రొట్టెలు, చపాతీలు మంచివా? కొర్ర బియ్యం మంచిదా?

బరువు తగ్గడానికి జొన్న రొట్టెలు, చపాతీలు మంచివా?  కొర్ర బియ్యం మంచిదా?

- సత్యనారాయణ, హైదరాబాద్‌ 
మనం ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నామన్నది ఎంత ముఖ్యమో, ఎంత పరిమాణంలో తీసుకుంటున్నామన్నదీ అంతే ముఖ్యం. చపాతీలు, గోధుమ నూక (దలియా), జొన్న రొట్టెలు, కొర్ర బియ్యం, ముడి బియ్యం (బ్రౌన్‌ రైస్‌) ఇలా ఏ ధాన్యపు ఉత్పత్తులైనా సరే, తగిన పరిమాణంలో తింటే.. బరువును నియంత్రణలో ఉంచు కోవచ్చు. గోధుమ రొట్టెలు, ముడి బియ్యంకంటే కూడా జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాల్లో మాంస కృత్తులు, పీచుపదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. కాస్తంత తినగానే కడుపు నిండినట్లు ఉంటుంది. త్వరగా ఆకలి వేయదు. అయితే రొట్టెలు, ముడి బియ్యం, కొర్ర బియ్యం... ఏదైనాసరే వాటితో పాటు తీసుకునే కూర, పప్పు పరిమాణాన్ని బట్టి కూడా బరువు తగ్గడం అనేది ఆధారపడి ఉంటుంది. ప్రతి ధాన్యంలో దానికే ప్రత్యేకమైన కొన్ని పోషకాలు ఉంటాయి. కాబట్టి ఒకే ధాన్యపు వంటకాన్ని రోజూ తినకుండా, అన్ని రకాల ధాన్యాలనూ తీసు కోవాలి. ఆకుకూరలనూ కాయగూరలనూ ఎక్కువగా తినడం మంచిది. వెన్న తీసిన పాలు, పెరుగు వినియోగించాలి. దీంతో పాటు శారీరక వ్యాయామం చేయాలి. తగినంత నిద్రపోవాలి. ఈ  జాగ్రత్తలు పాటిస్తే బరువు తగ్గడం తేలికవుతుంది. మనం ఎంచుకునే ఆహార విధానం పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేదై ఉండాలి. కేవలం బరువు తగ్గించినంత మాత్రాన సరిపోదు.