ఊబకాయంతో ఉపద్రవం?

30-5-2017: పిల్లల్లో కనిపించే ఊబకాయం కారణంగా పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్న విషయం తెలిసిందే! వీటితో పాటు మరో ఉపద్రవం పొంచి ఉంది అంటున్నారు పరిశోధకులు. చిన్నతనంలో అధికబరువుతో ఉండే పిల్లలు పెద్దయ్యాక కొలాన్‌ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందన్న విషయం ఇటీవల డెన్మార్క్‌లో నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. సుమారు 61వేల మంది మీద అధ్యయనం నిర్వహించారు. వీరందరూ 1990–2000 సంవత్సరం మధ్య జన్మించిన వారే. వీరు ఏడు సంవత్సరాల వయస్సులో ఎంత బరువు ఉన్నారన్న విషయాన్ని వీరి స్కూలు రికార్డుల ఆధారంగా సేకరించారు. అనంతరం వీరు 17 నుంచి 25 సంవత్సరాల వయస్సులో ఎంత బరువునూ, బిఎంఐని కలిగిఉన్నారన్న విషయాన్ని పరిశీలించారు. టీనేజిలో కూడా అధికబరువు, అధిక బిఎంఐ కలిగి ఉన్న 700 మంది కొలాన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయాన్ని వీరు గమనించారు. కొలాన్‌ క్యాన్సర్‌కు వీరి ఆహారపు అలవాట్లు, ఇతర కారణాలే కాకుండా చిన్నతనం నుంచి వీరిలో అధికబరువు సమస్య కూడా క్యాన్సర్‌ రావడానికి కారణమైంది అని వీరు అంచనా వేశారు. కేవలం అధికబరువు కారణంగానే వీరందరూ క్యాన్సర్‌ బారిన పడ్డారా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న విషయాన్ని వీరు అధ్యయనం చేస్తున్నారు.