నిత్య యవ్వనానికి పంచ సూత్రాలు!

ఆంధ్రజ్యోతి,08-12-2016:యువతరంతో కలిసిపోండి. ఫ్యాషన్‌, ఎంజాయ్‌మెంట్‌ వంటివి ప్రతి తరానికీ మారుతూనే ఉంటాయి. కానీ తరాలు ఎన్ని మారుతున్నా యువతలో ఉరిమే ఉత్సాహం మాత్రం కామన్‌. పరిస్థితిని బట్టి వీలైనంత ఎంజాయ్‌ చేయడం, లక్ష్యాన్ని చేరుకోవడానికి కావాల్సిన శక్తి కలిగి ఉండటం వంటివి యువతను వెన్నంటే ఉంటాయి. కాబట్టి వారికి ఎంత సన్నిహితంగా ఉంటే మీ మనసు, ఆలోచనలు కూడా యవ్వనాన్ని సంతరించుకునే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది.

జడత్వాన్ని దరిచేరనీయవద్దు. వీలైనంత ఎక్కువగా ప్రయాణాలు చేయండి. వయసు పైనబడింది కదా అని ఒకే గదికి పరిమితమైపోవద్దు. పెట్టేబేడా ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోండి. అవకాశం వచ్చినప్పుడల్లా సుదూర ప్రాంతాలకు ఎగిరిపోండి. ఈ అలవాటు మీ ఆలోచనలను యవ్వనంగా ఉంచడంలో దోహద పడుతుంది.

మీరెంత తెలివిమంతులైనా కుర్రకారుకు అదేపనిగా లెక్చర్లు దంచకండి. మీరు యవ్వనంలో ఉన్నప్పుడు క్లాసులు పీకిన వారిపై మీకు ఎలాంటి అభిప్రాయం ఉండేదో గుర్తు చేసుకుంటే ఈ ప్రయత్నం చేయరు. ఎవరైనా వచ్చి ప్రత్యేకంగా కోరితే తప్ప ఎవరికీ ఉచిత సలహాలు ఇవ్వకండి.

రొటీన్‌గా చేసే పనులనే భిన్నంగా ఎలా చేయొచ్చో ఆలోచించండి. వయసు మళ్లుతున్న కొద్దీ వీలైనంత సౌకర్యంగా ఉండాలని కోరుకుంటారు. రోజువారీ కార్యక్రమాలే కాకుండా ఆహారం, చదివే పుస్తకాలు, దుస్తులు వంటి విషయాల్లోనూ వెరైటీకి పెద్దపీట వేయండి.

వయసు మీద పడినంత మాత్రాన రొమాంటిక్‌ లైఫ్‌ గపడకూడదనే నిబంధన ఏమీ లేదు. ప్రేమ, రొమాన్స్‌ ఈ రెండూ యవ్వనానికి హాల్‌మార్క్‌ సింబల్స్‌. జీవిత భాగస్వామిలో మీకు నచ్చిన గుణాలను మరింత ఇష్టపడండి. ఆ విషయం వారికి అర్థమయ్యేలా ప్రవర్తించండి. వారితో కలసి సాయం సంధ్యలను తీపి జ్ఞాపకాలుగా తీర్చిదిద్దుకోండి. పైబడే వయసును ఆపలేకపోవచ్చు కానీ మిమ్మల్ని మీరు యవ్వనంగా తీర్చిదిద్దుకోవడం సాధ్యమే అని గుర్తించండి.