చక్కెరతో మానసిక సమస్యలు!

28-07-2017:  చక్కెర ఎక్కువ తినేవాళ్లలో మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందట. తాజా పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. చక్కెర ఎక్కువ తింటే దంతాలకు మంచిది కాదని మనకు తెలుసు. అలాగే తీపి బాగా తినడం వల్ల నడుము చుట్టుకొలత పెరుగుతుంది. కానీ తీపి బాగా తినడం వల్ల మానసిక సమస్యలు సైతం చుట్టుముడతాయన్నది కొత్తగా వెల్లడైన సత్యం. యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ అధ్యయనకారులు చక్కెర బాగా తినే వారిని స్టడీ చేశారు. దాదాపు ఎనిమిది వేలమందిని పరిశీలించారు. దీర్ఘకాలంలో వీరిలో మూడ్స్‌కు సంబంధించిన మార్పులు తలెత్తుతాయని గుర్తించారు. వీరిని 1985 నుంచి 1988 సంవత్సరం వరకూ పరిశీలించారు. ఆ తర్వాత మధ్య మధ్యలో కొన్ని ప్రశ్నాపత్రాలను వారితో పూర్తిచేయించారు. చక్కెర ఎక్కువ తీసుకోవడానికి, యాంగ్జయిటీ, డిప్రషన్‌ వంటి సాధారణ మానసిక సమస్యలకు మధ్య ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేశారు. తీపి పదార్థాలు, డ్రింకులు ఎక్కువగా తీసుకునేవాళ్లకి ఐదు సంవత్సరాల తర్వాత మానసిక సమస్యలు తలెత్తుతాయని తేలింది. తక్కువ తీపి పదార్థాలు తినే వాళ్లు మానసికంగా ఆరోగ్యంగా ఉండడాన్ని కూడా శాస్త్రవేత్తలు స్టడీలో గమనించారు. అయితే ఇందులో శాస్త్రవేత్తలు ఆల్కహాల్‌ ద్వారా వెళ్లే సుగర్‌ని పరిగణనలోకి తీసుకోలేదు. అయితే తీపి ఎక్కువ తినడం వల్ల మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న డయటరీ ఎనాలిసి్‌సపై కొందరు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఫుడ్‌లోని చక్కెర సంగతి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఒకటి మాత్రం నిజం. తీపి పదార్థాలు తక్కువ తినడం వల్ల దంతాలు దెబ్బతినవు. బరువు పెరగరు. డిప్రషన్‌కు సంబంధించి చక్కెర నిర్వహించే పాత్ర శాస్త్రీయంగా నిర్థారణ కావాల్సి ఉంది.