ప్రేమ.. కోపం..అతిగా వద్దు!

23-07-2017: పిల్లల్ని పెంచటం తీగ మీద నడకతో సమానం. వాళ్లకు ప్రేమను అందించాలి. అవసరమైతే అంతే కఠినంగా వ్యవహరించాలి. ప్రేమ అవధులు దాటినా వ్యర్థమే! పరిమితి తగ్గినా అనర్ధమే! ప్రేమ విషయంలో అతివృష్టి, అనావృష్టి... రెండూ పిల్లల మీద ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. కాబట్టి అమ్మానాన్నలు ఆ రెండింటిని బ్యాలెన్స్‌ చేసే చాకచక్యం అలవరుచుకోవాలి అంటున్నారు మానసిక నిపుణులు.

 
పిల్లలు ఎంత ఎదిగినా తల్లితండ్రులకు ఎప్పటికీ పిల్లలే! వాళ్లను అపరిమితంగా ప్రేమిస్తాం. ఆ ప్రేమలో భాగంగా ఆంక్షలు పెడతాం, జాగ్రత్తలు చెబుతాం. హద్దులు విధిస్తాం. అయితే అవధులు లేని ఆ ప్రేమే వాళ్లని ఊపిరాడనివ్వకుండా చేయొచ్చు. కొన్ని కుటుంబాల్లో పరిస్థితులు ఇందుకు భిన్నంగా కూడా ఉండొచ్చు. పిల్లలకు తల్లితండ్రుల నుంచి ఆశించినంత ప్రేమ దొరకకపోవచ్చు. ఒంటరితనం, భద్రతారాహిత్యం, ప్రేమ రాహిత్యంతో పిల్లలు కుంగిపోతూ ఉండొచ్చు. ఇలాంటి భిన్నమైన పరిస్థితులను పిల్లల లేత హృదయాలు తట్టుకోలేవు. మరీ ముఖ్యంగా సున్నిత మనస్కులై ఉండే 13 నుంచి 16 ఏళ్లలోపు పిల్లలు ఈ పరిస్థితులను ఎదుర్కొనే మనోధైర్యం లేక, తట్టుకునే శక్తి లేక దూరంగా పారిపోవాలనుకుంటారు. అంతకంటే మెరుగైన ప్రపంచంలోకి పరిగెత్తాలని తాపత్రయపడతారు. ఆ ప్రయత్నంలో భాగంగానే తల్లితండ్రులకు చెప్పకుండా ఇంటి నుంచి మాయమవుతారు.
 
ఇంట్లో నుంచి వెళ్లిపోతే?
తల్లిదండ్రుల మీద పిల్లలు అలగటం అనేది పెరిగే క్రమంలో ఓ భాగం. అన్ని కుటుంబాల్లోనూ ఎప్పుడో ఒకప్పుడు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే అమ్మానాన్నలు మాలిమి చేయగానే తిరిగి మామూలైపోతూ ఉంటారు. అయితే కొందరు దుందుడుకు పిల్లలు, సున్నిత మనస్కులైన పిల్లలు పరిస్థితులకు అడ్జస్ట్‌ కాలేరు. ఇలాంటివాళ్లు స్నేహితుల, ఇతరుల చెప్పుడు మాటలకు తేలికగా ప్రభావితమవుతారు. ‘రెండు రోజులు కనిపించకుండా పోతే వాళ్లే దెబ్బకి దారికొస్తారు. ఇక నీ ఇష్టానికి అడ్డు చెప్పరు’ అంటూ తోటి పిల్లలు ప్రోత్సహిస్తారు. ఆ మాటలు పిల్లల మనసుల్లో బలంగా నాటుకుపోతాయి. అమ్మానాన్నలను విడిచి వెళ్లాలనే ఆలోచన ఉన్నా అప్పటిదాకా లేని, రాని ధైర్యం ఆ మాటలతో వచ్చేస్తుంది. దాంతో ఇంటి నుంచి వెళ్లిపోతారు. ఇలా వెళ్లిన పిల్లలకు మొదట్లో బయటి ప్రపంచం కొత్తగా వింతగా కనిపించినా రోజులు గడిచేకొద్దీ ఇంటి బెంగ మొదలవుతుంది.
 
దాంతో గత్యంతరం లేక ఇంటి దారి పడతారు. ఇంకొందరు పిల్లలు అమ్మానాన్నల తిట్లకు భయపడి గమ్యం లేకుండా ప్రయాణిస్తారు. ఆ క్రమంలో ఊహించని విపరీత దుఃస్థితుల్లో చిక్కుకుని బంగారు భవిష్యత్తుని నాశనం చేసేసుకుంటారు. ఇంకొందరు పిల్లలు బయటి ప్రపంచం మాయలో పడిపోతారు. మరింత అడ్వంచర్‌సగా అనిపించి వెనక్కి తిరిగి రాలేనంత ముందుకు వెళ్లిపోతారు. అలా చివరికి ఎప్పటికీ తిరిగి ఇంటికి చేరుకోలేని పరిస్థితుల్లో మిగిలిపోతారు.
 
పిల్లలు ఇంట్లో నుంచి పారిపోవటానికి అమ్మానాన్నల అపరిమిత, పరిమిత ప్రేమలే కారణం కాదు. స్కూళ్లలో తోటి పిల్లల టీజింగ్‌, లైంగిక వేధింపులు, చదువు, టీచర్లంటే భయం, బెట్టింగుల్లో అప్పులపాలవటం, సీనియర్ల బెదిరింపులు....ఈ కారణాల వల్ల కూడా పిల్లలు ఎంతో ఒత్తిడికి లోనవుతారు. ఇలాంటి విషయాలన్నీ పెద్దలకు ఎంతో చిన్నవిగా తోచవచ్చు. కానీ పిల్లలకు అవి ప్రాణాంతక సమస్యలే! తమ బాధల్ని అమ్మానాన్నలతో పంచుకునే స్వతంత్రం లేని పిల్లలు అయోమయంలో పడిపోతారు. దారులన్నీ మూసుకుపోయి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారినప్పుడు ఆ పరిస్థితుల నుంచి పారిపోవటం ఒక్కటే పరిష్కారంగా కనిపిస్తుంది. కానీ ఎక్కువ శాతం పిల్లలు అమ్మానాన్నలను బెదిరించటం కోసమే ఇంట్లో నుంచి పారిపోతూ ఉంటారు. ఆ ప్రయత్నం ఒక్కోసారి బెడిసికొట్టి, దారి తప్పిపోయి, ఎప్పటికీ తిరిగి ఇంటికి చేరుకోలేని దుఃస్థితుల్లోనూ పిల్లలు చిక్కుకుపోవచ్చు.
 
సినిమా, టీవీ ప్రభావం ఎక్కువే!
పిల్లల మనసు స్పాంజి లాంటిది. కంటికి కనిపించిన ప్రతి అంశాన్నీ మనసు ఇంకించుకుంటుంది. కొందరు పిల్లలు సినిమాలు, ఇంటర్నెట్‌లో కనిపించే వాటిని గుడ్డిగా అనుసరిస్తారు, అనుకరిస్తారు. తమ మానసిక పరిధికి మించి ఊహించుకుంటారు. తమను తాము ఎక్కువగా అంచనా వేసుకుంటారు. అందర్లో ప్రత్యేక గుర్తింపు పొందటం కోసం ఏం చేయొచ్చో ఆలోచిస్తూ ఉంటారు. సినిమాల్లో హీరోయిన్‌గా మారాలని కొందరు, హీరోలయిపోవాలని మరికొందరు ఇంట్లో చేతికి దొరికిన కొద్ది డబ్బుతో ముంబయి రైలెక్కేస్తూ ఉంటారు. ఆ ఆలోచనను అమ్మానాన్నలు మెచ్చరని తెలుసు కాబట్టే పక్కా ప్రణాళికతో ఇంట్లో ఎవరికీ అనుమానం రాని విధంగా నమ్మకంగా నడుచుకుంటూ హఠాత్తుగా మాయమవుతారు.
 
పిల్లల్లో కనిపెట్టాల్సిన అసహజ లక్షణాలు
ముభావంగా ఉండటం, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం, అమ్మానాన్నలతో ఏదో చెప్పబోయి మళ్లీ మౌనంగా ఉండిపోవటం, సరిగా తినకపోవటం, నిద్రపోకపోవటం, అసాధారణ ప్రవర్తన... ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ ఉండే పిల్లాడు హఠాత్తుగా డల్‌గా మారిపోవటం... ఇలాంటి లక్షణాలన్నీ పిల్లల మనసుల్లో పేలే అగ్ని పర్వతాలకు సూచనలు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా పిల్లల్లో చిన్న మార్పు వచ్చినా అమ్మానాన్నలు తేలికగా కనిపెట్టగలరు. అయితే ఆ విషయానికి ప్రాధాన్యం ఇవ్వటం అశ్రద్ధ చేస్తే ఊహించని సంఘటనలు జరిగిపోతాయి. పిల్లలు కనిపించకుండా పోయిన తర్వాత ‘కొద్ది రోజులుగా ముభావంగా ఉంటున్నాడు, ఏం జరిగిందో అడుగుదామనుకున్నాను. ఈలోగానే ఇలా జరిగిపోయింది’ అంటూ బాధపడతారు.
 
టీచర్ల పాత్రా ప్రధానమే!
పిల్లలు రోజులో ఎక్కువ సమయం స్కూళ్లలోనే గడుపుతారు కాబట్టి పిల్లలో మార్పును టీచర్లూ కనిపెట్టగలుగుతారు. టీచర్లు ఆ మార్పును వెంటనే అమ్మానాన్నల దృష్టికి తీసుకురావటం లేదా పిల్లలతో వ్యక్తిగతంగా మాట్లాడి మనసులోని విషయాన్ని రాబట్టడం చేయాలి. అవసరమైతే అమ్మానాన్నల సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇవ్వాలి. తోటి విద్యార్ధులతో ఇబ్బందులుంటే మనసు విప్పి చెప్పగలిగే స్వతంత్రం ఇవ్వాలి. క్లాసులో అందరి ముందు అవమానించటం, చులకన చేయటం లాంటివి చేస్తే పిల్లల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. స్కూలు, టీచర్ల పట్ల అయిష్టం పెంచుకుంటారు. దాంతో బడికి వెళ్లటం ఇష్టం లేక, అమ్మానాన్నల మీద భయంతో ఇంట్లోనూ ఉండలేక ఇంటి నుంచి పారిపోవటానికి ప్రయత్నిస్తారు.
 
పిల్లలతో స్నేహం చేయాలి
పిల్లలు మనసు విప్పి అన్ని విషయాలు అమ్మానాన్నలతో పంచుకోవాలంటే వారితో స్నేహంగా మెలగాలి. రోజు మొత్తంలో కొంత సమయాన్ని పిల్లలకు కేటాయించాలి. వారి బడి, చదువు, స్నేహితులకు సంబంధించిన విషయాలను చర్చించాలి. అమ్మానాన్నలమనే అజమాయిషీ, అధికారం, దర్పం ప్రదర్శించకుండా పిల్లలతో సఖ్యంగా మెలగాలి. ఎప్పుడైతే స్నేహితులుగా ప్రవర్తిస్తారో అప్పుడు పిల్లలు ఏ విషయాన్నీ దాచకుండా నిర్భయంగా చెప్పగలుగుతారు. తమకొచ్చిన సమస్యను వ్యక్తం చేసి పరిష్కారం కోరతారు. అలాగే పిల్లల ప్రతి విషయానికీ అమ్మానాన్నలనే స్ఫూర్తిగా తీసుకుంటారు.
 
కాబట్టి పిల్లల ముందు భార్యాభర్తలు తరచుగా గొడవలు పడటం, కొట్టుకోవటం, దుర్భాషలాడుకోవటం చేయకూడదు. అలాగే తమ అసంతృప్తులు, భావోద్వేగాలకు పిల్లలను బలి చేయకూడదు. అనవసరంగా విసుక్కోవటం, తక్కువ చేసి మాట్లాడటం, తిట్టడం, కొట్టడం చేయకూడదు. ఎప్పుడైనా పిల్లలు ఎవరితో కలవకుండా, మూడీగా ఉండటం గమనిస్తే వెంటనే అందుకు కారణాన్ని ఆరా తీయాలి. సున్నితంగా అనునయిస్తూ మనసులోని విషయాన్ని బయటికి చెప్పించాలి. పిల్లలు చెప్పింది పెద్ద సమస్యే అయినా దానికి అంత ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం లేదనే ధోరణిలో మాట్లాడి పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి.
 
తరచుగా పిల్లలు చదివే స్కూలుకు వెళ్లి, టీచర్లతో మాట్లాడుతూ పిల్లల గురించి ఆరా తీస్తూ ఉండాలి. టీచర్లతో మంచి సఖ్యత ఏర్పరుచుకోవాలి. కొంతమంది అమ్మానాన్నలు పిల్లల్లో మార్పులను నెగిటివ్‌ కోణంలో చూస్తారు. వ్యతిరేకంగా స్పందిస్తారు. ‘నువ్వీ మధ్య చాలా మారిపోయావు. హోమ్‌వర్క్‌ సరిగా చేయట్లేదు, సరిగా తినట్లేదు, చెప్పిన మాట వినట్లేదు...అలా ఉంటున్నావు, ఇలా ఉంటున్నావు’ అంటూ తిట్ల దండకం అందుకుంటారేగానీ అసలు కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఇలాంటి ధోరణీ ప్రమాదమే!
 
కారణాలెన్నో!
పిల్లలు ఇంట్లో నుంచి వెళ్లిపోవటానికి ఎన్నో కారణాలుంటాయి. కొందరు అమ్మానాన్నలు ఎప్పుడూ పిల్లల ముందు గొడవలు పడుతూ ఉంటారు. ఆ కోపతాపాలను పిల్లల మీదా చూపిస్తూ ఉంటారు. ఇంకొన్ని కుటుంబాల్లో తండ్రులు మద్యానికి బానిసలై పిల్లల్ని పెద్దగా పట్టించుకోరు. మరికొన్ని కుటుంబాల్లో దంపతులిద్దరూ వారి వారి వృత్తుల్లో బిజీగా ఉండి పిల్లల సంరక్షణ ఆయాలకే వదిలేస్తూ ఉంటారు. దాంతో పిల్లలకు, అమ్మానాన్నలకు మధ్య దూరం పెరిగిపోతూ ఉంటుంది. అరుదుగా కొందరు పెద్దలు పిల్లలను చిన్న తప్పుకే కఠినంగా తిట్టడం, కొట్టడం చేస్తూ ఉంటారు. చదువులో పిల్లల పర్‌ఫార్మెన్స్‌ను తమ హోదాకు చిహ్నంగా ఎంచుతూ ఉంటారు. తక్కువ మార్కులొస్తే...‘నువ్వెందుకూ పనికి రావు. వేలకు వేలు పోసి నిన్ను చదివిస్తున్నాం! మా పరువు, డబ్బు అన్నీ వృథా!’ అంటూ తూటాల్లాంటి మాటలతో మనసుకు తూట్లు పొడుస్తారు.
 
మరికొన్ని కుటుంబాల్లో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా కూడా ఉంటాయి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకూ అమ్మానాన్నలు పిల్లలకు అతి జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. వాళ్లు ఏం తినాలో, ఎలాంటి దుస్తులేసుకోవాలో, ఎక్కడికి వెళ్లాలో, ఏం చదవాలో, ఎవరితో స్నేహం చేయాలో వాళ్లే నిర్ణయిస్తూ ఉంటారు. అమ్మానాన్నల ఈ రకమైన ప్రవర్తన పిల్లలను ఎంతో ఒత్తిడికి గురి చేస్తుంది. ఆ వాతావరణం నుంచి దూరంగా వెళ్లిపోవాలనే ఆలోచనలూ వస్తాయి. ఇలా అతి ప్రేమతో పిల్లలను ఇబ్బంది పెట్టినా, ప్రేమ చూపటంలో అశ్రద్ధ చేసినా పిల్లలు ఒంటరులవుతారు.
డాక్టర్‌ రమణ చెరుకూరి,
సీనియర్‌ సైకియాట్రిస్ట్‌,
ఆశా హాస్పిటల్‌, బంజారాహిల్స్‌,హైదరాబాద్‌.
 
 
పిల్లల్లో ‘పీర్‌ ప్రెజర్‌’
పిల్లల జీవితంలో ‘పీర్‌ ప్రెజర్‌’ ఓ భాగం. తోటి పిల్లల్ని చూసి వాళ్లలో ఉన్నదేమిటి? నాలో లేనిదేమిటి? అని పోల్చుకోవటం పిల్లల్లో ఎంతో సహజం. అలా తోటి పిల్లలతో తమను పోల్చుకోని పిల్లలంటూ ఉండరు. అయితే ఈ ఒత్తిడి స్థాయి మించితేనే అసలు సమస్య మొదలవుతుంది. ఆలోచనా స్థాయి, విశ్లేషణ శక్తి తక్కువగా ఉండే పిల్లల్లో పీర్‌ ప్రెజర్‌ ఎక్కువ. బాగా చదివే పిల్లల్లో ఈ రకమైన ప్రెజర్‌ ఉండదు అనుకోవటానికి లేదు. చదువులో నంబర్‌ వన్‌గా ఉన్నా సామాజిక విశ్లేషణ శక్తి తక్కువగా ఉంటే పీర్‌ ప్రెజర్‌కు లోనవుతారు.
 
అయితే ఈ పీర్‌ ప్రెజర్‌లో నెగిటివ్‌, పాజిటివ్‌...ఇలా రెండు కోణాలూ ఉంటాయి. తోటి విద్యార్ధికి తనకంటే ఎక్కువ మార్కులొస్తే తానూ అలా మార్కులు తెచ్చుకోవాలనే పోటీతత్వం మంచిదే! కానీ తోటి విద్యార్థులు సిగరెట్లు తాగుతున్నప్పుడు తనకు వాళ్లలా స్వతంత్రం లేనప్పుడు ఆ ఒత్తిడి ప్రభావం నెగిటివ్‌గా ఉంటుంది. పైగా చెడు అలవాట్లతో కూడిన ఒత్తిడి ఎంతో ప్రమాదకరమైనది. కుటుంబ వ్యవహారాల్లో, స్నేహితుల తీరులో విపరీతమైన వ్యత్యాసం ఉంటే పిల్లలు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతారు. ఉదాహరణకు: ఇంట్లో తల్లితండ్రులు చాలా కఠినంగా ఉండి, బయట స్నేహితులు ఎంతో స్వేచ్ఛగా తమకు నచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే... ఆ పిల్లవాడు ఒత్తిడికి గురవుతాడు.
 
స్నేహితుల దగ్గర ఉన్నది, తనకు దక్కనిది ఏదైనా ఒత్తిడిని పెంచేదే! అవి చెడు అలవాట్లు కావొచ్చు, అడ్డూ అదుపూ లేని స్వేచ్ఛ కావొచ్చు, గర్ల్‌ ఫ్రెండ్స్‌ కావొచ్చు, మోటార్‌ సైకిల్‌ కావొచ్చు....ఏదైనా తన దగ్గర లేనిది తోటి వాళ్ల దగ్గరుంటే పిల్లలు కచ్చితంగా ఎంతో కొంత ఒత్తిడికి గురవుతారు. అలాంటివి తనకూ దక్కాలని ఆశపడతారు. ఇక ఇంట్లో అమ్మానాన్నల గొడవలతో, అశాంతితో కూడిన వాతావరణం ఉంటే పిల్లలు ఎక్కువ సమయం స్నేహితులతో గడపడానికి ఇష్టపడతారు. స్నేహితులు వేసే జోక్‌లు, సరదాలు, మద్యం తాగటం, డ్రగ్స్‌, మోటర్‌ సైకిళ్ల మీద చక్కర్లు కొట్టడాలు... వీటన్నిటినీ ఎంతో ఎంజాయ్‌ చేయటం మొదలుపెడతారు.
 
అలాంటి ఆనందకరమైన వాతావరణంలో ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడతారు. ఆ క్రమంలో వాళ్ల పొగడ్తల కోసం అర్రులు చాస్తారు. స్నేహితులే సర్వస్వం అనుకుంటారు. వారి మాటలకు ఎదురు చెప్తే ఎక్కడ వాళ్లను దూరం చేసుకోవలసి వస్తుందో, అసలు వాళ్లలా అనుకరించకపోతే అది జీవితమే అనిపించుకోదు అనే ధోరణిలో ఆలోచిస్తారు. ఆ క్రమంలో వాళ్లు చెప్పిన పనులన్నీ చేస్తారు. వాళ్లు ఏదైనా చెడు పని చేసినా అది కరెక్టే అనే భావన ఏర్పరుచుకుంటారు.
 
నలుగురు స్నేహితులు సిగరెట్లు తాగుతూ, వారి కుటుంబ సభ్యులు కూడా ఆ అలవాటును వ్యతిరేకించకపోతే...ఆ స్నేహితులు చేసే పని కరెక్టే అనిపిస్తుంది. దాంతో తానూ సిగరెట్‌ తాగటం తప్పు కాదనే అనుకుంటాడు. నా ‘స్నేహితులు మోటార్‌ సైకిళ్ల వంద కిలోమీటర్ల వేగానికి మించి నడుపుతున్నా వాళ్ల ఇళ్లల్లో అడ్డు చెప్పటం లేదు! మరి నేను ‘60 స్పీడులో వెళ్తాను, బైకు కొనిపెట్టండి’ అన్నా నా పేరెంట్స్‌ ఎందుకు కొనిపెట్టరు?’ అనే ధోరణిలో ఆలోచించి అమ్మానాన్నలతో గొడవకు దిగుతారు. ఇక స్నేహితుల చెడు అలవాట్లను కూడా పాజిటివ్‌ కోణంలోనే చూస్తారు.
 
ఇంత సరదాగా జీవితాన్ని ఎంజాయ్‌ చేసే వాళ్లు చేసే పని తప్పెలా అవుతుంది? అనే లాజికల్‌ థింకింగ్‌ మొదలుపెడతారు. ఆ ఆలోచనతో చెడు అలవాట్లను అలవరుచుకుంటారు. ఆ క్రమంలో ఇంట్లో నుంచి డబ్బులు దొంగిలించి స్నేహితులకివ్వటం, వాళ్ల జల్సాల్లో పాలుపంచుకోవటం, దురలవాట్లకు దగ్గరవటం....మొదలైనవి జరుగుతాయి.
 
అమ్మానాన్నలు ఏం చేయాలి?
పిల్లల్ని అదుపులో పెట్టాలనుకోవటం సరికాదు. అలాగే వాళ్ల మీద ఓ కన్నేసి ఉంచటం, ఎప్పుడూ గమనిస్తూ ఉండటం, పర్యవేక్షిస్తూ ఉండటం, అనుమానించటం కూడా సరికాదు. ఇలాంటి పనుల వల్ల, ఈ పదాలను పిల్లల ముందు పలకటం వల్ల పిల్లలు అమ్మానాన్నలకు దూరమవుతారేగానీ... దగ్గరవరు. పిల్లలు పీర్‌ ప్రెజర్‌ బారిన పడకుండా ఉండాలంటే అమ్మానాన్నలు వాళ్లతో స్నేహితులుగా మెలగాలి.
దాంతోపాటు....
ఇంటిని మించిన దేవాలయం లేదు. ఇంటికి మించిన కౌన్సిలింగ్‌ సెంటర్‌ మరొకటి లేదు, ఇంటికి మించినటువంటి ప్రశాంతమైన వాతావరణం మరెక్కడా దొరకదు అనే భావన పిల్లల్లో కలిగించాలి. అది చాలా చిన్న వయసు నుంచే మొదలవ్వాలి.
ఇంట్లోని తోబుట్టువులతో చక్కని అనుబంధం ఏర్పడేలా అమ్మానాన్నలు చూసుకోవాలి.
స్వేచ్ఛపూరితమైన వాతావరణం ఇంట్లో నెలకొనేలా చేయాలి.
పిల్లలు ఏం మాట్లాడినా, అదెంత అసందర్భమైనదైనా, అర్థం లేని విషయమైనా, అర్థం లేకుండా ప్రశ్నించినా, అనుమానాలు వ్యక్తం చేసినా....దేన్నైనా కత్తెరతో కత్తిరించినట్టు అడ్డు చెప్పకుండా మాట్లాడనివ్వాలి.
చెప్పింది శ్రద్ధగా వినాలి. ఏం మాట్లాడినా, ఎలాంటి సలహా అడిగినా, ఎటువంటి ప్రశ్న అడిగినా పాజిటివ్‌ యాంగిల్‌లోనే స్పందించాలి.
అమ్మానాన్నలు మూడు ‘సి’లు పాటించాలి. అవేంటంటే....
క్రిటిసిజమ్‌ (విమర్శించటం): ప్రతి చిన్న విషయానికీ ఎక్కువగా విమర్శించకూడదు.
కామెంట్‌: ప్రతిదీ తప్పుగా చూడటం, ప్రతిదీ ఓ పద్ధతిలో జరగాలని అనుకోవటం, ప్రతి దానికీ ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చేయటం కరెక్టు కాదు.
కంపారిజన్‌: పిల్లల్ని ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడటం సరికాదు.
 
ఇంట్లో ఉండే తోబుట్టువులతో కూడా సరిపోల్చకూడదు. మరీ ముఖ్యంగా పిల్లాడిని, వాడితోనే కంపేర్‌ చేస్తూ ఉంటారు. ఉదాహరణకు...‘నువ్వు ఏడో తరగతిలో ఎంత మంచి మార్కులు తెచ్చుకున్నావు? ఇప్పుడు చూడు నీ మార్కులెంత తగ్గిపోయాయో?’ అని కూడా కంపేర్‌ చేయకూడదు. వయసుతోపాటు పరిస్థితులు మారతాయి.
విమర్శించటం, కామెంట్‌ చేయటం, కంపేర్‌ చేయటం మానుకోవాలి.
అలాగే పీర్‌ ప్రెజర్‌ అనేదాన్ని అరికట్టాలనుకోవటం కూడా కరెక్టు కాదు. అలాంటి ఒత్తిడిని పిల్లలు తట్టుకుని సరైన పద్ధతిలో జీవితంలో ముందుకెళ్లే మెలకువలను నేర్పించాలి.
అమ్మానాన్నలు తమ ఒత్తిడులు, ఆందోళనలను పక్కన పెట్టి పిల్లలు చెప్పే విషయాలను ఓపిగ్గా వినాలి.
పిల్లలతో మాట్లాడేటప్పుడు ‘ఈ మాత్రం చేయలేకపోతున్నావా?’ అంటూ నెగిటివ్‌ యాస్పెక్ట్‌లో మాట్లాడకూడదు. బదులుగా వాళ్లలో ఉన్న పాజిటివ్‌ మార్పులు, బలాల గురించి మాట్లాడాలి.
ప్రేమ పంచటంలో అతివృష్టి, అనావృష్టి...రెండూ పిల్లలకు నష్టమే! ‘అది ఒద్దు, ఈ పని చేయకు, అక్కడికి వెళ్లకు, ఇదే చదువు’....ఇలాంటి అతి ధోరణి పనికిరాదు. అలాగే పిల్లలు అడిగిన వెంటనే ఎంతదైనా కొనివ్వటం కూడా సరికాదు.
పక్కింట్లో పిల్లాడు బైక్‌ కొన్నాడని వాళ్లకు సమ స్థాయిలో ఉండటం కోసం అడగకపోయినా మన పిల్లలకు బైక్‌లు కొనివ్వటం కూడా కరెక్టు కాదు.
డబ్బులు ఉన్నాయి కదా! అని సందర్భం లేకుండా బహుమతులు కొనివ్వకూడదు. అందుకూ ఓ సందర్భం ఉండాలి. బహుమతిగా ఇచ్చే వస్తువు పిల్లాడికి ఎంతవరకూ అవసరం? ఎంతవరకూ ఉపయోగపడుతుంది? అనే విషయాలు ఆలోచించాలి.
సెల్‌ఫోన్‌ లాంటి గాడ్జెట్స్‌ పిల్లలు విపరీతంగా ఉపయోగిస్తూ, చదువును నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ముందు ఆ అలవాటు పెద్దలు మానుకోవాలి.
పిల్లలకు ప్రతి విషయంలో పెద్దలు ఉదాహరణగా నిలవాలి.
ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో అవసరం అయితే తప్ప ఫోన్ల జోలికి వెళ్లకూడదనే నియమాన్ని కుటుంబమంతా అనుసరించాలి.
రాత్రి పొద్దుపోయేవరకూ టీవీలు చూడటం మానేయాలి.
కుటుంబంలో అందరూ ఒకే సమయానికి నిద్ర పోవాలి.
అందరూ కలిసి ఒకే టేబుల్‌ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోంచేయాలి.
ఇలాంటి ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన, ఆనందకరమైన వాతావరణం ఇంట్లో ఏర్పరుచుకోగలిగితే ఎంతటి పీర్‌ ప్రెజర్‌నైనా పిల్లలు తట్టుకుని, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని అలవరుచుకుని, జీవితంలో ఎదగగలుగుతారు.
 
డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి,
సైకియాట్రిస్ట్‌, లూసిడ్‌ డయాగ్నాస్టిక్స్‌,
బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.