మత్తుకు కాదు.. మమతకు బానిసలు!

25-07-2017: సరదా కోసం, మెప్పు కోసం, నలుగురిలో ప్రత్యేక గుర్తింపు కోసం, బాధల్ని మరిచిపోవటం కోసం...డ్రగ్స్‌ను ఆశ్రయించటానికి ఇలాంటివి సవాలక్ష కారణాలు. అయితే మత్తు శిఖరాల్ని అందుకునే క్రమంలో జీవితం పట్టుతప్పిపోతోందనే వాస్తవాన్ని ఏ ఒక్క డ్రగ్‌ అడిక్టూ గ్రహించడు! కానీ తల్లితండ్రులు కొంత అప్రమత్తత, మరికాస్త ముందుజాగ్రత్తలు పాటించగలిగితే మత్తుకు బానిసలు కాకుండా తమ పిల్లలను కాపాడుకోవచ్చు.

 
కారణాలున్నాయి
సిగరెట్‌, మద్యం, హుక్కా, డ్రగ్స్‌...మత్తులో ఒక్కో మెట్టూ ఎక్కుతూ తిరిగి నేలకు దిగిరాలేని అభాగ్యులెంతోమంది. మరీ ముఖ్యంగా టీనేజీ పిల్లలే మత్తు పదార్థాలకు తేలికగా బానిసలవుతూ ఉంటారు. ఇందుకు కారణాలు అనేకం. అవేంటంటే....
తల్లితండ్రుల ప్రేమ లోపించటం.
ఒంటరితనం
ప్రేమ వైఫల్యం
ఒత్తిడులు
స్నేహితుల ప్రోద్బలం
కుటుంబ సంబంధాలు బలహీనపడటం
కుటుంబ కలహాలు
 
గుర్తించటం తేలికే!
డ్రగ్స్‌ను ఒకసారి రుచి చూసిన తర్వాత తిరిగి విడిచి పెట్టడం అసాఽధ్యమే! మెదడులోని హ్యాపీ హార్మోన్‌ స్థానాన్ని ఆక్రమించి డ్రగ్స్‌లోనే ఆనందాన్ని పొందేలా మనిషిని వశం చేసుకుంటాయి... హాషిష్‌, గంజాయి, కొకైన్‌, హెరాయిన్‌లు. వీటికి అలవాటు పడిన పిల్లల ఆలోచనలన్నీ వాటి చుట్టూరా తిరుగుతూ ఉంటాయి. దాంతో వాళ్లకంటూ ఓ ప్రపంచం ఏర్పరుచుకుంటారు. తమకు తాముగా డ్రగ్స్‌కు అలవాటు పడ్డట్టు ఎవరితో చెప్పకపోయినా, కొన్ని లక్షణాల ఆధారంగా వారిని గుర్తుపట్టొచ్చు. అవేంటంటే...
ఒంటరిగా తమ గదిలోనే ఎక్కువ సమయాలు గడపటం
నవ్వుతూ, తుళ్లుతూ ఉండే కుర్రాడు ఉన్నట్టుండి ముభావంగా మారటం.
దిగులుగా, విచారంగా కనిపించటం
కళ్లలోకి నేరుగా చూసి మాట్లాడలేకపోవటం
శరీరం శుష్కించటం, ముందుకు వంగి ఉండటం
కళ్ల కింద నల్లని వలయాలు
బలహీనంగా ఉండటం
తగినంత ఆహారం తీసుకోకపోవటం
కుటుంబసభ్యులతో కలవకపోవటం
కుటుంబసభ్యులను ఎక్కువ మొత్తాల్లో డబ్బులు అడుగుతూ ఉండటం
ఇంట్లోనే డబ్బులు దొంగిలించటం
ఏదో చెప్పాలనే ప్రయత్నం చేయబోయి, విరమించుకోవటం
 
కుటుంబ సభ్యుల తోడ్పాటు
పిల్లలు డ్రగ్స్‌కి బానిసలయ్యారని తెలిసిన వెంటనే తల్లితండ్రులు చేసే మొదటి పని - ఒకర్నొకరు నిందించుకోవటం! రెండోపని...పిల్లల మీద విరుచుకుపడటం! కానీ ఈ రెండూ కరెక్టు కాదు. డ్రగ్‌ అడిక్షన్‌ను క్షమించరాని నేరంగా పరిగణించటం మాని అందుకు దారితీసిన పరిస్థితుల మీదకు దృష్టి మరల్చి, వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. చికిత్స ఇప్పిస్తూనే పిల్లలకు తోడుగా ఉంటూ వారి ఆత్మ స్థయిర్యాన్ని పెంచాలి. నిందించటం, కొట్టడం, ఇంట్లోనే బందీ చేయటం, పరువుకు భయపడి పిల్లలకు వైద్య చికిత్స ఇప్పించకపోవటం సరికాదు. డ్రగ్స్‌కు అడిక్ట్‌ అయిన పిల్లలతో తల్లితండ్రుల వ్యవహార శైలి ఇలా ఉండాలి.
ప్రేమగా మాట్లాడాలి.
నీకు నేనున్నాననే భరోసా కల్పించాలి.
మెరుగైన భవిష్యత్తు గురించి చర్చించాలి.
ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
పిల్లలందరి మధ్య సఖ్యత నెలకొనేలా చూడాలి.
కుటుంబమంతా బాధితుడి పక్షాన పోరాడుతున్న భావన కలిగించాలి.
‘అయ్యో! ఇలా జరిగిందే!’ అని ఏడ్వటం, బాధపడటం చేయకూడదు.
ఆత్మ విశ్వాసాన్ని కల్పించాలి. మానసిక స్థయిర్యాన్ని నూరిపోయాలి.
 
డ్రగ్స్‌కు బానిసలు కాకుండా ఉండాలంటే?
మానసిక పరిపక్వత, పరిస్థితులను విశ్లేషించే శక్తి తక్కువగా ఉండే, దుందుడుకు స్వభావం కలిగిన పిల్లలే ఎక్కువగా డ్రగ్స్‌కు బానిసలవుతూ ఉంటారు. ఇంట్లో కుటుంబ సభ్యులు తగినంత గుర్తింపునివ్వకపోవటం, తగినంత స్వేచ్ఛ లభించకపోవటంలాంటి కొన్ని కారణాల వల్ల స్నేహితుల్లో గొప్పగా గుర్తింపు పొందాలనే తాపత్రయంలో ఎక్కువ శాతం మంది పిల్లలు డ్రగ్స్‌ను వాడటం మొదలు పెడతారు. ఈ అలవాటుకు పిల్లలు ఆకర్షితులు అవకుండా ఉండాలంటే....
రోజులో కొంత సమయాన్ని పిల్లలతో గడపాలి.
వాళ్లు చెప్పే విషయం ఎంత అసందర్భమైనదైనా, అర్థం లేనిదైనా, అనాసక్తికరమైనదైనా శ్రద్ధగా వినాలి.
విసుక్కోవటం, తిట్టడం, కొట్టడం చేయకూడదు.
కించపరచటం, వేరొకరితో పోల్చటం, మానసికంగా కుంగదీయటం చేయకూడదు.
కుటుంబసభ్యులందరూ కలిసి రోజులో ఒక పూట అయినా కలిసి భోజనం చేయాలి.
పిల్లల ఒత్తిళ్లు, చీకాకులను అర్థం చేసుకోవాలి.
తల్లితండ్రులమనే అహంభావంతో వ్యవహరించకుండా పిల్లలతో స్నేహితులుగా మెలగాలి.
ఏ విషయాన్నీ దాచకుండా చెప్పగలిగే స్వేచ్ఛను పిల్లలకు ఇవ్వాలి.