అశుభకార్యాల పట్ల ఆసక్తి ఎందుకు?

11-09-2017:మా అబ్బాయికి 11 ఏళ్లు. 6 వ తరగతి చదువుతున్నాడు. సాధారణంగా పిల్లలు శుభకార్యాల పట్ల ఆసక్తి చూపుతారు. అశుభ కార్యాలకు దూరంగా ఉంటారు. అయితే, మా వాడికి శుభకార్యాలంటే ఇష్టమే కానీ, అశుభ కార్యాల పట్ల కూడా అంతే ఆసక్తి చూపుతాడు. బంధువులు ఎవరైనా చనిపోయినప్పుడు నేనూ వస్తానంటాడు. వాడు వెంట ఉన్నాడు కదా అని, పార్థివ దేహాన్ని చూసి వెనక్కి వచ్చేద్దామనకుంటే శ్మశానం దాకా వెళదామంటాడు. అక్కడికి వెళ్లేదాకా మారాం చేస్తాడు. చూడబోతే ఇదేదో తేడా అనిపిస్తోంది. ఈ ధోర ణిని ఎలా అర్థం చేసుకోమంటారు?                                                                                                                                                                          - ఎన్‌. అర్జున్‌ రావు, మంచిర్యాల

కొంత మంది పిల్లల్లో బాల్యం నుంచే అన్నింటి పట్లా సమదృష్టి ఉంటుంది. ‘‘చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్‌’’ అన్నట్లు వాళ్లు శుభకార్యాల్నీ అశుభ కార్యక్రమాల్నీ ఒకేలా చూస్తారు. ఇప్పటికి ఇలా చూడటానికే పరిమితమయ్యే ఇలాంటి పిల్లలకు మునుముందు ఈ విషయాల లోలోతుల్లోకి వెళ్లే తత్వం కూడా అబ్బుతుంది. ఇలాంటి పిల్లలకు అతి చిన్న వయసులోనే జీవితపు అన్ని పార్శ్వాల పట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది. ఇది ఆందోళన చెందాల్సిన విషయం ఏమీ లేదు. ఇలాంటి వాళ్లు మునుముందు, కవులుగా, రచయితలుగా, తాత్వికులుగా లేదా చిత్రకారుడిగా, శిల్పకారుడిగా స్థిరపడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే జీవితపు అన్ని దశల్నీ, అన్ని కోణాల్నీ అత్యంత నిశితంగా గమనించడం వీరికి ఒక హాబీగా ఉంటుంది.
 
వాటిని తమదైన సృజనాత్మక రూపంలో పొదగాలని ఉంటుంది. ఇదేమీ నష్టదాయకం కాదు కదా! కాకపోతే వీరిలో అందరిలా ఒక మూసలో పయనించే ధోర ణి ఉండదు. అందరూ కోరుకునే కెరీర్‌ను వీళ్లు ఇష్టపడరు. ప్రతి విషయాన్నీ, కళ్ల ముందు జరిగే ప్రతి సంఘటననూ, లోతుగా మరీ లోతుగా ఆలోచించే స్వభావం వీరికి ఉంటుంది. ఇలాంటి వారు జీవితంలో ఒక విలక్షణమైన వ్యక్తులుగా నిలబడతారు. అందరు తలిదండ్రులు కోరుకున్నట్లు, వీరు బాగా డబ్బు సంపాదించలేకపోవచ్చు. కానీ, గొప్ప కీర్తి ప్రతిష్టలు వీరి సొంతమవుతాయి. అందువల్ల మీ అబ్బాయి ధోరణికి మీరు సంతోషించాలేగానీ, ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు.
 
                                                                                                                                                                            - డాక్టర్‌ సి. కళ్యాణ్‌ , కన్సల్టెంట్‌ సైకాలజిస్ట్‌