శతమానం భవతి

ఆంధ్రజ్యోతి, 09-03-2017: ముప్ఫై ఏళ్లకి ఆయాసం, నలభై ఏళ్లకి నీరసం.. ఇటీవల చాలామందిలో చూస్తున్న పరిస్థితి ఇది. ఇక యాభయ్యో పడిలో పడితే గుప్పెడు మాత్రలు మింగుతూ ఇంటిపట్టున కృష్ణారామా అనుకుంటూ కూర్చోవలసిందే! మన దగ్గర ఇలా ఉంటే జపాన్‌ దగ్గరున్న ‘ఒకినావా’ దీవి వాసులు మాత్రం శతాధికవృద్ధులుగా ప్రపంచ ప్రఖ్యాతి పొందుతున్నారు. అక్కడి ‘జిరోమాన్‌ కిమురా’ అనే ఓ శతాధిక వృద్ధుడు ఏకంగా 116 ఏళ్లదాకా బతికి ఇటీవల కొత్త రికార్డు సృష్టించాడు. ఇతనికి ముందు మిసావో ఒకావా అనే మహిళ 115 ఏళ్లు జీవించిన శతాధికురాలిగా పేరు తెచ్చుకుంది. జపనీయులు వందేళ్లు జీవిస్తూ పేరు తెచ్చుకుంటే, ఒకినావా వాసులు ఏకంగా సెంచరీ కూడా దాటేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే వీళ్లింత సుదీర్ఘకాలం జీవించటం వెనకో ఆరోగ్య రహస్యం ఉంది. అదే...‘ఒకినావా డైట్‌’.

 
ఒకినావా అనేది జపాన్‌లోని ఓ దీవి. ఈ దీవిలోని వాళ్లంతా నిండు నూరేళ్లపాటు జీవించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. మరి దీర్ఘాయుష్షు కోసం వీళ్లంతా ఏం తిన్నారు? ఆ వివరాలు తెలియాలంటే ఒకినావా ఆహారశైలి గురించి తెలుసుకోవాలి.
 
ఒకినావా ‘చిలకడ దుంప’
ఒకినావా ద్వీపంలో ఇప్పుడు కనిపించే శతాధిక వృద్ధులందరూ 1903 - 1914 మధ్యకాలంలో పుట్టినవాళ్లే! వీళ్ల జీవితంలో మొదటి పావు భాగం వరకు... అంటే 1940 వరకూ ఎక్కువ శాతం, దాదాపు 60 శాతం క్యాలరీలను ఒకే ఒక పదార్థం నుంచే తీసుకున్నారు. అదే ‘ఐమో’. ఐమో అనేది ఒకినావా ద్వీపంలోని చిలకడ దుంప. వంకాయ లేదా పసుపుపచ్చ రంగులో ఉండే ఈ స్వీట్‌ పొటాటో 400 ఏళ్లకు పూర్వం అమెరికా నుంచి ఈ దీవికి తరలి వచ్చింది. దీన్లో అత్యధిక ఫ్లావనాయిడ్స్‌, విటమిన్‌ సి, కెరోటినాయిడ్స్‌, ఆలస్యంగా ఖర్చయ్యే పిండి పదార్థాలున్నాయి.
 
తక్కువ క్యాలరీలు: ఒకినావా వాసులు జపనీయుల కంటే 20 శాతం తక్కువ క్యాలరీలున్న ఆహారం తింటారు. ఒక గ్రాము ఆహారానికి ఒక గ్రాము క్యాలరీ ఉండేలా చూసుకుంటారు. వాళ్ల బిఎమ్‌ఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌) సుమారుగా 20. దీన్నిబట్టి క్యాలరీలను కంట్రోల్‌ చేస్తే బరువు అదుపులో ఉండటంతోపాటు ఈ కింది ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 

ఆరోగ్యం మెరుగవుతుంది... వృద్ధాప్యం ఆలస్యమవుతుంది.

ఒకినావాలు పళ్లు, కూరగాయలను గ్రీన్‌, ఆరెంజ్‌, ఎల్లో (జిఓవై)...ఈ మూడు రంగుల్లో వర్గీకరించుకుటారు. ఈ రంగుల్లో ఉండే పళ్లు, కూరగాయలు, దుంపలను మాత్రమే తింటారు. జిఓవై ఫుడ్‌లో విటమిన్‌ ఎ, విటమిన్‌ సి, బీటా కెరోటిన్‌, లుటీన్‌, గ్జాంథీన్‌ వంటి పోషకాలుంటాయి.
 
తక్కువ చక్కెర, కొవ్వులు: ఆరోగ్యాన్ని శుష్కింపజేసేవి చక్కెర, కొవ్వులే! కాబట్టి ‘ఒకినావా డైట్‌’లో వీటికి స్వల్ప స్థానం ఉంటుంది. వీళ్ల దైనందిన ఆహారంలో 25 శాతం చక్కెర, కొవ్వులు ఉంటాయి. మిగతా 75 శాతం పప్పుధాన్యాలతో నిండి ఉంటుంది. కాబట్టే వీళ్లకు హృద్రోగాలు, గుండెపోట్లు రావు.
 
కూరగాయలు, సముద్రాహారం: ఎక్కువమంది ఒకినావాలు శాకాహారులే! వాళ్లుండే ప్రదేశం దీవి కాబట్టి వీళ్లలో కొందరు సముద్రాహారం కూడా తింటారు. అయితే తక్కువ మొత్తంలో చేపలు, ఎక్కువగా కూరగాయలు తింటారు. ఇక మాంసం, డైరీ ఉత్పత్తులు, గుడ్లకు సాధ్యమైనంత దూరంగా ఉంటారు. ఒకినావా డైట్‌ ఎంతో క్రమశిక్షణతో కూడుకున్నది. ఆరోగ్యానికి మేలు చేస్తూ ఆయుష్షుని కాపాడే పదార్థాలను ఆచితూచి ఎంచుకోబట్టే అక్కడివాళ్లకు అంత దీర్ఘాయుష్షు.