బరువు తగ్గించే మసాలా

09-08-2017: అల్లంలో కొవ్వును కరగించే గుణంతో పాటు, జీవ క్రియల్ని వేగవంతం చేసే శక్తి కూడా ఉంది. అల్లం దంచి రసం తీసి, పొయ్యి పైన బాగా మరిగించాలి. బాగా మరిగిన తర్వాత ఎంత రసం ఉంటే, అంతే మోతాదులో తేనె కలిపి మరికాసేపు మరిగించి దించేయాలి. చల్లారిన తర్వాత ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. అందులోంచి ఒక స్పూను రసం తీసుకుని దానికి ఒక గ్లాసు వేడి నీళ్లు కలిపి, ఉదయం, సాయంత్రం తీసుకుంటే, బరువు తగ్గడంతో పాటు క్రమంగా పొట్ట కూడా కరిగిపోతుంది.

కొవ్వును కరిగించడం ద్వారా బరువు తగ్గించే మరో మసాలా దినుసు దాల్చిన చెక్క. ఇది బరువును తగ్గించడంతో పాటు రక్తంలోని చక్కెర నిలువల్ని కూడా అదుపులోకి తెస్తుంది.. బాగా మరిగిన నీళ్లల్లో అరస్పూను దాల్చిన చెక్క పొడి వేసి రెండు నిమిషాల తర్వాత దించేయాలి. ఆ రసాన్ని రోజూ రెండు సార్లు తాగితే స్థూలకాయం తగ్గుతుంది.

భోజనంతో పాటు లేదా భోజనం తర్వాత ఒక స్పూను జీలకర్ర తినేస్తే జీర్ణక్రియ బాగా జరిగి బరువు తగ్గుతారు. జీలకర్రలో రక్తహీనత, అర్శ మొలలు, మతిమరుపు, నిద్రలేమి వంటి సమస్యల్ని తగ్గించే శక్తి కూడా ఉంది.

నల్లమిరియాల్లోని పెపరీన్‌కు కొవ్వు కరిగించే గుణం ఉంది. ఈ మిరియాలను రోజుకు రెండుసార్లు కాస్తంత బెల్లంతో తీసుకుంటే బరువు తగ్గుతారు.