంలో కూడా జాగ్రత్తవహించాలి. నలుపు, లేత గోధుమరంగు, తెలుపు, క్రీం, ఆకుపచ్చ రంగులవి అయితే వాళ్ల బట్టల్ని వాళ్లు సులభంగా తీసుకోగలుగుతారు. అలాగే వాళ్ల వార్డ్‌రోబ్‌లో షర్ట్స్‌ అన్నీ ఒక పక్కకి, ప్యాంట్లు, షార్ట్స్‌, లుంగీలు మరో పక్కకి సర్దాలి. అలాగే చీరలు, స్కర్ట్స్‌ వంటివి ఒక పక్కన, బ్లౌజ్‌లు, కుర్తా టాప్స్‌ మరో పక్కన సర్దాలి. వాడని బట్టలు వాళ్ల వార్డ్‌రోబ్‌ల్లో ఉంచొద్దు. 

ఈ జాగ్రత్తలతో పాటు ఇంట్లో తీసుకునే నిర్ణయాల్లో వాళ్లని భాగస్వాములు చేయండి. ఇలా చేయడం వల్ల తమకి ప్రాధాన్యత తగ్గిందనే భావన వాళ్లలో తలెత్తదు. మరో ముఖ్యమైన విషయం వాళ్ల ముందు ఎక్కువ చాయిస్‌లు ఉంచొద్దు. అలా చేస్తే ఎంపిక చేసుకోవడంలో గందరగోళపడతారు. ఆ పరిస్థితి ఎదురుకాకూడదంటే వాళ్లని ఇబ్బంది పెట్టకుండా వాళ్లకి నచ్చేలా తక్కువ చాయిస్‌లు ఉంచండి.