ఆంధ్రజ్యోతి, 08-10-2015: వృద్ధాప్యంలో చూపు మసకబారడంతో మొదలై క్రమంగా అంధత్వానికి దారితీసే ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజెనరేషన్(ఏఎండీ)కు పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. రెటీనా వెనక భాగంలో కంటి మూలకణాలతో అభివృద్ధి చేసిన చిన్న ప్యాచ్‌ను అమర్చడం ద్వారా చూపు సంబంధిత సమస్యలకు చెక్ చెప్పవచ్చని మూర్‌ఫీల్డ్స్ కంటి ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. ఈ ప్యాచ్‌లోని మూలకణాలు రెటీనాలోకి ప్రవేశించి మెల్లగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఆపై కంటి చూపునకు తోడ్పడే రెటీనల్ పిగ్మెంట్ ఎపిథీలియమ్(ఆర్పీఈ) పొరను ఏర్పరుస్తాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ పీటర్ కాఫె తెలిపారు. ఇప్పటికే ఓ వృద్ధురాలిపై ఈ ప్రయోగం నిర్వహించామని చెప్పారు. ఫలితాలు సానుకూలంగా వస్తే వృద్ధాప్యంలో అంధత్వాన్ని పూర్తిగా రూపుమాపవచ్చని ఆయన పేర్కొన్నారు.