నలుగురితో కలవలేకపోతున్నా..

31-07-2018:నా వయసు 23 ఏళ్లు. మధ్య తరగతి కుటుంబం. డిగ్రీ చేశాను. పెళ్లి కాలేదు. నాకు నలుగురితో మాట్లాడాలన్నా, కలవాలన్నా భయం. ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతాను. బానే చదువుతా. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటా. ఒంటరిగా ఉంటున్నాననే భావనతో మనసంతా తెలియని ఒత్తిడి. ఓపెన్‌గా, ఫ్రీగా మాట్లాడలేను. నన్ను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అమ్మానాన్నలు అయోమయంలో ఉన్నారు. నా భవిష్యత్తు నాకే అర్థం కావడం లేదు. కానీ, నా కుటుంబం మాత్రం నా పైనే ఆధారపడి ఉంది. దీని నుంచి ఎలా బయటపడాలో చెప్పండి.
- శరత్‌, కడప
 
మీకున్నది అరుదైన సమస్యేమీ కాదు. వ్యక్తిత్వ పరమైన సమస్య. ఇది 2 రకాలు. ఒకటి ‘యాంక్షియస్‌ అవాయిడెంట్‌ పర్సనాలిటీ డిజార్డర్‌’కి సంబంధించినది. కొందరిలో ఇది సహజసిద్ధంగా, బాల్యం నుంచే ఉంటుంది. కొందరిలో పెంపకంలోని కొన్ని లోపాల వల్ల ఏర్పడు తుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ముఖ్యంగా తల్లి దండ్రులు తరుచూ ఘర్షణ పడటం చూసి కూడా ఇలాంటి స్వభావం ఏర్పడుతుంది. ఇది కొందరిలో ఘర్షణ తత్వాన్ని పెంచితే, మరికొందరిని లోలోపలికి ముడుచుకు పోయేలా చేస్తాయి. ఇలాంటి వాళ్లలో ఒక పక్క అందరి తోనూ కలిసిపోవాలనీ, మాట్లాడాలనీ ఉంటుంది. అయితే, మరో పక్క మాట్లాడితే ఏమనుకుంటారో, ఎగతాళి చేస్తారే మోనన్న భయం ఉంటుంది.
 
ఈ కారణంగానే ఎవరితోనూ కలవలేరు. అయితే ఇతరులతో కలవడానికి జంకే మీ బాహ్య వ్యక్తిత్వం వెనుక, అందరితోనూ కలిసిపోగల సమర్థవంతమైన అంతర వ్యక్తిత్వం కూడా ఉంటుంది. దాన్ని వెలికి తీస్తే అందరితోనూ హాయిగా కలిసిపోగలు గుతారు. అందుకు బిహేవియర్‌, కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీలు అవసరం. వీటితో పాటు కొన్ని మందులు కూడా వాడితే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ తరహా ప్రవర్తనకు ‘సోషియల్‌ యాంగ్జయిటీ డిజార్డర్‌’ కూడా కారణం కావచ్చు. బాహ్య సమాజంలో ఎదురైన చేదు అనుభవాలు, పరాజయాలు ఇందుకు కారణమవుతాయి. కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ తీసుకుంటూ, కొన్ని మందులు కూడా వాడితే ఈ సమస్య నుంచి ఆరు మాసాల్లోనే పూర్తిగా నార్మల్‌ అయిపోతారు. మీరు వెంటనే ఒక సైకియాట్రిస్ట్‌ను సంప్రదించండి.
డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ చింతపంటి
కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌, ట్రాంక్విల్‌ మైండ్స్‌ క్లినిక్‌,
మాదాపూర్‌, హైదరాబాద్‌