బ్రేక్‌ఫాస్ట్‌కి దూరమైతే కష్టాలే..

10-10-15:బిజీ జీవితంలో పడి  కొందరు బ్రేక్‌ఫాస్ట్‌ని తినరు. రోజూ వారి ఆహారంలో ఇది చాలా ముఖ్యమైనది, దీన్ని మిస్సయితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లేనని అంటున్నారు నిపుణులు. బ్రేక్‌ఫాస్ట్‌ చేయని వారిలో జీవక్రియ దెబ్బతింటుంది. పొట్టలో రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. బ్రేక్‌ఫాస్ట్‌ తినే వారితో పోలిస్తే బ్రేక్‌ఫాస్ట్‌ తినని వారిలో హైపర్‌టెన్షన్‌ ఉంటుంది. ఉదయాన్నే అల్పాహారం ఆరగించకుంటే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఓ సర్వేలో తేలింది. హార్వర్డ్‌ యూనివర్శిటీ వారు 46,289 మందిని తీసుకుని ఓ పరిశోధన చేశారు. బ్రేక్‌ఫాస్ట్‌ను పట్టించుకోని వారు టైప్‌-2 డయాబెటిస్‌కు గురయ్యే ప్రమాదముందని ఆ పరిశోధనలో తేల్చారు.

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తినటం మానేస్తే బరువు తగ్గిపోతామని చాలామంది అనుకుంటారు. అది అపోహే. ఇలా బ్రేక్‌ఫాస్ట్‌ ఎగ్గొటితే మాత్రం ఖచ్చితంగా బరువు పెరుగుతారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.ఉదయాన్పే అల్పాహారం తినకుంటే ఎనర్జీ లెవల్స్‌ తగ్గిపోతాయి. దీంతో పాటు శరీరంపై దుష్ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. తలనొప్పి వస్తుంది. ముఖ్యంగా మైగ్రేన్‌ నొప్పులు పట్టి పీడిస్తాయి. బ్రేక్‌ఫాస్ట్‌కు దూరంగా ఉండటం వల్ల వెంట్రుకల్లోని కెరోటిన్‌లో సమస్యలు తలెత్తి జుట్టు రాలుతుంది.