పది కిలోలు తగ్గాలి... చక్కటి ప్లాన్‌ చెబుతారా?

నా వయసు పందొమ్మిది సంవత్సరాలు. బరువు ఎనభై ఐదు కిలోలు. కొత్త సంవత్సరంలో కనీసం పది కిలోలు తగ్గాలని అనుకుంటున్నా. సాధ్యమేనా?
- రాగశ్రీ, విజయవాడ
కొత్త సంవత్సరం వస్తోందనగానే మనం కొత్త తీర్మానాలు చేసుకుంటాం. వాటిలో బరువు నియంత్రణ చాలా మంచి నిర్ణయం. పది కేజీలు తగ్గడం అనేది అసాధ్యమైన విషయం కాదు. సరైన ఆహార నియమాలు పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మూడు లేదా నాలుగు నెలల్లో పది కిలోలు తగ్గవచ్చు. నియమాల విషయానికొస్తే... ముందుగా రోజూ సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో పళ్ళు, కూరగాయలు ఎక్కువగా ఉండాలి.  రోజూ పప్పు లేదా గుడ్లు తప్పనిసరి. వెన్నతీసిన పాలు, పెరుగు కూడా బరువు నియంత్రణకు  ఉపయోగపడతాయి. తగిన మోతాదులో ఆహారం తీసుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించవచ్చు. ఆకలైనప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలి. ఆకలి తీరేంత వరకు మాత్రమే తినాలి. కడుపు నిండాలని తింటూ పోకూడదు. భోజనాలకు మధ్యలో తీసుకునే స్నాక్స్‌ కూడా ఆరోగ్యకరమైనవై ఉండాలి. పండ్లు, వేయించిన బఠాణీలు, సెనగలు, మొలకెత్తిన గింజలు, మజ్జిగ మొదలైనవి తీసుకుంటే తక్కువ కెలోరీల్లోనే ఎక్కువ పోషక పదార్ధాలు లభిస్తాయి. రాత్రి భోజనాన్ని నిద్రకు కనీసం రెండు నుంచి మూడు గంటల ముందు ముగించాలి. ఆహార నియమాలతో పాటుగా రోజూ నడక, పరుగు వంటి శారీరక వ్యాయామాన్ని కనీసం 30 నుండి 60 నిమిషాల పాటు చెయ్యాలి. నేరుగా బరువు తగ్గాలనే తీర్మానం కంటే ప్రతి పూటా సరైన ఆహారాన్ని తీసుకోవాలని, రోజూ వ్యాయామం చెయ్యాలనీ నిర్ణయించుకుంటే బరువు దానంతట అదే తగ్గిపోతుంది.