బరువును భలే తగ్గిస్తాయి!

25-06-2018:నిమ్మ: విటమిన్‌ సమృద్ధిగా ఉండే నిమ్మకాయలో శరీర బరువును తగ్గించే అంశాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయాన గ్లాసు గోరు వెచ్చని నీళ్లల్లో ఒక నిమ్మకాయ రసాన్ని కలిపి సేవిస్తే, శరీరంలోని వ్యర్థాలు బయటికి పోవడంతో పాటు, కొవ్వు కరిగిపోతుంది. క్రమం తప్పకుండా రోజూ తీసుకుంటే, జలుబు, దగ్గువంటివి దూరం కావడంతో పాటు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. తరుచూ తలనొప్పి రావడం వంటి సమస్యలకు బ్రేక్‌ పడుతుంది. రక్తప్రసరణను ఉత్తేజితమవుతుంది. దీనివల్ల రక్తనాళాల పైని ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. పిత్తాశయాన్ని చైతన్యం కావడంతో జీర్ణ, విసర్జక ప్రక్రియలు సాఫీగా సాగిపోతాయి.
 
గ్రీన్‌-టీ: దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. సహజ సిద్ధమైన యాంటీఆక్సిడెంట్లకు మూలమైన పాలీఫెనాల్స్‌ ఇందులో సరిపడా ఉంటాయి. చక్కెర లేకుండా గ్రీన్‌ టీ తాగితే బరువు తగ్గే అవకాశాలు ఎక్కువ. ఇందులో ఉండే టానిన్లు కొలెస్ట్రాల్‌ను, రక్తపోటును తగ్గించడంలో తోడ్పడతాయి.
 
పుచ్చపండు: ఇందులో కేలరీలు మరీ తక్కువగానూ, విటమిన్లు చాలా ఎక్కువగానూ ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి తోడ్పడతాయి. ప్రత్యేకించి పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోకుండా నిలువరిస్తాయి.
 
క్యాబేజీలో, బ్రొకోలీలో క్యాలరీలు తక్కువగానూ, ఫైబర్‌ ఎక్కువగానూ ఉంటాయి. క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. బ్రొకోలీలోనేమో స్థూలకాయం రాకుండా కాపాడుతుంది.

జీలకర్రను నీళ్లలో వేసి మరిగించి క్రమం తప్పకుండా రోజూ పొద్దున పరగడుపున సేవిస్తూ ఉంటే శరీరం బరువు తగ్గిపోతుంది.