మందలిస్తే తిండి మానేస్తాడేమిటి?

మా బాబు 8 వ తరగతి చదువుతున్నాడు. కానీ, ఏదో నామమాత్రంగానే తప్ప శ్రద్ధగా ఎప్పుడూ చదవడు. మార్కులు ఎప్పుడూ 50 శాతానికి మించడం లేదు. ఈ విషయమై ఎప్పుడైనా గట్టిగా మందలిస్తే రెండు మూడు రోజులు తిండి మానేస్తాడు. నేను చెప్పేది నీ భవిష్యత్తు కోసమే అని ఎంత చెప్పినా తన ధోరణి తనదే తప్ప మన మాట వినిపించుకోడు. ఈ స్థితిలో నన్ను ఏం చేయమంటారో చెప్పండి.
- డి. రాజేశ్వర్‌, మెదక్‌
 
తక్కువ మార్కులు రావడానికి అనేక కార ణాలు ఉంటాయి. అందువల్ల ఏ కారణం వల్ల అతనికి తక్కువ మార్కులు వస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా రక్తహీనత లాంటి సమస్య ఏమైనా ఉందేమో డాక్టర్‌ను సంప్రదించి తెలుసుకోండి. ముందు శారీరక సమస్యలు ఏమీ లేవని తేలిపోతే, ఆ తర్వాత మానసిక సమస్యలు ఏమైనా ఉన్నాయేమో ఆరా తీయవచ్చు. అతని ఐ. క్యూ లెవెల్‌ ఎంతో కూడా తెలుసుకోవాలి. వాటన్నింటికీ వైద్య చికిత్సలు, థెరపీలు ఉంటాయి. అవేమీ చేయకుండా అదే పనిగా మీరు గట్టిగా మందలిస్తూ పోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. పైగా, మందలించిన ప్రతిసారీ అతడు రెండు మూడు రోజుల పాటు తిండి మానేస్తున్నాడూ అంటే మీ మాటలు అత డిని చాలా తీవ్రంగానే గాయపరుస్తున్నాయని అర్థం. ఇక నుంచి మీరు అతన్ని మందలించడం మానేసి అతని శారీరక, మానసిక స్థితి గురించి తెలుసుకోండి. అవన్నీ బాగానే ఉంటే ఆ తర్వాత ఎవరైనా మానసిక నిపుణుడి వద్దకు తీసుకు వెళ్లండి. కచ్చితంగా అతడు బాగుపడే అవకాశాలు ఉంటాయి. మీరు అనుకున్నట్లు మునుముందు మంచి మార్కులు సంపాదించే అవకాశాలూ ఉంటాయి.
- డాక్టర్‌ సి. చలపతి రావు
కన్సల్టెంట్‌ సైకాలజిస్ట్‌