బరువు తగ్గాలంటే లైఫ్‌స్టయిల్‌ మార్చుకోవాల్సిందే...!

12-11-2018: బరువు తగ్గాలనే కోరిక సహజంగానే చాలామందిలో ఉంటుంది. అయితే ఎలా తగ్గాలో తెలియక తికమక పడుతుంటారు. ప్రత్యేకమైన డైట్‌, ఫిట్‌నెస్‌... ఇలా రకరకాల మార్గాలుంటాయి. అయితే లైఫ్‌స్టయిల్‌లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా కూడా ఫలితం ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేమిటంటే...

 
భోజనం హడావిడిగా చేయడం వల్ల జీర్ణక్రియలో మార్పులు వస్తాయి. భోజనం చేయడం అంటే రన్నింగ్‌ రేస్‌ కాదనే విషయాన్ని గ్రహించాలి. నోట్లో ఆహారాన్ని సరిగ్గా నమిలి తినడం ముఖ్యం. దానివల్ల పొట్ట నిండినట్టుగా కాకుండా కొంత ఖాళీ ఉంటుంది.
రాత్రి భోజనం తర్వాత ఏదో ఒకటి తినడం మానేయాలి. కొంతమంది అర్థరాత్రి ఫ్రిజ్‌ డోర్‌ తెరిచి, అందులో ఉన్నవి ఏదో ఒకటి తింటుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒకవేళ అర్థరాత్రి ఆకలిగా ఉన్నట్టు అనిపిస్తే నీళ్లు తాగడమో లేదా మితంగా నట్స్‌, డేట్స్‌ తినడమో చేయాలి.
 
ఆహారంలో కార్బోహైడ్రేట్స్‌ ఉంటే శరీరానికి మేలు జరుగుతుంది. అయితే వాటిని కూడా సరైన సమయంలోనే తీసుకోవాలి. బ్రెడ్‌, మైదా కన్నా తృణధాన్యాలతో చేసిన పదార్థాలు తీసుకుంటే మంచిది. వర్కవుట్స్‌ చేసిన తర్వాత వీటిని తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.
 
బరువు తగ్గడానికి నీళ్లు తాగడం తెలివైన పరిష్కారం. కూల్‌డ్రింక్‌, టీ, కాఫీ, చక్కెర కలిపిన ఫ్రూట్‌జ్యూసులను తాగితే బరువు పెరుగుతారు తప్ప ఎప్పటికీ తగ్గరు.
ఆకలికీ నిద్రకూ లింక్‌ ఉంది. సరైన నిద్ర లేకపోతే శక్తి సన్నగిల్లినట్లవుతుంది. ఫలితంగా ఆకలి పెరుగుతుంది. సరిగా నిద్రపోకపోతే జీర్ణక్రియలో కూడా మార్పులొస్తాయి. కాబట్టి రోజుకు ఆరుగంటలు తప్పకుండా నిద్ర పోవాల్సిందే.