ఊబకాయానికి ఇదొక కారణం?

09-11-2017: ఊబకాయం అనేది కేవలం ఆహారపు అలవాట్లు, తగినంత వ్యాయామం చేయకపోవడం వలన మాత్రమే రాదనీ, నిద్రలేమి కారణంగా ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లండన్‌ యూనివర్శిటీ పరిశోధకులు అంటున్నారు. ఫాస్ట్‌ఫుడ్‌ కన్నా కూడా నిద్రలేమి కారణంగా ఊబకాయం త్వరగా వచ్చేస్తుందన్న విషయం వీరి అధ్యయనంలో వెల్లడైంది. సుమారు 1700 మంది ఆహారపు అలవాట్లను, నిద్రపోయే సమయాలను, రక్తపోటు, షుగర్‌ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వీరు సుదీర్ఘకాలం పాటు అధ్యయనం నిర్వహించారు. రోజుకి తొమ్మిది గంటలకన్నా తక్కువగా అంటే ఆరు లేదా ఏడు గంటలు మాత్రమే నిద్రపోయే వారిలో బరువు పెరగడాన్ని వీరు గమనించారు. రాత్రి సమయంలో తొమ్మిది గంటలు నిద్రపోయే వారిలో ఈ మార్పును వీరు గుర్తించలేదు. పగటిపూట నిద్రపోయే సమయాన్ని వీరు పరిగణనలోకి తీసుకోలేదు. రాత్రి సమయంలో తొమ్మిది గంటలు నిద్రపోయేవారు అధికబరువు సమస్యతో బాధపడరని వీరు చెబుతున్నారు. తొమ్మిదిగంటలకు మించి పడుకునేవారిలో ఊబకాయం సమస్య తలెత్తవచ్చని వారు చెబుతున్నారు. కేవలం నిద్రపోయే సమయాలే అధికబరువుకు కారణం అవుతాయా? అన్న విషయాన్ని మాత్రం వీరు స్పష్టం చేయలేకపోతున్నారు. దీని మీద ఇంకా పరిశోధనలు నిర్వహించాలని వారు చెబుతున్నారు.