తిండి మానేస్తే లావు తగ్గరు!

20-02-2018: అమ్మాయిలు తొందరగా బరువు తగ్గిపోవాలనుకుంటారు. సన్నగా...అందంగా కనిపించాలనుకుంటారు. అందుకోసం ఆహార నియమాలను పాటించడం, పోషకవిలువలతో కూడిన ఆహారం తీసుకోవడలాంటివి చేయకుండానే తినే తిండిని ఒక్కసారిగా బాగా తగ్గించేస్తారు. ఇలా చేయడం వల్ల లావు తగ్గడం అటుంచితే, కొత్త ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తాయి. అందుకే బరువు తగ్గాలనుకునేటప్పుడు కొన్ని విషయాలు మర్చిపోకూడదు. ముఖ్యంగా తినే తిండిలో పోషకవిలువలు ఉండేలా చూసుకోవాలి.

ప్రొటీన్లు తీసుకోకపోతే శరీరం బలహీనపడుతుంది. పిండిపదార్థాలు, ఫ్యాట్స్‌లాగా ఇవి శరీరంలో స్టోరు కావు. మరి ప్రొటీన్లు అంటే వేటిని తినాలంటారా? కూరగాయల్లో ప్రొటీన్లు ఉంటాయి. నాన్‌వెజిటేరియన్‌లో కూడా ఇవి పుష్కలంగా ఉంటాయి. శాకాహారులు పాల ఉత్పత్తులను తీసుకోవాలి. వీటిల్లో ఎమినోయాసిడ్లు ఉంటాయి. అందుకే రోజూ ప్రొటీన్లు మీరు తీసుకునే డైట్‌లో ఉండేలా చూసుకోవాలి. టోఫు, డైరీ మిల్కు, సోయా మిల్కులాంటివి తీసుకోవచ్చు. లేదా సోయా నుంచి తీసిన ప్రొటీన్‌ పొడిని వాడొచ్చు.

ప్రొటీన్లు తీసుకోవడం వల్ల తొందరగా ఆకలి వేయదు. ఫలితంగా డైట్‌ ప్లాన్‌ క్రమం తప్పకుండా పాటించగలుగుతారు. డైట్‌లో పోషక విలువలు లోపిస్తే జుట్టు, చర్మం కోసం మీరు ఎన్ని మల్టీవిటమిన్లు తీసుకున్నా ఎలాంటి ఫలితమూ ఉండదు. ఎముకలకు ప్రొటీన్లు చాలా మంచిది. మరీ ముఖ్యంగా మెనోపాజ్‌లోకి ప్రవేశించిన మహిళలకు ప్రొటీన్లు అత్యావశ్యకం. అందుకే లావు తగ్గాలని కోరుకుంటున్నవారు పద్ధతి ప్రకారం సమతుల్యమైన ప్రొటీన్‌ ఫుడ్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే కాల్షియం, విటమిన్‌-డిలను కూడా తీసుకోవాలి