‘ఒంటరి’లో మహిళలే ఎక్కువ!

భర్తను కోల్పోయిన మహిళలు 57 శాతం

భార్యను కోల్పోయిన మగవారు 11 శాతం
60 ఏళ్లు దాటిన ఒంటరి వారిపై సర్వే

హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఒంటరిగా జీవిస్తున్న వారిలో మగవారి కన్నా మహిళలే చాలా ఎక్కువగా ఉన్నారు. సమాజంలో 60 ఏళ్లు దాటిన ఒంటరి మహిళల శాతం 57 ఉండగా, మగవారిలో మాత్రం 11 శాతం మాత్రమే ఒంటరి వారున్నారు. అంటే భార్యాభర్తల్లో ముందుగా చనిపోతున్న వారి సంఖ్యలో మగవారే ఎక్కువగా ఉండడం కనిపిస్తోంది. దీనికి కారణం వివాహ సమయంలో ఇద్ధరి మధ్య వయసు బేధం కూడా ఒకటని నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ సామాజిక, ఆర్థిక ముఖ చిత్రంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
 
మరికొన్ని వివరాలు
 2001 జనాభా గణనతో పోలిస్తే.. 60 ఏళ్లు పైబడిన వారి జనాభా 2011 గణన ప్రకారం దేశంలో, రాష్ట్రంలో 7.4 శాతం నుంచి 9.3 శాతానికి పెరిగింది.
 2011 జనాభా గణన ప్రకారం 18 ఏళ్లలోపు వివాహం చేసుకుంటున్న మహిళలు దేశంలో 3.7 శాతం ఉండగా తెలంగాణలో 2.6 శాతం ఉన్నారు.
 20 నుంచి 29 ఏళ్ల వయసు మధ్య గల వారిలో పురుషుల్లో 49 శాతం మంది వివాహితులు కాగా.. మహిళలు 79 శాతంగా ఉన్నారు.