సినిమా చూడండి – బరువు తగ్గిపోండి!

27-6-2017:అధిక బరువు తగ్గడానికి చాలామంది చాలారకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు తినే ఆహారం తగ్గించుకుంటారు. మరికొందరు వ్యాయామాలు చేస్తూ సన్నబడడానికి ప్రయత్నిస్తుంటారు. ఇంకొందరు రకరకాల మెడిసిన్స్ ఉపయోగిస్తుంటారు.  డైటింగ్, వ్యాయామాలు వీటన్నింటి ద్వారా బరువు తగ్గుతారు కానీ ఇవన్నీ శ్రమతో కూడుకున్నవి. అలాకాకుండా, ఎంచక్కా ఇంట్లో టీవీముందు కూర్చుని సినిమాచూస్తూ బరువు తగ్గితే ఎలా ఉంటుంది! అబ్బ! ఎంత బాగుంటుందో కదా! అయినా సినిమా చూస్తూ కూర్చుంటే ఇంకా లావు అవుతాంగానీ బరువు ఎలా తగ్గుతాం అనుకుంటున్నారా ? 

డైటింగ్‌, శారరీరక వ్యాయామాలే కాదు హర్రర్‌ సినిమాలు కూడా బరువు తగ్గడానికి సహాయపడతాయని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. 

అదేంటి హర్రర్‌ సినిమాలుచూస్తే బరువు ఎలా తగ్గుతారు? అనుకోవద్దు. కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయన్నట్లు జస్ట్‌ కూర్చుని హర్రర్‌ సినిమాలు చూస్తే చాలట, శరీరంలో కొండలా పేరుకుపోయిన కొవ్వును కరిగించేయొచ్చని పరిశోధకులు ఇటీవల నిర్ధారించారు. మరి ఏ ఏ హర్రర్‌ సినిమాలు చూడడం ద్వారా ఎంత కాలరీలు బరువు తగ్గవచ్చో, అసలు అలా ఎందుకు తగ్గుతామో తెలుసుకోండి మరి!

హర్రర్‌ సినిమా చూస్తేఅరగంట నడిచినట్టే

హర్రర్‌ సినిమాలు చూడడంవల్ల శరీరం ఏవిధంగా ప్రభావితం అవుతుందనే అంశంపై యూనివర్సిటీ ఆఫ్‌ వెస్ట్‌మినిస్టర్‌ పరిశోధకులు కొందరు, డాక్టర్‌ రిచర్డ్‌ మెకన్జీ ఆధ్వర్యంలో దయ్యాల సినిమాలు అమితంగా ఇష్టపడే కొందరు వ్యక్తులపై పరిశోధనలు చేశారు. ఆసమయంలో వారు శ్వాస తీసుకునే స్థాయి, గుండె కొట్టుకునే వేగం, ఊపిరితిత్తుల ద్వారా వారు బయటకు విడుదలచేసే కార్బన్‌డయాక్సైడ్‌ పరిమాణం మొదలైన అంశాలను పరిశీలించారు. సగటున గంటన్నరపాటు హర్రర్‌ సినిమా వీక్షిస్తే  113కాలరీలు ఖర్చవుతాయని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఈ కాలరీల సంఖ్య రోజూ మనం అరగంట నడిస్తే ఎన్ని కాలరీలు ఖర్చవుతాయో దానితో సమానం. 

హర్రరంటే ఒబేసిటికి  టెర్రర్‌

హర్రర్‌ సినిమాలంటే ఒబేసిటికి టెర్రర్‌ పుడుతుంది! అదెలాగంటే, దయ్యాల సినిమాలు చూడడంవల్ల ఊపిరితిత్తుల ద్వారా మనం ఆక్సిజన్‌ పీల్చుకునే స్థాయి పెరిగి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకంటే ఆ సినిమాల్లో కనిపించే దృశ్యాలు శరీరంలో ఉత్కంఠ రేపుతాయి కాబట్టి. ఈసమయంలో నాడీవేగం పెరిగి శరీరంలో రక్తం చాలా వేగంగా ప్రవహిస్తుంది. ఆ సమయంలో శరీరంలో కొవ్వును కరిగించే రకరకాల హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. దాని ద్వారా బిఎమ్‌ఎస్‌ (బాసల్‌ మెటబాలిక్‌ రేట్‌) పెరిగి శరీరంలో కొవ్వు కరిగిపోతూ ఉంటుంది. ఆ సమయంలోనే ఆకలి వేస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఎందుకంటే ఆ సినిమాలో భయానక దృశ్యాలు చూడడంతో భయంవల్ల శరీరం ఒత్తిడికి గురవుతుంది. అందువల్లనే ఈ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. మామూలుగా మనం చేసే రెగ్యులర్‌ వ్యాయామాల ద్వారా కూడా ఈరకమైన ఒత్తిడే కలిగి బాడీ టెంపరేచర్‌ పెరిగి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి.  అదేరకంగా దయ్యాల సినిమాలు చూడడం ద్వారా కూడా కలుగుతుంది. 

హర్రర్‌ ఎంత ఎక్కువుంటే అంత బెటర్‌ 

శరీరంలో కొవ్వును కరిగించే హార్మోన్లు ఉత్పత్తి అవడం అనేది ఆ సినిమాపై ఆధారపడి ఉంటుంది. అంటే ఎక్కువ భయానంగా ఉండే మూవీస్‌ చూస్తే ఎక్కువ కేలరీలు, తక్కువ భయానకంగా ఉండే సినిమాలు చూస్తే తక్కువ కేలరీలు ఖర్చవుతాయి. అయితే కేలరీలు ఖర్చవుతాయి కదా అని అదేపనిగా వాటిని చూడటం కూడా మంచిది కాదంటున్నారు పరిశోధకులు. వారంలో ఒకటి నుంచి మూడు సినిమాలు మాత్రమే చూడాలని, ఎక్కువ చూడడంవల్ల గుండె కొట్టుకునే వేగం మరీ ఎక్కువ పెరిగితే గుండెజబ్బులు వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వారంలో ఒకటి నుంచి మూడు సినిమాలు చూడడంవల్ల శరీరంలో 15శాతం వరకు కొవ్వును కరిగించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఎవరికైతే వర్క్‌అవుట్స్‌ అంటే ఇష్టం ఉండదో వారికి ఈ పద్థతి చాలా ఉపయోగకరం అని పరిశీలకులు చెబుతున్నారు. 

ఈ సినిమాలు చూడండి !
ఎలాంటి సినిమాలు చూస్తే ఎన్ని కేలరీలు తగ్గుతాయనే విషయంపై పరిశోధకులు ఒక పది సినిమాల పేర్లు కూడా సూచించారు. ఆ సినిమాలు చూస్తే ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయనే విషయాలను కూడా వారు వెల్లడించారు. మరి ఆ పది సినిమాల లిస్ట్‌ ఏంటో తెలుసుకోండి. కుదిరితే మీరూ వాటిని చూడడానికి ప్రయత్నించి మీ బరువు తగ్గించుకోండి. 
ది షైనింగ్‌ : ఇది 1980లో విడుదలైన బ్రిటిష్ అమెరికన్‌ సైకోలాజికల్‌ హర్రర్‌ మూవీ. ఈసినిమా దర్శకుడు స్టేన్లీ కుబ్రిక్. 1977లో విడుదలైన స్టీఫెన్‌ కింగ్ అయిన ద షైనింగ్‌ అనే నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఘనవిజయం సాధించిన చిత్రం. అత్యంత భయానక సన్నివేశాలతో నిర్మించిన 144 నిమిషాల నిడివిగల చిత్రమిది. ఈ సినిమా చూడడంవల్ల మనకు 184 కేలరీలు కరుగుతాయి. 
జాస్‌ : 1975 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్ర దర్శకుడు స్టీవెన్‌ స్పైల్‌ బర్గ్‌. 1974లో పీటర్‌ బెన్చలీ రాసిన జావ్స్‌ నవల ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. ఆనవల పేరునే ఈచిత్రానికి పెట్టడం జరిగింది. ఒళ్లుగగుర్పొడిచే సన్నివేశాలతో నిర్మించిన ఈ చిత్రం చూడడం వల్ల బాడీలో 161 కేలరీలను ఖర్చుపెట్టవచ్చు. 
ది ఎక్సార్సిస్ట్‌ : ది ఎక్సార్సిస్ట్‌ 1973వ సంవత్సరంలో విడుదలైన సూపర్‌ నాచురల్‌ హర్రర్‌ సినిమా. 1971లో విలియం పీటర్‌ బ్లాటీ రాసిన ‘ది ఎక్సార్సిస్ట్‌’ నవల ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. ఆ బుక్ రాసిన రచయిత 1949లో రోలాండ్‌ డోయ్‌ రాసిన ఎక్సార్సిసమ్‌ నవల ఆధారంగా ది ఎక్సార్సిస్ట్‌ నవలను బాట్లీ రాశాడు. ఈసినిమాలో ఇద్దరు మతపెద్దల సహాయంతో ఒక తల్లి, పన్నెండేళ్ళ తన కూతురును ఆత్మలబాధ నుంచి  ఏవిధంగా రక్షించుకుందనే అంశం చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. ఉత్కంఠ కలిగించే ఈ సినిమా చూడడం ద్వారా శరీరంలో 158 కేలరీల వరకు తగ్గించుకోవచ్చని పరిశోధనల్లో తేలింది. 
ఏలియన్‌ : ఇది బ్రిటిష్‌ – అమెరికన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ హర్రర్‌ సినిమా. 1979లో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ చిత్ర దర్శకుడు రైడ్లీ స్కాట్‌. ఓ గ్రహాంతరవాసి భూగ్రహవాసులను ఎలా చంపాడు, చివరికి అతన్ని భూగ్రహవాసులు ఏవిధంగా అంతం చేశారనే అంశంతో చిత్ర కథ నడుస్తుంది.  సైన్స్‌, హర్రర్‌ రెండింటినీ మేళవించి తీసిన ఈ సినిమా చూస్తే మన శరీరంలో 152 కేలరీలను బర్న్‌ చేయవచ్చు. 
సా: 2004లో విడుదలైన ఈ సినిమా దర్శకుడు జేమ్స్‌ వాన్‌. 2003లో అతనే ఈ సినిమా కాన్సెప్ట్‌తో షార్ట్‌ఫిల్మ్‌ కూడా తీశాడు. ఒక బాత్‌రూమ్‌లో ఇద్దరు వ్యక్తులు ఒక ఆత్మ మధ్య జరిగిన కథే సా. ఒక వ్యక్తి మరో వ్యక్తిని చంపకపోతే వారి కుటుంబాన్ని నాశనం చేస్తానని ఆ ఆత్మ చెబుతుంది. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఏం చేశారు, ఎలా ఆత్మ అంతం అయింది అనే అంశంపై కథ నడుస్తుంది. ఈసినిమాని సిరీస్ లాగా కూడా విడుదల చేశారు. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించిన ఈ చిత్రాన్ని చూస్తే శరీరంలో 133 కేలరీలు తగ్గుతాయి. 
నైట్మేర్‌ ఆన్‌ ఎల్మ్‌ స్ట్రీట్‌ : 2010లో విడుదలైన హర్రర్‌ చిత్రం నైట్మేర్‌ ఆన్‌ ఎల్మ్‌ స్ట్రీట్‌. సాముల్‌ బయర్‌ ఈ చిత్ర దర్శకుడు. 1984లో వెస్‌ క్రావెన్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని 2010లో రీమేక్ చేశారు. తమ కలలను సాధించుకోవడానికి వెళ్ళిన కొందరు టీనేజర్స్‌ని ఒక వ్యక్తి ఏవిధంగా ఇబ్బందలపాలు చేశాడు, వారు అతన్ని ఏవిధంగా ఎదురించారు అనే అంశంపై కథ నడుస్తుంది. ఈ చిత్రాన్ని చూస్తే శరీరంలో 118 కేలరీలు కరుగుతాయి. 
పారానార్మల్‌ ఆక్టివిటీ : 2007లో విడుదలైన ఈ చిత్రానికి ఓరెన్‌ పెలి దర్శకత్వం వహించాడు. ఇది ఇద్దరు భాగస్వాములను ఒక ఆత్మ ఎలా హత్య చేసిందనే కథాంశమే ఈ చిత్రం. ఈ సినిమాలో కెమరా పనితనం చాలా బాగుంటుంది. ఆ ఇంట్లో జరిగే దృశ్యాలు భయానకం కలిపిస్తాయి. 86 నిమిషాల నిడివి గల ఈ చిత్రాన్ని చూస్తే 111 కేలరీలు ఖర్చవుతాయి. 
ది వెస్టీ బ్లెయిర్‌ విచ్‌ ప్రాజెక్ట్‌ : 1999లో విడుదలైన ఈ అమెరికన్‌ సైకోలాజికల్‌ హర్రర్‌ సినిమాకి డేనియల్‌ మైరిక్‌, ఎడ్యార్డో సాన్చెజ్‌ అనే ఇద్దరు దర్శకత్వం, కథ సమకూర్చారు. ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్స్‌ చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులు ఒక ప్రదేశంలో ఏవిధంగా అదృశ్యమయ్యారనే అంశంపై చిత్ర కథ నడుస్తుంది. క్షణక్షణానికి సస్పెన్స్‌ని కలిగించే ఈ సినిమాను చూస్తే 105 కేలరీలు తగ్గుతాయని పరిశోధకులు తేల్చేశారు. 
ది టక్సాస్‌ చేన్‌ సా మసాకర్‌ : 2003లో ఈ సినిమా నిర్మించారు. మార్కస్‌ నిస్పెల్‌ దర్శకత్వం వహించారు. ఇది రీమేక్‌ సినిమా. ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలతో, సర్వత్రా ఉత్కంఠ, భయం గొలిపే ఈసినిమాను చూడడం వల్ల 107 కేలరీలను తగ్గించుకోవచ్చని పరిశోధనలో వెల్లడైంది. 
 
మహిళలకే ఎక్కువ !
ఈ హర్రర్‌ మూవీస్‌ చూడడంవల్ల మగవారికి, ఆడవారికి ఖర్చయ్యే కాలరీల సంఖ్యలో కూడా చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే దయ్యాల సినిమాలు చూసే సమయంలో మగవారితో  పోలిస్తే మహిళలు భిన్నంగా రియాక్ట్‌ అవుతారు. వారు మరింత భయాందోళన, ఉత్కంఠకు గురవుతుంటారు. అందువల్ల వారికి ఇంకా ఎక్కువ కేలరీలు తగ్గే అవకాశం ఉంది. 
 
బరువు తగ్గాలంటే ?
1. బరువు తగ్గాలంటే త్వరగా జీర్ణమయ్యే ఆహారం, తకొవ్వు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అన్ని పూటలా భోజనానికి బదులు ఏదో ఒక సమయంలో ఆకుకూరలతో, కూరగాయలతో చేసిన సలాడ్‌ తీసుకోవాలి. ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. 
2. .నిద్రలేచిన గంటలోపే బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేయాలి. ఆలస్యంగా తింటే రెండు భోజనాల మధ్య సమయం తగ్గి కొవ్వు పెరుగుతుంది.
3. రోజూ పాల ఉత్పత్తులు ఎంతో కొంత పరిమాణంలో తీసుకోవాలి. వీటిలోని కాల్షియం కొవ్వుని కొంత మేరకు తగ్గించగలదు.
4. భోజనానికి ముందు నారింజ లాంటి నిమ్మజాతి పండు సగం తింటే బరువు తగ్గుతారని పరిశోధనల్లో తెలిసింది.
5. వ్యాయామం చేశాక 30 నుంచి 60 నిమిషాల లోపు భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. కొత్తగా చేరే కేలరీలను శరీరం అలసిపోయినప్పుడు వెంటనే ఉపయోగించుకుంటుంది.
– విజేత