స్థూలకాయంతో చుక్కెదురే...

20-11-2017: ‘‘ఈ మధ్య బాగా లావెక్కుతున్నారు ఏమిటి కథ?’’ అంటుంటారు చనువున్న వాళ్లు అందుకు చాలా మంది నోట ‘‘ నేను చాలా పరిమితంగానే తింటానండీ.... అయినా ఏమిటో ఇలా అయిపోతున్నాను’’ అన్న సమాధానం వచ్చేస్తుంది. నిజానికి, వాళ్లు పరిమితంగా తింటున్నారనే దాంట్లో అసత్యమేమీ లేకపోవచ్చు. కాకపోతే తినే ఆహార పరిమాణం తక్కువే అయినా, అందులో ఎక్కువ కేలరీలు ఎక్కువగా ఉండవచ్చు కదా! వాస్తవానికి చాలా సార్లు ఇదే జరుగుతుంది. ఏ ఆహార పదార్థంలో ఎన్ని కే లరీలు ఉంటాయో ఆ ఆంచనా చాలా మందికి ఉండదు. మన శరీరం బరువు రోజురోజుకూ అలా పెరిగిపోవడానికి చాలా సార్లు అదే కారణమవుతూ ఉంటుంది. ఒక వేళ ఎవరైనా, తక్కువ కాలరీలు ఉన్న ఆహారపదార్థాలే తీసుకుంటున్నా, లావెక్కుతూ ఉంటే అప్పుడు ఏమనుకోవాలి? ఆ కాసిన్ని కే లరీలు కూడా ఖర్చు అయిపోయే శరీర శ్రమ కూడా మనం చేయడం లేదని మనమప్పుడు అర్థం చేసుకోవాలి.

ఆహారం తగ్గించడమేనా?
శరీర బరువు ఏ కాస్త పెరిగినట్లు అనిపించినా, చాలా మంది చేసే మొదటి పని తినే ఆహారం మోతాదు బాగా తగ్గించివేయడం. దీనివల్ల అవసరమైన పోషకాలు అందక శరీరం శుష్కించిపోవడం మొదలవుతుంది. ఫలితంగా జీవక్రియలు కుంటుబపడతాయి. అందులో భాగంగా జీర్ణక్రియ కూడా మందగిస్తుంది. ఈ క్రమంలో కండరాలు, ఎముకలు, నాడీవ్యవస్థ దెబ్బ తింటాయి. ఇది కాదు మార్గమని ఆ తర్వాత ఎప్పుడో అనిపించి, తినే మోతాదు పెంచాలని చూస్తే, అప్పటికి, ఆ మేరకు జీర్ణించుకునే శక్తి శరీరానికి ఉండదు. అందువల్ల శరీరం బరువు పెరగడం మొదలవగానే తిండి తగ్గించేయడానికి సిద్ధమైపోవడానికన్నా ముందు వ్యాయామం వైపు దృష్టి సారించడం చాలా ముఖ్యం. ఒకవేళ తినే ఆహారంలో కేలరీలు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ కాలరీలున్న ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆహారంలో కొవ్వు పదార్థం తక్కువగా ఉండే వాటినే ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం.
 
కేలరీల ఖర్చు
సహజంగా బాగా శరీర శ్రమ ఉండే ఉద్యోగ వ్యాపారాల్లో 8 గంటల వ్యవధిలో 1200 కేలరీలు ఖర్చవుతాయి. శరీర శ్రమ పెద్దగా లే ని వృత్తుల్లో అయితే 8 గంటల్లో 900 కేలరీలు ఖర్చవుతాయి. నిద్రాసమయంలో అయితే 8 గంటల్లో ఖర్చయ్యే కేలరీలు 400 - 500 కేలరీలు మాత్రమే. కాక పోతే ఈ కేలరీలు ఖర్చుకావడం అనేది స్త్రీ పురుషుల్లో వేరు వేరుగా ఉంటుంది.
 
పురుషుల్లో
స్వల్పంగా శ్రమించేవారిలో రోజుకు సగటున 2200 కేలరీలు ఖర్చవుతాయి.
మధ్యస్తంగా శ్రమించే వారిలో రోజుకు 2800 కేలరీలు ఖర్చవుతాయి.
ఎక్కువగా శ్రమించే వారిలో రోజుకు 3400 కేలరీలు ఖర్చవుతాయి.
 
స్త్రీలలో
స్వల్పంగా శ్రమించే వారిలో రోజుకు 1900 కేలరీలు ఖర్చవుతాయి.
మధ్యస్తంగా ఖర్చయ్యే వారిలో రోజుకు 2200 కేలరీలు ఖర్చవుతాయి.
ఎక్కువగా శ్రమించే వారిలో రోజుకు 2800 కేలరీలు ఖర్చవుతాయి.
అందువల్ల మనం చేసే శరీర శ్రమను, మనం తీసుకునే ఆహారంలోని కేలరీలను బేరీజు వేసుకుంటూ ఉంటూ మన జీవన శైలిని కొనసాగిస్తే, స్థూలకాయం బారిన పడకుండా మన శరీరాల్ని మనం నియంత్రించుకోవచ్చు.
 
సూర్య నమస్కారాలు
యోగాలోని సూర్య నమస్కారాలు శరీరం బరువును తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. దీనికి తోడు, ఊపిరి తిత్తులు, జీర్ణకోఽశం, నాడీ మండలం, గుండె వంటి కీలక అవయవాలన్నీ బలపడతాయి. రోగ నిరోధక శక్తి కూడా అపారంగా పెరుగుతుంది.
 
డాక్టర్‌ కృష్ణమూర్తి,
సూపరింటెండెంట్‌
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగ. హైదరాబాద్‌