మధుమేహం, ఊబకాయాలకు జన్యుచికిత్స

చర్మ మూలకణాల ద్వారా చెక్‌
యూనివర్సిటీ ఆఫ్‌ చికాగో శాస్త్రజ్ఞుల వెల్లడి
పార్కిన్సన్స్‌ను అడ్డుకునే మధుమేహ ఔషధం
 
వాషింగ్టన్‌, ఆగస్టు 4: టైప్‌-2 మధుమేహ, స్థూలకాయ బాధితులకు శుభవార్త. చర్మ మూలకణాల ద్వారా అలాంటి జీవనశైలి జబ్బులను నియంత్రించే జన్యు చికిత్సను వర్సిటీ ఆఫ్‌ చికాగో శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఎలుకలపై వారు చేసి న పరిశోధన విజయవంతమైంది. వారు నవజాత ఎలుకల నుంచి చర్మ మూలకణాలను సేకరించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న సీఆర్‌ఐఎ్‌సపీఆర్‌ అనే జన్యు మార్పిడి విధా నం ద్వారా ఆ మూలకణాల్లో మార్పులు చేసి కొన్ని ఎలుకల్లో ప్రవేశపెట్టారు. వారు చేసిన మార్పుల వల్ల ఆ మూలకణాలు రక్తంలో చక్కెరస్థాయులను నియంత్రించే ఓ రకం పెప్టైడ్‌ను స్రవించడం మొదలుపెట్టింది. తద్వారా వాటిలో మధుమేహం తగ్గడమే కాదు.. ఎక్కువ కొవ్వులున్న ఆహారం ఇచ్చినా బరువు నియంత్రణలోనే ఉండడం గమనించారు. అంతేకాదు.. సుదీర్ఘకాలంపాటు ఇన్సులిన్‌ బయటినుంచి తీసుకోవడం వల్ల శరీరం సంతరించుకొనే ‘ఇన్సులిన్‌ నిరోధకత’ను కూడా తగ్గించినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఎలుకల్లో ఇది విజయవంతమైందని.. మానవుల్లో మధుమేహాన్ని జన్యు చికిత్స ద్వారా తగ్గించే దిశగా ఇదో ముందడుగు అని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. నిజానికీ ఆలోచన తమకు ఎప్పట్నుంచో ఉన్నదని.. అది ఇంత బాగా ఫలితమివ్వ డం ఆనందాన్ని కలిగిస్తోందని మూలకణ జీవశాస్త్రవేత్త జియావోయాంగ్‌ వు తెలిపారు. శరీరంలో అతి పెద్ద అవయవం చర్మం.. చర్మంలో అమర్చిన ఇంప్లాంట్లను అత్యవసరపరిస్థితుల్లో సులభంగా తీయగలిగే భాగం అయినందునే చర్మాన్ని ఎంచుకున్నట్టు వు తెలిపారు.
 
పార్కిన్సన్స్‌కు చెక్‌?
పార్కిన్స న్స్‌.. డోపమైన్‌ హార్మోన్‌ను విడుదల చేసే మెదడు కణాలు ధ్వంసమై పోతూ పోతూ చివరి కి జ్ఞాపక శక్తి సమస్యలను తెచ్చిపెట్టే జబ్బు ఇది. దీనిబారిన పడినవారికి డోపమైన్‌ స్థాయులను పెంచే మందులను సిఫారసు చేస్తారు. ఆ మందుల వల్ల ఒకింత ఉపశమనం కనిపిస్తుందిగానీ.. మెదడు పనితీరు నానాటికీ తగ్గిపోతుంటుంది. కానీ.. టైప్‌-2 మధుమేహ బాధితులకు ఇచ్చే ఎగ్జెనటైడ్‌ మందులు పార్కిన్సన్స్‌ పెరగడాన్ని అడ్డుకుంటున్నట్టు తమ పరిశోధనలో తేలిందని  వర్సిటీ కాలేజ్‌ లండన్‌ పరిశోధకులు తెలిపారు.