ఒత్తిడి నుంచి దూరంగా!

09-08-2017: వెకేషన్‌కు ఎందుకు వెళ్లాలనుకుంటాం..? కాస్తంత విశ్రాంతి, ప్రశాంతతలు దొరుకుతాయని... అంతేకాదు రోజువారీ ఒత్తిడుల నుంచి బయటపడొచ్చు.... అయితే వెకేషన్‌లో ఉన్నప్పుడు కొన్ని పద్ధతులను అనుసరించడం వలన మనసు, మెదడు మరింత ఎక్కువగా సాంత్వన పొందుతాయిట. అవేమిటంటారా? ఉదాహరణకు మెడిటేషన్‌ శరీరానికి ఎంతో మంచిది. అది మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా తట్టుకునే శక్తిని ఇస్తుంది.

 
అందులోనూ వర్కుకు దూరంగా సెలవల్లో ఉన్నప్పుడు మెడిటేషన్‌పై మరింత శ్రద్ధ పెట్టగలం. మనకు సాంత్వన నిచ్చే మెడిటేషన్‌ చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి. ఒకటి మైండ్‌ఫుల్‌ బ్రీదింగ్‌. ఇది ఎంతో సింపుల్‌. పైగా దీని ద్వారా పొందే ప్రయోజనాలు కూడా ఎక్కువే. నిత్యం పది నిమిషాలు బ్రీదింగ్‌ సాధన చేయాలి. ఇది చేసేటప్పుడు మీపై, మీ ఊపిరిపై పూర్తిగా దృష్టి పెట్టి ఏకాగ్రతతో చేయాలి. దీన్ని మీరుండే హోటల్‌ రూములో... బీచ్‌లో, కొండల మధ్య , పచ్చని ప్రకృతి నడుమ ఎక్కడైనా చేయొచ్చు. ఇది చేసేటప్పుడు ముక్కు ద్వారా గాలిని లోతుకంటా పీల్చుకుని వదలాలి. వెలుగుతున్న కొవ్వొత్తిని ఏకాగ్రంగా చూడడం మరో ప్రక్రియ. ఇలా చేయడం వల్ల పనిపై ఏకాగ్రంగా దృష్టి పెట్టగలరు. ఈ ప్రక్రియ చేసేటప్పుడు కాంతి తక్కువగా ఉన్న గదిలో కూర్చోవాలి. కొద్దిసేపైన తర్వాత కొవ్వొత్తిని వెలిగించి శ్వాసను లోతుకంటా పీలుస్తూ కాంతులు వెదజల్లుతున్న ఆ కొవ్వొత్తి వైపే ఏకాగ్రంగా చూడాలి.
 
కను రెప్పలు వాల్చకూడదు. మొదట కొద్ది సమయం అంటే ఐదు నిమిషాలతో ప్రారంభించి అరగంట వరకూ కళ్లార్పకుండా క్యాండిల్‌ని చూడొచ్చు. సాధన ద్వారా ఇది సాధ్యమవుతుంది. మూడవది యోగనిద్ర. అదే శవాసనం. దీని వల్ల కూడా మనసు, శరీరం బాగా రిలాక్సు అవుతాయి. ఇది చేసేటప్పుడు శరీరంలోని ప్రతి అంగంపైనా 15-20 సెకన్లపాటు దృష్టి కేంద్రీకరించాలి. ఇలా చేయడం వల్ల శరీరమంతా ఎంతో తేలిక అవడమే కాకుండా ఎంతో రిలాక్సింగా ఫీలవుతారు. ఆ రిలాక్సింగ్‌ స్థితి నుంచి మెల్లగా సాధారణ స్థితికి రావాలి. శవాసన స్థితిలో ఉన్నప్పుడు కొందరు నిద్రపోతారు. అది కూడా మంచిదే. అలా నిద్రపోవడం వల్ల శరీరానికి కావాల్సినంత విశ్రాంతి లభించి సాధారణ స్థితికి వచ్చినపుడు మరింత ఉత్సాహంగా ఉంటారు.