మానకపోతే.. లావైపోతాం!

30-10-2017: టీవీ చూసేందుకు ఎక్కువ సమయం కేటాయించటం అంటే స్థూలకాయాన్ని కొనితెచ్చుకోవటమే అంటున్నారు వైద్యులు. ఎక్కువ సమయం టీవీల ముందు కూర్చోవటం ల్యాప్‌టాప్‌ ముందేసుకోని సినిమాలు చూడటం అంటే అధిక బరువుకు ఆహ్వానం పలికినట్టే.

 
ముఖ్యంగా నేటి యువత సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌, టీవీ తెరలకు అతుక్కుపోతున్నారు. వీటిలో ఇష్టమైన కార్యక్రమాలు చూస్తూ పరధ్యానంగా బంగాళదుంప చిప్స్‌ లాంటి రిఫైన్డ్‌ ఆహారాన్ని ఎక్కువగా తినటం, జంక్‌ ఫుడ్‌ తీసుకోవటం, శీతల పానీయాలు తాగటం వల్ల క్రమంగా బరువు పెరిగి చివరకు స్థూలకాయానికి దారి తీస్తోంది. ఎక్కువ సేపు ఒకే భంగిమలో కదలకుండా కూర్చోవటం వల్ల జీవక్రియల రేటు తగ్గి త్వరగా బరువు పెరుగుతారని వైద్యుల మాట. కూర్చోని టివి చూసినప్పటి కన్నా నిద్రలోనే శరీరం ఎక్కువ క్యాలరీల శక్తిని ఖర్చు చేస్తుంది. కానీ టీవీలు, సెల్‌ఫోన్‌లతో ఎక్కువ సమయం గడిపేవాళ్లకి తగినంత నిద్ర ఉండదు. అటు సరిపడా వ్యాయామం, ఇటు తగినంత నిద్ర లేక శరీరం దుష్ప్రభావాలకు లోనవుతుంది. రోజులో కొంతసేపు నడ వటం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడపడానికి కొంత సమయం కేటాయించటం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చంటున్నారు వైద్యులు.