ఒత్తిడిని వదిలించుకోవడం

ఇక ‘వేళ్ళమీద’ విద్యే !

==========
21-7-2017: మారుతున్న కాలంతోపాటు మనిషి జీవనయానంలోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంటా బయట రకరకాల సమస్యలతో మనిషి ఒత్తిడికి లోనవుతున్నాడు. ఈ ఒత్తిడిని అదుపులో ఉంచుకుంటే అనేక రకాల సమస్యల నుంచి దూరం కావచ్చని ఎన్నో పరిశోధనలు నిరూపించాయి. అందులో  భాగంగా సంగీతం వినటం, ప్రకృతి విహారం, యోగా, ధ్యానంవంటివి చేస్తూంటారు చాలామంది. ఒత్తిడిని చిత్తు చేయటానికి చాలాకాలంగా మనం అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయ పద్ధతులివి. కానీ చిటికెలో ఒత్తిడిని చిటికెలో మాయం చేసే సరికొత్త స్ట్రెస్‌ యాంటీడోట్‌ మార్కెట్లోకొచ్చింది. . 

ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. అయితే వాటికోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలి. అలాంటి అవకాశం లేక, ఇటు ఒత్తిడిని దూరం చేసుకోలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కానీ ఆఫీసులో ఉన్నా, బస్సులో ప్రయాణిస్తున్నా వాటిని కొనసాగిస్తూ, బొంగరంలాంటి ఒక వస్తువుని తిప్పుతూ మన ఒత్తిడిని మనం దూరం చేసుకోవచ్చు.

ఫిడ్జెట్‌ స్పిన్నర్‌
రెండువేళ్ల మధ్య ఇమిడిపోయే ఓ చిన్న ఆటవస్తువులాంటిదే ఈ ‘ఫిడ్జెట్‌ స్పిన్నర్‌’.  దీన్ని ట్రై స్పిన్నర్‌ అని కూడా అంటారు.  మూడురెక్కలతో ఉండే ఈ పరికరం మధ్యలో బేస్‌ పట్టుకుని గిరగిరా తిప్పితే మనలో ఒత్తిడి దూరమవుతుంది. ఈవస్తువుకి ఇప్పుడు దేశవిదేశాల్లో బాగా డిమాండ్‌ ఉంది. పెద్ద పెద్ద సెలబ్రిటీల నుంచి సామాన్యుడి వరకు దీన్ని ఉపయోగిస్తున్నారు, ఒత్తిడిని దూరం చేసుకుంటున్నారు. అంటే ఒత్తిడిని పారద్రోలడం ఇక ‘వేళ్ళమీద’ విద్యేనన్నమాట.
ఇదీ దీని చరిత్ర
‘ఫిడ్జెట్‌ స్పిన్నర్‌’ వేళ్ల మధ్య ఇమిడిపోతుంది. మనం చేయాల్సిందల్లా దీన్ని బొటనవేలు, చూపుడువేలు మధ్య పట్టుకుని వేగంగా తిప్పుతూ ఈ గాడ్జెట్‌వైపు ఏకాగ్రతగా చూడటమే. గుండ్రంగా తిరిగే ఈ ఫిడ్జెట్‌ స్పిన్నర్‌ను చూస్తుంటే మనసులోని ఒత్తిడి మటుమాయమై, ఆహ్లాదకరమైన భావన కలుగుతోందని ప్రపంచవ్యాప్త యూజర్ల రివ్యూలు చెబుతున్నాయి. దీన్ని ఆపరేట్‌ చేసే విధానం, ప్రయోజనాలపై యూట్యూబ్‌లో లెక్కలేనన్ని వీడియోలు కూడా వచ్చాయి. ఇంత ప్రసిద్ది పొందిన ఈ ఫిడ్జెట్‌ స్పిన్నర్‌ను ఎప్పుడో కనుగొన్నప్పటికీ, ఈ మధ్యే ప్రచారంలోకి వచ్చింది. 
ఈ గాడ్జెట్‌ రూపకర్త కేథరిన్‌ హెట్టింజర్‌. 1993లోనే దీన్ని డిజైన్‌ చేశారు. దీని పేటెంట్‌ హక్కులు దాదాపు ఎనిమిది సంవత్సరాలపాటు ఆమె పేరిటే ఉన్నాయి. ఆ తర్వాత 400డాలర్ల రెన్యువల్‌ ఫీజు కట్టే స్థోమత ఆమెకు లేకపోవడంతో 2006 నుంచి ఆమె దానిపై హక్కులు వదిలేసుకుంది. పేటెంట్‌ హక్కులు ముగిసిన తర్వాత ఇది మార్కెట్లో హిట్‌ అయింది. 
ఫిడ్జెట్‌ స్పిన్నర్‌ రూపకల్పన వెనక బలమైన కారణమే ఉంది. కేథరిన్‌ హెట్టింజర్‌ ఒకసారి తన చెల్లెల్ని చూసేందుకు ఇజ్రాయిల్‌ వెళ్ళింది. అక్కడ పోలీసు అధికారులు, సాధారణ ప్రజలపై కొంతమంది ఆకతాయి కుర్రవాళ్లు రాళ్లు రువ్వుతున్నారు. ఈ సంగతి స్థానికుల ద్వారా ఆమె తెలుసుకుంది. అయితే వాళ్ళ ప్రవర్తనకు కారణాలేమిటో ఆమె గుర్తించింది. వారిలో కలుగుతున్న ఒత్తిడే ఈ రకంగా ప్రవర్తించడానికి మూలం అని తెలుసుకుంది. అందుకోసం ఆ కుర్రాళ్లలో ఉన్న ఒత్తిడిని చిత్తు చేయడానికి ఓ పరికరం తయారు చేసింది. అదే ఫిడ్జెట్‌ స్పిన్నర్‌. దానిని వేళ్ళమధ్య పెట్టి గిర గిర తిప్పినప్పుడు వాళ్లలో మార్పు కనిపించింది. వాళ్ళ ధ్యాస దానిపైకే మళ్ళింది. అలా తయారుచేసిన ఆ పరికరం ఆదరణకు నోచుకోలేదు కానీ ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. 
మైండ్‌ రిలాక్స్‌
ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్న వారు ఈ ఫిడ్జెట్‌ స్పిన్నర్‌ గిరగిర తిరిగేటప్పుడు దానివైపే చూస్తే ఉపశమనం లభిస్తుంది. చాలామంది అనుభవపూర్వకంగా ఇదే చెబుతున్నారు. అయితే పరిశోధనాత్మకంగా దీన్ని వెల్లడించలేదు. మనలో చాలామంది ఎప్పుడైనా ఒత్తిడిలో ఉన్నప్పుడు వేళ్ళను జట్టులో జొనిపి రుద్దుకోవడమో లేక పెన్ను చేత్తో పట్టుకుని తిప్పుతుండడమో చేస్తుంటారు. దానివల్ల ఒత్తిడి దూరమవుతుంది. ఫిడ్జెట్‌ స్పిన్నర్‌ కూడా అలాంటిదే. 
ఆ వస్తువుని వేళ్ళమధ్య పెట్టి గట్టిగా తిప్పుతూ దానివైపే చూస్తాం కాబట్టి మన మనస్సు కాసేపు సమస్య నుంచి డైవర్ట్ అవుతుంది. ఈ కొద్దిపాటి సమయంలోనే మైండ్‌ రిలాక్స్‌ అవుతుంది. ఇలా కాస్త సమయమైనా ఆలోచనాదృష్టి మరలుతుంది కాబట్టి ఒత్తిడి మాయమవుతుంది. 
బ్యాన్‌  చేశారు  కూడా!
ఒత్తిడిని దూరం చేసే వస్తువును బ్యాన్‌ చేయడం దేనికి? అనుకుంటున్నారా. కొన్ని దేశాల్ పాఠశాలల్లో ఫిడ్జెట్‌ స్పిన్నర్‌ను నిషేధించారు. అక్కడి విద్యార్థులు దీనితో ఆడుతూ చదువును నిర్లక్ష్యం చేస్తున్నారనేది అక్కడి వారి వాదన. పిల్లల్ని ఇదొక ఆటవస్తువులా ఆకర్షిస్తోంది. 
 
బన్ని చేతిలో ఆ వస్తువు ఏంటంటే ?
‘అ..ఆ’ సినిమాలో అనసూయగా నటించిన సమంత చేతిలో బాల్‌ పట్టుకుని ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ప్రయత్నించింది గుర్తుందా? ఇప్పుడా బాల్‌ ఆట కూడా ముగిసిపోయినట్లుంది. .అల్లు అర్జున్ తాజా చిత్రం ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బన్ని చేతిలో ఈ వస్తువు కనిపించింది. ఆడియో వేడుకలో ఆయన ఈ వస్తువుతో ఆడుకుంటూ కనిపించారు. ‘సీటీమార్‌.....’ పాట ట్రైలర్‌లోనూ, బన్ని పాల్గొన్న యూట్యూబ్‌ లైవ్‌లోనూ ఆయన అదే వస్తువుతో ఆడుకుంటూ కనిపించారు. ఆ సినిమా షూటింగ్‌ సెట్స్‌లో కూడా బన్ని చేతిలో ఉన్న ఈ వస్తువు అందరినీ ఆకర్షించింది. టెన్షన్‌ను పోగొట్టుకోవడానికే బన్ని ఆ వస్తువును ఉపయోగించాడు. దానిపేరే ఫిడ్జెట్‌ స్పిన్నర్‌. నిన్న మొన్నటి దాకా విదేశాల్లో హల్‌ చల్‌ చేసిన ఈ వస్తువు ఇప్పుడు మన దగ్గర కూడా ఫేమస్‌ అయిపోయింది. 
 
=====
కేవలం అది మాత్రమే కాదు!
కేవలం ఫిడ్జెట్‌ స్పిన్నర్‌ మాత్రమే కాదు. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి అనేక రకాల వస్తువులు మార్కెట్లో ఇంకా చాలానే ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి!
డ్రీమ్‌ ఇన్ హెడ్ 
అలిసిన శరీరానికి మసాజ్‌ మంచి పరిష్కారమైతే అలసిన మెదడుకు మంచి పరిష్కారమే ఈ డ్రీమ్‌ ఇన్‌ హెడ్‌. మన మెదడు అలసిపోతే, ఏమీ ఆలోచించకుండా కాసేపు ప్రశాంతంగా నిద్రపోతాం. లేదంటే నచ్చిన సంగీతం వింటూ మెదడుకు విశ్రాంతినిస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో ఇలాంటివాటికి అవకాశం ఉండకపోవచ్చు. మరి అలాంటి సందర్భాల్లో మైండ్‌ రిలాక్సయి, ఒత్తిడి దూరం కావాలంటే ఎలా? అందుకోసమే ఈ డ్రీమ్‌ ఇన్‌ హెడ్‌.  32 బటన్స్ అమర్చిన ఈ పరికరం టోపీలా తలకు ధరించాలి. మెత్తటి బాల్స్‌లా ఉండే ఆ బటన్స్ మన పుర్రెభాగాన్ని సున్నితంగా మర్దన చేస్తాయి. ఈ పరికరం పై భాగాన ఉండే రోలర్‌తో గుండ్రంగా తిప్పుతూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా రక్తప్రసరణ మెరుగుపడి మెదడు పనితీరు వేగం పుంజుకుంటుంది. ఫలితంగా ఒత్తిడి మటుమాయమవుతుంది. 
షోల్డర్ మస్సాజర్  
ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి అలసిపోయేవారికి ఆ పనితాలూకు ఒత్తిడి భుజాలపైనా, మెడపైనా ప్రభావం చూపిస్తుంది. ఆ ఒత్తిడి తాలూకు నొప్పులు తగ్గడానికి మెడ మీద, భుజాల మీద సున్నితంగా మసాజ్ చేయించుకుని చూడండి. ఎంత రిలీఫ్ ఫీలవుతారో. కానీ అన్ని సమయాల్లో మసాజ్ చేయించుకోవడం కుదరదు కదా! అలాంటి సందర్భాల్లో ఉపయోగపడేదే ఈ పరికరం. జిక్రాపల్స్ అని పిలిచే బెల్ట్‌ లాంటి ఈ పరికరాన్ని భుజాలు, మెడ మీదుగా ధరిస్తే చాలు. మృదువుగా మసాజ్ చేసి హాయికి అర్థమేంటో అనుభవించేలా చేస్తుంది. ఇందులో ఉండే సెన్సార్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇంట్లో, ఆఫీసులో, డ్రైవింగ్‌ సమయంలో ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ వైర్‌లెస్ పరికరాన్ని వేసుకోవచ్చు. 
థెరపిటిక్  మ్యాట్
ఈరోజుల్లో స్కూటర్లు, కార్లు లేని వారు చాలా తక్కువ. ఎక్కడికెళ్లాలన్నా వాహనం తప్పనిసరి. నడిచి వెళ్లే వారు చాలా తక్కువ మంది. చివరకి దగ్గర్లోని దుకాణానికి కూడా టూ వీలర్‌మీదే వెళ్ళొస్తారు. ఒకవేళ నడిచి వెళ్ళినా తప్పనిసరిగా చెప్పులు ధరిస్తారు. కానీ చెప్పులు లేకుండా నడవడంవల్ల కాలికి రక్తప్రసరణ మెరుగుపడుతుందని, పాదాల ఒత్తిడి దూరమవుతుందని మీకు తెలుసా? ఈసారి మీరు పార్క్‌కు వెళ్లినప్పుడు చెప్పులు లేకుండా గడ్డిలో నడిచి చూడండి మీకే తెలుస్తుంది. పార్క్‌ వెళ్లే అవకాశం లేకుంటే ఎలా అనుకుంటున్నారా అందుకోసమే ఈ థెరపిటిక్‌ మ్యాట్‌. పచ్చిగడ్డి మీద నిలబడితే కాళ్లకు ఎలా గుచ్చుకుంటుందో ఈ మ్యాట్ కూడా అలాగే గుచ్చుకుంటుంది. దీని మీద నిలబడడం వల్ల పాదాలకింద చర్మం ఉత్తేజితమై ఒత్తిడి తగ్గిపోతుంది. ఉద్యోగుల ఒత్తిడి తగ్గించడానికి ఇప్పుడిప్పుడే అనేక కార్పొరేట్ ఆఫీసుల్లో ఈ థెరపిటిక్‌ మ్యాట్స్‌ ఉపయోగిస్తున్నారు. 
యు డివైన్ 
రోజంతా కష్టపడి బస్సులమీద, వెహికిల్స్‌మీద ప్రయాణం చేసి అలసిపోయిన శరీరానికి ఒక్కసారి ఇంటికి రాగానే అలా కుర్చీలో హాయిగా సాగిలపడి కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. కూర్చునేది ఒక పదినిమిషాలైనా రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది. ఆ సమయంలో ఎవరైనా మనకు మసాజ్‌ చేస్తే ఇంకెలా ఉంటుంది? ‘ఆహహహ...’ అనుకుంటున్నారా అయితే ఈ యు డివైన్ కుర్చీ మీకోసమే. ఒక యాప్ ఆధారంగా ఈ మెత్తటికుర్చీ పనిచేస్తుంది. ఇందులో కూర్చొని శరీరంలో మనకు ఏ భాగంలో మసాజ్ కావాలంటే ఆ పార్ట్‌ని యాప్‌లో సెలక్ట్ చేసుకుంటే చాలు, త్రీడీ టెక్నాలజీతో శరీరాన్ని స్కాన్ చేసి మసాజ్ చేస్తుంది. శరీరం మొత్తానికి మసాజ్ కావాలంటే ఫుల్‌బాడీ బటన్ యాక్టివ్ చేస్తే చాలు. అలసట, ఒత్తిడి చిటికెలో మాయమవుతాయి. నిమిషాల వ్యవధిలోనే నూతన ఉత్సాహంతో మళ్ళీ మన రెడీ అయిపోతాం. 
సోనా బ్రాస్‌లెట్  
బ్రాస్‌లైట్‌ చాలామంది నిత్యం చేతికి ధరిస్తుంటారు. అలాంటిదే ఇది కూడా. చేతికి బ్రాస్‌లైట్‌లా ధరించే ఈ స్మార్ట్‌ గ్యాడ్జెట్‌ చూడడానికి అందంగా కనిపించడమే కాదు, మన ఒత్తిడిని కూడా అంతే స్మార్ట్‌గా తొలగించేస్తుంది. హార్ట్‌రేట్ మానిటరింగ్ టెక్నాలజీతో తయారుచేసిన ఈ బ్రాస్‌లెట్ ఒక యాప్ ఆధారంగా పనిచేస్తుంది. దీన్ని చేతికి ధరించి యాప్‌తో కనెక్ట్ చేసుకోవాలి. అది మీ హృదయస్పందనలు, మూడ్స్‌ పరిశీలిస్తూ, మనలోని ఒత్తిడి లెవెల్స్‌ను పసిగడుతుంది. ఒత్తిడిని తగ్గించే మెడిటేషన్‌లాగే, మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు శ్వాస తీసుకుని, వదలాలో చెప్తూ అలర్ట్ చేస్తుంది. ఒత్తిడికి కారణమయ్యే అలవాట్లను తగ్గించుకోమ్మని కూడా సలహాలిస్తుంది ఈ పరికరం.