ఆడవాళ్లతో కూర్చుంటే లాగించేస్తారు

ఆంధ్రజ్యోతి, 20-11-15: అబ్బాయిలూ అమ్మాయిలతో కలిసి రెస్టారెంట్లకు వెళ్తున్నారా? తస్మాత్‌ జాగ్రత్త. ఎందుకంటారా?  అమ్మాయిలతో కలిసి తినేటప్పుడు అబ్బాయిలు ఎక్కువ లాగించేస్తున్నారట. ఇటీవల నిర్వహించిన ఒక స్టడీలో ఈ విషయం వెల్లడైంది. తోటి మగవాళ్లతో కూర్చుని తినే దానికంటే కూడా అమ్మాయిల కంపెనీలో మగవాళ్లు ఎక్కువ ఫుడ్‌ను ఆరగిస్తున్నారుట. కార్నెల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ స్టడీని చేశారు. అమ్మాయిలతో ఉన్నప్పుడు ఆడంబరం కోసం మగవాళ్లు అలా ప్రవర్తిస్తారట. ఈటింగ్‌ కాంపిటీషన్లలో కూడా మగవాళ్లు ఎక్కువగా పాల్గొనడానికి కారణం ఇదేనంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ అధ్యయనంలో భాగంగా 105 మంది పెద్దవాళ్లను రెండు వారాల పాటు పరిశీలించారు. పార్టిసిపెంట్లు ఎన్ని పిజ్జాలు తిన్నారు, ఎన్ని సలాడ్‌ బౌల్స్‌ ఆర్డర్‌ చేశారు వంటి విషయాలను గమనించారు. మహిళతో కూర్చుని తిన్న మగవాళ్లు 93 శాతం ఎక్కువ పిజ్జాలు తిన్నారు. తోటి పురుషులతో కూర్చుని తిన్నప్పుడు కంటే మహిళతో కూర్చుని తిన్నప్పుడు మగవాళ్లు 86  శాతం అదనంగా సలాడ్స్‌ తిన్నారు. అదే ఆడవాళ్ల విషయానికి వస్తే మగవాళ్లతో లేదా తోటి ఆడవాళ్లతో ఎవరితో కలిసి తిన్నా వాళ్లు తినే పరిమాణం మాత్రం ఒకేలాగ ఉంది. ఎలాంటి తేడా లేదు. సో....అబ్బాయిలూ... అమ్మాయిలతో రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు ఆచి తూచి తినండి... లేకపోతే లావైపోతారు.