నూట నలభై నుంచి తొంభై కేజీలకు

నా బరువు నూట నలభై  కేజీలు. ఎత్తు ఆరు అడుగుల మూడు అంగుళాలు. బరువు తగ్గడానికి ఎన్నో చేశాను. తగ్గినా మళ్ళీ మామూలు బరువుకి వచ్చేస్తున్నాను. తొంభై కేజీలకు తగ్గడానికి ఆహార నియమాలు చెప్పగలరా? 

- అజయ్‌ నాదెళ్ల, కర్నూలు
రాత్రికి రాత్రే బరువు పెరగరూ, తగ్గరూ. సమయం తీసుకుంటుంది. ప్రస్తుత బరువును బట్టి, ఆహారంలో మార్పులు చేస్తూ, క్రమం తప్పకుండా రోజుకు గంట ేసపు సరైన వ్యాయామం చేసినట్టయితే ఒకటి లేదా ఒకటిన్నర సంవత్సరాలలో తొంభై కేజీలకు చేరుకోవచ్చు. ఆహార నియమం, వ్యాయామం వల్ల నెలకు మూడు నుండి ఐదు కేజీలు తగ్గవచ్చు. బాగా ఆహారం మానేసి... ఎక్కువ తగ్గ్గినట్టయితే మళ్ళీ బరువు పెరిగే అవకాశాలే ఎక్కువ. బరువు తగ్గడానికి కొన్ని నెలలు కఠిన నియమాలు పాటించి, తరువాత గాలికి వదిలేస్తే కథ మొదటికి వస్తుంది. చికెన్‌, చేప, పాలు, పెరుగు, గుడ్లు, కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు తీసుకోండి. అన్నం, చపాతి, రొట్టెలు వంటివి తక్కువ మోతాదుల్లో తీసుకోవాలి. తీపిపదార్థాలు రోజుకు 10-15 గ్రాములకు మించకుండా చూసుకోండి. నూనెలో వేయించిన పదార్థాలను మానెయ్యండి. ఆహారాన్ని తక్కువ మోతాదుల్లో తీసుకోవడం వల్ల పోషకాల లోపం ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి, రోజూ ఓ మల్టీ విటమిన్‌ టాబ్లెట్‌ వేసుకోవడం మంచిది. ప్రతిరోజూ ఓ గంట వ్యాయామం చేయండి. అలాగే ఎక్కువగా కూర్చుని ఉండకుండా, నిలబడి కూడా పనులు చేసుకుంటూ ఉండాలి. కనీసం రెండున్నర నుండి మూడు లీటర్ల నీళ్లు తీసుకోవాలి. వీటన్నిటి మూలానా మీకు ఫలితం కనిపించాలంటే మంచి నిద్ర ఎంతో అవసరం. రాత్రిపూట కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్ర పోవాలి, పగటి నిద్ర పూర్తిగా ఆపెయ్యాలి.