కారంతో ఊబకాయం దూరం?

ఆంధ్రజ్యోతి, 6-6-2017: కారం, మసాలాలు ఆరోగ్యానికి హానికరం అన్నది చాలామంది నమ్మకం. ఇది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు పరిశోధకులు. కారం ఎక్కువ తీసుకున్నంత మాత్రాన ఆరోగ్యానికి ఎలాంటి హానీ జరగదనీ, ఊబకాయం తగ్గుముఖం పడుతుందన్న విషయం వీరి పరిశోధనల్లో వెల్లడైంది. అంతేకాకుండా ఊబకాయం వలన వచ్చే పదిరకాల క్యాన్సర్ల బారి నుంచి పడకుండా తప్పించుకోవచ్చు అని వారు చెబుతున్నారు. ఎలుకల మీద వీరు పరిశోధనలు నిర్వహించారు. కొన్ని ఎలుకలకు కారంతో కూడిన ఆహారాన్ని ఇచ్చారు. మరికొన్ని ఎలుకలకు మామూలు ఆహారాన్ని ఇచ్చారు. కొన్ని నెలల అనంతరం వీటిని పరిశీలించగా కారం ఎక్కువగా తీసుకున్న ఎలుకల్లో బరువు తగ్గడాన్ని గమనించారు. కారం తినని ఎలుకలు బరువు పెరగడాన్ని గుర్తించారు. కారంతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే బరువు తగ్గవచ్చు అన్న విషయాన్ని వీరు నిర్ధారించారు. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం దీనికి దూరంగా ఉండాలని వీరు సూచిస్తున్నారు.